విదేశాల్లో భారతీయుల హవా.. ఏ దేశంలో ఎంత మంది ఉన్నారో తెలుసా?
ప్రపంచపటంలో ఏ మూలకు వెళ్లినా భారతీయ మూలాలు ఉన్న ముఖం.. ప్రతిభతో మెరిసే ఒక భారతీయుడు కనిపించడం మన దేశానికే గర్వకారణం.
By: A.N.Kumar | 3 Oct 2026 6:16 PM ISTప్రపంచపటంలో ఏ మూలకు వెళ్లినా భారతీయ మూలాలు ఉన్న ముఖం.. ప్రతిభతో మెరిసే ఒక భారతీయుడు కనిపించడం మన దేశానికే గర్వకారణం. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, మెరుగైన జీవనావకాశాలు, ఉన్నత స్థాయి జీవనశైలి లక్ష్యంగా విదేశాలకు పయనమైన భారతీయులు నేడు ఆయా దేశాల పురోగతిలోనే కీలక భాగస్వాములుగా మారారు. ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా విస్తరించిన భారతీయ ప్రవాసులు తమ కష్టపడే తత్వంతో శ్రమతో.. అత్యుత్తమ ప్రతిభతో భారత్ ఘనతను ప్రపంచ నలుమూలలా చాటుతున్నారు.
ఇటీవలి నివేదికలు, 2026 నాటి గణాంకాల ప్రకారం విదేశాల్లో అత్యధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ సాంకేతిక, వ్యాపార రాజధానిగా విలసిల్లుతున్న అమెరికాలో ప్రస్తుతం సుమారు 61 లక్షల మంది భారతీయులు స్థిరపడ్డారు. ఐటీ నిపుణులు, అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలతో పాటు లక్షలాది మంది విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులు తీస్తున్నారు.
రెండో స్థానంలో నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సుమారు 43 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో నిర్మాణ రంగం నుంచి ఫైనాన్స్, రిటైల్, టెక్నాలజీ వరకు ప్రతీ రంగంలోనూ మనవాళ్ల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కెనడాలో సుమారు 32 లక్షల మంది భారతీయులు నివసిస్తూ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా పంజాబ్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వెళ్లిన వేలాది మంది అక్కడ శాశ్వత నివాస అవకాశాలు పొంది బలమైన కమ్యూనిటీలుగా రూపుదిద్దుకున్నారు.
2026 నాటికి విదేశాల్లో భారతీయులు అధికంగా ఉన్న టాప్-10 దేశాలు చూస్తే..
1. అమెరికా – 61 లక్షలు
2. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) – 43 లక్షలు
3. కెనడా – 32 లక్షలు
4. మలేషియా – 29 లక్షలు
5. సౌదీ అరేబియా – 28 లక్షలు
6. మయన్మార్ – 20 లక్షలు
7. దక్షిణాఫ్రికా – 18 లక్షలు
8. శ్రీలంక – 16 లక్షలు
9. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) – 13 లక్షలు
10. కువైట్ – 10 లక్షలు
వీరితో పాటు గల్ఫ్ మిగతా దేశాల్లో మన కార్మికులు, ఇంజినీర్లు, వైద్య రంగ నిపుణులు విశేష సేవలందిస్తున్నారు. మలేషియా, మయన్మార్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బ్రిటన్ దేశాలలోనూ తరాల నాటి భారతీయ సాంస్కృతిక సంబంధాలు విలసిల్లుతున్నాయి.
మనం విదేశాలలో కేవలం సంఖ్యపరంగానే కాకుండా ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్నాము. స్థానిక విదేశీ ఆర్థిక వ్యవస్థలకు వెన్నుముకగా నిలుస్తూనే మరోవైపు మాతృభూమితో తమ ప్రేమానురాగాలను, సాంస్కృతిక బంధాలను ముడివేసుకుని భారతీయ మూలాలను కాపాడుకుంటున్నారు. విదేశీ గడ్డపై మన సంస్కృతిని, సామర్థ్యాన్ని సగర్వంగా చాటుతున్న ఈ భారతీయ జనాభా నిశ్చయంగా మన దేశానికి అతిపెద్ద గర్వకారణం.
