Begin typing your search above and press return to search.

హీరో సామ్యం ఒక్క రోజులో కుప్ప కూలిపోవడం కుద‌రదు

టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోల స్టార్‌డమ్.. వారు అందుకుంటున్న వందల కోట్ల పారితోషికాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By:  Sivaji Kontham   |   14 May 2026 2:00 PM IST
హీరో సామ్యం ఒక్క రోజులో కుప్ప కూలిపోవడం కుద‌రదు
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోల స్టార్‌డమ్.. వారు అందుకుంటున్న వందల కోట్ల పారితోషికాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు హీరోలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? పారితోషికాలు తగ్గించుకోవాలి కదా? వంటి ప్రశ్నలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ `హీరో-సెంట్రిక్` వ్యవస్థ అనేది ఒక్క రోజులో అకస్మాత్తుగా ఊడిపడినది కాదు. దశాబ్దాల పాటు మన స్టార్లు తమ అద్భుత ప్రతిభతో, శ్రమతో నిర్మించుకున్న బలమైన పునాది ఇది. నేడు దీనిని విమర్శించే వారు ఈ హీరోయిజం వెనుక ఉన్న సుదీర్ఘ పరిణామ క్రమాన్ని విస్మరిస్తున్నారు.

ముఖ్యంగా 90ల‌లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ల రాకతో టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో సాధారణ సినిమాలు కేవలం 1-2 కోట్లు వసూలు చేస్తే.. చిరంజీవి `హిట్లర్` 20 కోట్లు, నాగార్జున `హలో బ్రదర్` 18 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ దిశనే మార్చేశాయి. స్టార్ హీరోతో సినిమా తీస్తే బడ్జెట్‌కు రెట్టింపు లాభాలు వస్తాయనే భరోసా అప్పట్లోనే నిర్మాతలలో స్థిరపడింది. ఈ నమ్మకమే నేడు హీరోల పారితోషికాలు పెరగడానికి.. భారీ బడ్జెట్లు వెచ్చించడానికి ప్రధాన కారణమైంది.

2000వ దశకం నుండి కథ కంటే కూడా హీరో ఇమేజ్, మ్యూజిక్ డైరెక్టర్ వంటి పేర్లనే బ్రాండ్‌గా చూస్తూ నిర్మాతలు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా.. కేవలం స్టార్ పవర్ వల్లే బిజినెస్ క్లోజ్ అయి లాభాలు వచ్చే పరిస్థితి ఉండటంతో.. హీరోలే ఇండస్ట్రీకి వెన్నెముకగా మారారు. ఈ క్రమంలోనే హీరోల చుట్టూ తిరిగే సినిమాల సంఖ్య పెరిగింది. ఇది ఒక వ్యాపార వ్యూహంగా మారిపోయిందే తప్ప... ఎవరో ఒకరు కావాలని రుద్దిన వ్యవస్థ కాదు.

ప్రస్తుత ఓటీటీ యుగంలో కూడా ఈ హీరో ఫ్యాక్టర్ తగ్గకపోగా మరింత బలపడింది. 2016 తర్వాత అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి వేదిక‌లు రావడంతో సినిమాలకు అదనపు ఆదాయం తోడైంది. థియేట్రికల్ బిజినెస్ కాస్త అటు ఇటు అయినా.. కేవలం హీరో పేరు చూసి వచ్చే ఓటీటీ డీల్స్ నిర్మాతలను గట్టెక్కిస్తున్నాయి. చిన్న, మీడియం సినిమాలకు కథ కావాలని కోరే ఓటీటీ సంస్థలు కూడా పెద్ద హీరోల సినిమాలకు మాత్రం వారి స్టార్ పవర్ చూసే భారీ మొత్తాలను ఆఫర్ చేస్తున్నాయి.

దశాబ్దాల పాటు పాతుకుపోయిన ఈ హీరో-సెంట్రిక్ వ్యవస్థను ఒక్క రోజులో మార్చడం లేదా కూల్చేయడం సాధ్యం కాని పని. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా భారీ కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలకే థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో హీరో సామ్యం బ‌ల‌ప‌డుతూనే ఉంటుంది.. అయితే కథా బలం యాడైతేనే హీరో ప‌వ‌రేంటో నిరూపిత‌మ‌వుతుంది. ఆ రెండు సూప‌ర్ ప‌వ‌ర్స్ ఒక‌దానితో ఒక‌టి ముడిప‌డిన‌వి. ఏది ఏమైనా టాలీవుడ్ మనుగడలో, పాన్ వ‌ర‌ల్డ్ (ఇండియా) రేసింగులో హీరోయిజం అనేది ఒక విడదీయలేని భాగం అని అంగీక‌రించి తీరాలి.