యూరప్‌లో అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. పగటిపూటే కమ్ముకున్న చీకట్లు!
ఖగోళ ప్రేమికులకు.. వీక్షకులకు ఆగస్టు 12, 2026న ఒక అద్భుతమైన అనుభూతి లభించింది.
By: A.N.Kumar | 13 Aug 2026 10:38 AM ISTఖగోళ ప్రేమికులకు.. వీక్షకులకు ఆగస్టు 12, 2026న ఒక అద్భుతమైన అనుభూతి లభించింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా యూరప్‌లోని స్పెయిన్, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, ఉత్తర రష్యా తదితర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో కనిపించిన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం కావడంతో ఈ ఖగోళ వింతను తిలకించడానికి అశేష జనవాహిని బహిరంగ ప్రదేశాలు, ప్రత్యేక వీక్షణ కేంద్రాలకు తరలివచ్చారు.
సూర్యుడు, చంద్రుడు, భూమి దాదాపు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చి సూర్యుడి కాంతిని పూర్తిగా అడ్డుకున్న ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడటంతో కొన్ని ప్రాంతాల్లో పగటిపూటనే చీకటి కమ్ముకుంది. సంపూర్ణ గ్రహణం అత్యధికంగా రెండు నిమిషాల లోపే కొనసాగినప్పటికీ ఆ కొద్ది సమయం వీక్షకులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించింది.
స్పెయిన్‌లో కనువిందు చేసిన గ్రహణం
స్పెయిన్‌లోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మాడ్రిడ్, జరగోజా, బిల్బావో, వాలెన్సియా, అస్టూరియాస్ ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీక్షణ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోకి చేరుకుని గ్రహణాన్ని తిలకించారు. మాడ్రిడ్‌లో గ్రహణం గరిష్ఠ దశ 6:32 గంటల ప్రాంతంలో కనిపించగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ దశ సుమారు కొన్ని పదుల సెకన్ల నుంచి రెండు నిమిషాల వరకు కొనసాగింది.
పశ్చిమ యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణం సూర్యాస్తమయానికి సమీపంలో సంభవించడం మరో ప్రత్యేకతగా నిలిచింది. దీంతో సూర్యుడు అస్తమించే సమయంలోనే చంద్రుడు సూర్యుడిని కప్పివేస్తూ కనిపించిన అరుదైన ‘సన్‌సెట్ ఎక్లిప్స్’ దృశ్యం ఆవిష్కృతమైంది. నాసా ప్రకారం స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు కనిపించింది.
ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్‌లోనూ సంపూర్ణ దశ
గ్రహణం సంపూర్ణంగా కనిపించిన ప్రాంతాల్లో ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ కూడా ఉన్నాయి. ఉత్తర రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలోనే సంపూర్ణ గ్రహణం కనిపించగా గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్‌లో సాయంత్రం వేళ ఈ అద్భుతం దర్శనమిచ్చింది. పోర్చుగల్‌లోని చిన్న ప్రాంతంలోనూ సంపూర్ణ గ్రహణం కనిపించింది.
ఇక యూరప్‌లోని అనేక ఇతర దేశాలు, వాయవ్య ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా కాకుండా పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. లండన్‌లో సూర్యుడి దాదాపు 91 శాతం భాగం చంద్రుడి వెనుకకు వెళ్లినట్లు నాసా వివరించింది.
శాస్త్రవేత్తలకు కీలక అవకాశం
సంపూర్ణ సూర్యగ్రహణం శాస్త్రవేత్తలకు కూడా ఎంతో ప్రాధాన్యమైనది. సాధారణ పరిస్థితుల్లో సూర్యుడి ప్రకాశవంతమైన ఉపరితలం కారణంగా స్పష్టంగా పరిశీలించడం కష్టమైన బాహ్య వాతావరణం ‘కరోనా’ను సంపూర్ణ గ్రహణ సమయంలో అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. చంద్రుడు సూర్యుడి ప్రకాశవంతమైన ముఖాన్ని పూర్తిగా కప్పివేసిన కొద్దిసేపట్లో కరోనా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో సూర్యుడి వాతావరణం, దాని కార్యకలాపాలపై పరిశోధనలకు ఈ తరహా గ్రహణాలు ఎంతో ఉపయోగపడతాయి.
భారత్‌కు కనిపించని ఖగోళ అద్భుతం
అయితే ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భారతీయులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకపోయింది. గ్రహణం భారతదేశానికి అనుకూలమైన పగటి సమయంలో కాకుండా రాత్రి సమయంలో చోటుచేసుకోవడంతో భారత ఉపఖండం నుంచి ఇది కనిపించలేదు. అందువల్ల యూరప్‌లో ప్రజలు ఆకాశం వైపు చూస్తూ ఈ ఖగోళ అద్భుతాన్ని ఆస్వాదిస్తుండగా భారత్‌లో మాత్రం ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది.
2026లో ఏర్పడిన ఏకైక సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే కావడం మరో విశేషం. యూరప్ ప్రధాన భూభాగానికి 1999 తర్వాత మళ్లీ సంపూర్ణ సూర్యగ్రహణం రావడంతో ఖగోళ ప్రేమికుల్లో ఈ ఘటనపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
