ఇరాన్ లో బ్లాక్ రెయిన్.. ఎంత డేంజర్ అంటే?
యుద్ధం ఆర్థిక వ్యవస్థలను మాత్రమే దెబ్బ తీయదు. అంతకు మించిన నష్టాల్ని తీసుకొస్తుంది.
By: Garuda Media | 11 March 2026 9:49 AM ISTయుద్ధం ఆర్థిక వ్యవస్థలను మాత్రమే దెబ్బ తీయదు. అంతకు మించిన నష్టాల్ని తీసుకొస్తుంది. పాడు యుద్ధంతో పర్యావరణానికి జరిగే హాని మరింత ఎక్కువ. నాగరిక సమాజంలో జరిగే యుద్ధంలో పోయే ప్రాణాల కంటే కూడా పర్యావరణానికి జరిగే హాని చాలా చాలా ఎక్కువ. దీని ఫలితాల్ని దేశాలతో సంబంధం లేకుండా అందరూ అనుభవించాల్సి ఉంటుంది. ఇక.. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఫలితాలు ఇట్టే అనుభవంలోకి వస్తాయి. ఇరాన్ ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.
రెండు రోజుల క్రితం ఇరాన్ లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయటం తెలిసిందే. ఈ దాడుల్ని అమెరికా సైతం తప్పు పట్టింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ చేసిన ఈ పనిని అమెరికా తీవ్రంగా స్పందించింది.ట్రంప్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు కేంద్రాలపై వైమానిక దాడులతో ఇరాన్ వెన్ను విరచాలన్నది ఇజ్రాయెల్ ఆలోచన అయితే.. ఇరాన్ నష్టపోవాలే కానీ.. ఇరాన్ కు చెందిన విలువైన వనరులకు నష్టం కలగకపోతే.. వాటిని సొంతం చేసుకోవాలన్న దూరాలోచన అగ్రరాజ్యానిది.
మిగిలిన అంశాలు పక్కన పెడితే.. ఇరాన్ లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతంలో నల్లటి వర్షం కురిసినట్లుగా ఇరాన్ కు చెందినపలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ నల్లటి అమ్ల వర్షం మహా డేంజర్ గా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ వాన కారణంగా తలనొప్పి.. శ్వాస సమస్యలు వస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. బ్లాక్ రెయిన్ తో భవనాలు.. వాహనాల మీద కలుషిత జలాలు పెద్ద ఎత్తున పేరుకుపోవటం మరో పెద్ద సమస్యగా మారింది. దీనికి ఇరానీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బ్లాక్ కెమికల్ రెయిన్.. మామూలుగా కురిసే కెమికల్ రెయిన్ కంటే ఎన్నో రెట్లు హాని చేస్తుందని చెబుతున్నారు. వాతావరణ కాలుష్యం మీద పరిశోధనలు చేసే ఇరాన్ కు చెందిన రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. మామూలు వర్షాలతో వాతావరణం నుంచి వాయు కాలుష్యాలు తగ్గిపోవటం తెలిసిందే. కానీ.. మనిషి చేసిన యుద్దం గాయాలకు ఫలంగా కురిసే ఈ బ్లాక్ కెమికల్ రెయిన్ పుణ్యమా అని శ్వాసకోశ వ్యాధులు.. చర్మ వ్యాధులు పెరగటమే కాదు.. గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారు.. పెద్ద వయస్కులతో పాటు చిన్నపిల్లలు అనేక సమస్యల్ని ఎదుర్కోవటం జరుగుతుందని ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచం కోరని ఈ యుద్ధం మరెంత వినాశనానికి కారణమవుతుందో?
