APలో టాలీవుడ్ ఎక్కడో ముందు తేలాలి కదా రఘురామా!
సరైన ప్లానింగ్ ఉంటే ప్రస్తుతం 10 కోట్లు అవుతున్న సినిమా బడ్జెట్‌ను సులభంగా 5 కోట్లకు (అంటే 50 శాతం) తగ్గించవచ్చని ఆయన ఉదాహరణతో వివరించిన తీరు పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
By: Sivaji Kontham | 5 July 2026 2:01 PM ISTఇటీవలి కాలంలో భారతీయ సినీరంగానికి పాన్ ఇండియా విజయాలను అందిస్తూ టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తోంది. అయితే అదే స్థాయిలో గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోతుండటం ఇప్పుడు మేకర్స్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (RRR) టాలీవుడ్‌కు ఒక సెన్సేషనల్ ఐడియా ఇచ్చారు. సరైన ప్లానింగ్ ఉంటే ప్రస్తుతం 10 కోట్లు అవుతున్న సినిమా బడ్జెట్‌ను సులభంగా 5 కోట్లకు (అంటే 50 శాతం) తగ్గించవచ్చని ఆయన ఉదాహరణతో వివరించిన తీరు పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
తెలుగు సినిమాల బడ్జెట్ ఇంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం.. చాలా మంది సాంకేతిక నిపుణులను ముంబై, చెన్నై వంటి ఇతర రాష్ట్రాల నుండి రప్పించాల్సి రావడమేనని రఘురామకృష్ణ రాజు గుర్తుచేశారు. అలా బయటి నుండి వచ్చే టెక్నీషియన్ల రవాణా, లగ్జరీ బస ఖర్చులతో పాటు, వారు ఇక్కడి ప్రాజెక్టులకు రెట్టింపు పారితోషికాలు వసూలు చేస్తున్నారని వివరించారు. దీనికి పక్కా పరిష్కారంగా.. చలనచిత్ర పరిశ్రమ ప్రభుత్వంతో కలిసి పనిచేసి.. టెక్నీషియన్లు ఇక్కడే స్థిరంగా ఉండేలా వారి కోసం ప్రత్యేకంగా `ఫిల్మ్ హౌసింగ్ కాలనీలను` ఏర్పాటు చేయాలని ల్యాండ్‌మార్క్ సలహా ఇచ్చారు.
ఈ మేధోపరమైన సలహా ప్రాక్టికల్‌గా సాధ్యం కావాలంటే.. అటు సినిమా రంగంపై, ఇటు రాజకీయంపై పూర్తి అవగాహన ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందడుగు వేయాలని రఘురామకృష్ణ రాజు సూచించారు. ఏపీలో సినిమా షూటింగ్‌లను, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహించడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే సానుకూలంగా ఉన్నందున ఈ టాపిక్ ఉన్నత స్థాయి చర్చకు వస్తే పరిశ్రమకు పెద్ద ప్లస్ అవుతుంది. టెక్నీషియన్లందరికీ ఒకే చోట వసతి లభించడం వల్ల ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ సులువై, షూటింగ్ ఆలస్యమై `డేట్స్ వేస్ట్ కావడం` అనే ప్రధాన సమస్య తప్పుతుంది. ఇది పరోక్షంగా నిర్మాణ వ్యయాన్ని సగానికి తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే కేవలం వసతి కల్పిస్తేనే గ్లోబల్ స్టాండర్డ్స్ వైపు దూసుకుపోతున్న ఆధునిక టాలీవుడ్ సమస్యలు పూర్తిగా తీరవు. ఎందుకంటే ముంబై (బాలీవుడ్) లేదా చెన్నై (కోలీవుడ్) లలో ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) సంస్థలు, ల్యాబ్స్, అప్‌డేటెడ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కేవలం హౌసింగ్ కాలనీలతో సరిపెట్టకుండా... ఆధునిక సదుపాయాలతో కూడిన ఫిల్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, రాయితీలను కూడా ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చినప్పుడే టాప్ టెక్నీషియన్లు ఇక్కడ స్థిరపడటానికి 100 శాతం మొగ్గు చూపుతారు.
ఓవరాల్‌గా `కార్మిక వ్యయం` తగ్గించే క్రమంలో సినిమాల `సాంకేతిక నాణ్యత` దెబ్బతినకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి అంతర్జాతీయ స్థాయి సినిమాలకు హాలీవుడ్ నిపుణులు అవసరం కావచ్చు కానీ.. చిన్న- మధ్య తరహా చిత్రాలకు ఆర్.ఆర్.ఆర్ సూచించిన వ్యూహం తక్షణమే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇప్పించి.. ఏపీలోనే ఒక పవర్‌ఫుల్ `లోకల్ టాలెంట్ పూల్`ను తయారు చేయగలిగితే... భవిష్యత్తులో టాలీవుడ్ ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరమే లేకుండా స్వయంసమృద్ధిని సాధించగలదు. ముఖ్యంగా విద్యను వ్యాపారం చేయకుండా, ఉద్యోగ -ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే సాంకేతిక విద్యను ఉచితంగా అందించే ఏర్పాటుపై రఘురామ- పవన్ కల్యాణ్ వంటి ప్రముఖులు ఒక యోచన చేస్తే కచ్ఛితంగా స్థానిక ప్రతిభ అందుబాటులోకొస్తుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఏపీలో మరో టాలీవుడ్‌ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలను తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. అసలు ఏపీలో టాలీవుడ్ ఎక్కడుందో తేలితేనే కదా.. డిప్యూటీ సీఎం తనకు తానుగా పూనుకుని తదుపరి కార్యాచరణ ఏం చేయాలో ఆలోచించగలరు!!
