100 మీటర్ల క్యూ దాటితే టోల్ ఫ్రీనా? అసలు నిజం ఇదే!
టోల్ ప్లాజా దగ్గరకు చేరుకున్నప్పుడు వాహనాల బారులు తీరడం వాహనదారులకు తరచూ ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా పండుగలు, సెలవులు, వారాంతాల్లో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది
By: A.N.Kumar | 22 Sept 2026 11:00 PM ISTటోల్ ప్లాజా దగ్గరకు చేరుకున్నప్పుడు వాహనాల బారులు తీరడం వాహనదారులకు తరచూ ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా పండుగలు, సెలవులు, వారాంతాల్లో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద వాహనాల క్యూ 100 మీటర్లు దాటితే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్ఏఐ) స్పష్టం చేసింది.
100 మీటర్ల నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది?
టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీకి సంబంధించి 100 మీటర్ల నిబంధన ఉందన్న ప్రచారం చాలాకాలంగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీంతో వాహనదారుల్లో ఒక రకమైన అపోహ ఏర్పడింది. క్యూ టోల్ ప్లాజా నుంచి 100 మీటర్లు దాటితే బ్యారియర్ ఎత్తి వాహనాలను ఉచితంగా పంపిస్తారనే భావన ఏర్పడింది. కానీ నేషనల్ హైవేస్ ఫీజు (డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్) రూల్స్, 2008లో ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలను టోల్ లేకుండా అనుమతించాలనే నిబంధన లేదని ఎన్.హెచ్ఏఐ తెలిపింది.
మరి టోల్ ఎప్పుడు మినహాయిస్తారు?
టోల్ ఫీజు మినహాయింపు అనేది క్యూ పొడవుపై ఆధారపడి ఉండదు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా మినహాయింపు పొందిన వాహనాలకు మాత్రమే టోల్ చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే సాధారణ వాహనదారులు టోల్ ప్లాజా వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చినా, కేవలం క్యూ 100 మీటర్లు దాటిందనే కారణంతో టోల్ చెల్లించకుండా వెళ్లే హక్కు ఉండదని ఎన్.హెచ్ఏఐ స్పష్టం చేసింది.
సోషల్ మీడియా పోస్టులతో గందరగోళం
వాస్తవానికి టోల్ ప్లాజాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, ఫాస్ట్ టాగ్ వంటి అంశాలపై పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటిని కలిపి లేదా తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే 100 మీటర్ల క్యూ నిబంధనకు సంబంధించిన ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది. ఇలాంటి సమాచారాన్ని చూసి టోల్ ప్లాజా వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగడం లేదా టోల్ చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
వాహనదారులకు ఎన్.హెచ్ఏఐ సూచన
టోల్ ఫీజుకు సంబంధించిన నిబంధనలను సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కాకుండా ఎన్.హెచ్ఏఐ, కేంద్ర రహదారి రవాణా శాఖ వంటి అధికారిక వనరుల ద్వారా తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
“టోల్ ప్లాజా వద్ద క్యూ 100 మీటర్లు దాటితే టోల్ ఫీజు ఉండదు” అనేది నిజం కాదు. సాధారణ వాహనదారులు వర్తించే టోల్ ఫీజును చెల్లించాల్సిందే. ప్రభుత్వం నిబంధనల ప్రకారం మినహాయింపు పొందిన వాహనాలకు మాత్రమే టోల్ నుంచి మినహాయింపు ఉంటుంది.
