Begin typing your search above and press return to search.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఫార్ములా.. నాలుగు వర్గాలకు నాలుగు కీలక పదవులు

జగ్గారెడ్డికి ఈ బాధ్యత అప్పగిస్తే.. పార్టీ ప్రచార వ్యవస్థకు ఒక స్పష్టమైన నాయకత్వం లభించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

By:  A.N.Kumar   |   9 Aug 2026 2:23 PM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఫార్ములా.. నాలుగు వర్గాలకు నాలుగు కీలక పదవులు
X

తెలంగాణ కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులపై చర్చ మళ్లీ ఊపందుకుంది. టీపీసీసీని మరింత బలోపేతం చేయడంతో పాటు.. పార్టీలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను పాటించేలా కొత్త నాయకత్వ నిర్మాణానికి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఒక్కరి చేతుల్లో కాకుండా.. బహుళ నాయకత్వం

ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ కొనసాగుతున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో.. మిగిలిన ప్రధాన సామాజిక వర్గాలకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచనతో అధిష్ఠానం ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. పార్టీకి వివిధ వర్గాల్లో మరింత బలమైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు.. ఆయా సామాజిక వర్గాల నాయకులను సమన్వయం చేసుకునేందుకు ఈ ఫార్ములాను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకే పీసీసీ అధ్యక్షుడిపై సంస్థాగత బాధ్యతలన్నీ కేంద్రీకృతం కాకుండా.. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

నాలుగు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి బలరాం నాయక్, మైనారిటీ వర్గం నుంచి అజ్మతుల్లా లేదా ఒబైదుల్లా, ఓసీ వర్గం నుంచి రోహిన్ రెడ్డి లేదా పద్మావతి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

అయితే వీరిలో తుది ఎంపిక ఎవరికి దక్కుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ పేర్లను జాతీయ నాయకత్వం పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం టీపీసీసీలో కొనసాగుతున్న నాయకత్వ సమీకరణాల్లో ఈ నిర్ణయం ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందనే ఆసక్తి నెలకొంది.

జగ్గారెడ్డికి కీలక బాధ్యత?

వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిపైనా కాంగ్రెస్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీ ప్రచారాన్ని సమన్వయం చేయడం.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు రాజకీయంగా సమాధానం ఇవ్వడం వంటి అంశాల్లో ప్రచార కమిటీ కీలక పాత్ర పోషించనుంది.

జగ్గారెడ్డికి ఈ బాధ్యత అప్పగిస్తే.. పార్టీ ప్రచార వ్యవస్థకు ఒక స్పష్టమైన నాయకత్వం లభించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

సామాజిక సమీకరణమే అసలు వ్యూహమా?

తెలంగాణ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఎప్పటికప్పుడు కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పార్టీకి విస్తృతమైన సామాజిక మద్దతు సమీకరించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల ఫార్ములా కేవలం పదవుల పంపిణీకే పరిమితమైతే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. ఎవరికెంత బాధ్యత? ఏ ప్రాంతంపై ఎవరి పట్టు? పార్టీ నిర్ణయాల్లో వారి పాత్ర ఎంత? అనే అంశాలపై స్పష్టత అవసరం. లేదంటే బహుళ నాయకత్వం పార్టీకి బలంగా మారాల్సింది పోయి.. అంతర్గత పోటీకి కారణమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

మొత్తంగా చూస్తే.. టీపీసీసీలో ప్రతిపాదిత మార్పులు కేవలం కొత్త పదవుల భర్తీగా చూడలేం. తెలంగాణలో కాంగ్రెస్ తన సామాజిక పునాదిని మరింత విస్తరించుకోవడంతో పాటు.. పార్టీని ఎన్నికలకు మరింత సన్నద్ధం చేసే వ్యూహంలో భాగంగానే ఈ కసరత్తు జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అధిష్ఠానం తుది నిర్ణయంపైనే ఉంది. ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కుతుంది? ప్రచార కమిటీ పగ్గాలు జగ్గారెడ్డికే వస్తాయా? అన్నది త్వరలోనే తేలనుంది.