2 నెలల్లో గూగుల్ లో తెగ వెతికిన టాప్ 5 ఐపీవోలు!
జులై.. ఆగస్టు నెలల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి.. దుమ్ము దులిపిన టాప్ 5 ఐపీవోలు.. వాటికి వచ్చిన ఆదరణ గురించి వివరాలు ఆసక్తికరమని చెప్పాలి.
By: Garuda Media | 27 Aug 2025 2:46 PM ISTమార్కెట్ అప్ అండ్ డౌన్ లు ఉన్నప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐపీవోలకు స్పందన ఎలా ఉంటుందన్న సందేహం సహజం. మార్కెట్ మాంచి జోష్ లో ఉన్నప్పుడు.. బుల్ పరుగులు తీస్తున్నప్పుడు మార్కెట్ సానుకూలంగా ఉండటంతో పాటు సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఇలాంటి వేళలో మదుపరుల నుంచి వచ్చే స్పందన వేరుగా ఉంటుంది. అందుకు భిన్నమైన పరిస్థితుల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. అందరి చూపు తమ మీద పడేలా చేయటమే కాదు.. పెద్ద ఎత్తున ఈ ఐపీవోల గురించి శోధించటం.. అంతే ఎక్కువగా మదుపు చేసే ఐపీవోలు ఏమిటన్నది ఆసక్తికర అంశంగా చెప్పాలి.
జులై.. ఆగస్టు నెలల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి.. దుమ్ము దులిపిన టాప్ 5 ఐపీవోలు.. వాటికి వచ్చిన ఆదరణ గురించి వివరాలు ఆసక్తికరమని చెప్పాలి. ఈ ఐపీవోల గురించి గూగుల్ లో తెగ వెతికేయటమే కాదు.. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇంతకూ ఆ 5 ఐపీవోలు ఏవి? వాటికి వచ్చిన ఆదరణ ఎంత? లాంటి వివరాల్లోకి వెళితే..
ఆదిత్య ఇన్ఫోటెక్
ఎంట్రీలోనే సానుకూల స్పందనను సొంతం చేసుకుందీ ఐపీవో. రూ.1300 కోట్ల సమీకరణే లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ ఐపీవో.. పబ్లిక్ ఇష్యూ ధర రూ.675తో పోలిస్తే బీఎస్ఈలో రూ.1018, ఎన్ఎస్ఈలో రూ.1015గా నమోదైంది. ఇందులో రూ.500 కోట్ల ఫ్రెష్ ఇష్యూ కాగా.. రూ.800 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సేకరించింది.
ఎన్ఎస్ డీఎల్
జులై 30న మార్కెట్ లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ గురించి చెప్పాలంటే.. డిపాజిటరీ సంస్థగా చెప్పాలి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ తన మొదటి పబ్లిక్ ఆఫర్ ను ప్రకటించింది.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పబ్లిక్ ఆఫర్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే తాను అనుకున్న దాని కంటే మిన్నగా నిధుల్ని సమీకరించింది. ఈ సంస్థ ఐపీవో లక్ష్యం రూ.700-800 కోట్లు మార్కెట్ నుంచి సమీకరించటం. అయితే.. ఈ ఐపీవోకు వచ్చిన సానుకూల స్పందన ఎంతో తెలుసా? కొద్ది గంటల్లోనే రూ.4వేల కోట్లు సమీకరించటం.
స్టాక్ మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కోసం మొత్తం ఈ ఐపీవోకు 3.6 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయని.. ఎల్ ఐసీ.. సీఐ వంటి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కూడా సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. వీరి నుంచే రూ.1200 కోట్లను సమీకరించినట్లుగా చెబుతున్నారు. ఈ సంస్థలో వాటాదారులుగా ఉన్న వారికే ఐపీవోలో అనుమతి లభించింది.
జీఎన్ జీ ఎలక్ట్రానిక్స్
ల్యాప్ టాప్ లు.. డెస్కు టాప్ లను రీఫర్బిషింగ్ చేసే ఈ సంస్థ భారతదేశంతో పాటు అమెరికా.. ఐరోపాల్లోనూ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఈ సంస్థ మార్కెట్లోకి తొలిసారిగా వచ్చింది. వీరి ఐపీవోకు విశేష స్పందన లభించింది. తాను అనుకున్న దాని కంటే మిన్నగా పెట్టుబడుల్ని సొంతం చేసుకుంది. ఐపీవో ద్వారా మొత్తం రూ.460.4 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించింది. వీటిల్లో రూ.400 కోట్లు ఫ్రెష్ ఇష్యూ అయితే.. రూ.60 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించింది అంతే.
హైవే ఇన్ ఫ్రాస్ట్రక్చర్
రూ.130 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీవోకు వచ్చిన ఈ సంస్థకు మార్కెట్ లో భారీ స్పందన లభించింది. ఆగస్టు తొలి వారం ఐపీవోకు వచ్చిన ఈ సంస్థ లిస్టింగ్ లో అదరగొట్టింది. ఐపీవో ముగిసే నాటికి మదుపర్ల నుంచి ఏకంగా 300.6 రెట్ల స్పందన లభించింది. సంస్థ అంచనాకు మించి బిడ్లు రావటం సానుకూలాంశంగా చెప్పాలి. 2025లో ఇప్పటివరకు అత్యధిక ప్రీమియంతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఐపీవోగా నిలిచింది.
రీగల్ రిసోర్సెస్
ఆగస్టు రెండో వారంలో ఐపీవోగా మార్కెట్లోకి వచ్చింది. రూ.96-102 ధర రేంజ్ లోకి షేర్లు జారీ చేసేందుకు ముందుకు వచ్చిన ఈ సంస్థకు సానుకూల స్పందన లభించింది. భారీ డిమాండ్ నేపథ్యంలో మొత్తం రూ.306కోట్ల లక్ష్యానికి మించిన స్పందన లభించింది. షేర్ల జారీ ద్వారా రూ.210 కోట్లు.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.96 కోట్లను సమీకరించింది.
