Begin typing your search above and press return to search.

ఈసీ అంటే శేషన్... ఆయన లాంటి వారు వస్తారా ?

ఆయన గురించి ఈనాటి తరానికి తెలియకపోవచ్చు కానీ గత తరంలో చూసిన వారు ప్రస్తుతం జరుగుతున్న రచ్చను కూడా చూస్తున్న వారు శేషన్ లాంటి వారు ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు.

By:  Satya P   |   28 Sept 2026 9:16 AM IST
ఈసీ అంటే శేషన్... ఆయన లాంటి వారు వస్తారా ?
X

ఎన్నికల సంఘం అంటేనే టీఎన్ శేషన్. ఆయన అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే వారు. ఏకంగా బడా పార్టీల అధినేతలకే కాదు అధికారంలో ఉన్న వారికి కూడా ఎన్నికల నిబంధలన గురించి చెబుతూ వాటిని వారి మీద కూడా అమలు చేసేవారు. వారూ వీరూ అన్న తేడా లేదు, ఎన్నికల సంఘం మాట ఫైనల్. ఎవరైనా ఆ రూల్స్ కి తలొగ్గాల్సిందే. ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఉన్న కాలంలో ఎన్నికలు సాఫీగా సవ్యంగా సాగాయి అన్న భావన జనంలో ఉండేది. ఆయన ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించిన తీరు మూడు దశాబ్దాల తరువాత కూడా ఈ రోజుకీ అంతా తలచుకుంటున్నారు అంటే దటీజ్ శేషన్.

రూల్స్ బ్రేక్ చేస్తే :

టీఎన్ శేషన్ ఎన్నికల సంఘం చీఫ్ గా ఉన్నపుడు ఎంతటి వారు అయినా రూల్స్ బ్రేక్ చేయడానికి హడలిపోయేవారు. ఎంతటి పెద్ద స్థాయిలలో ఉన్నా కూడా శేషన్ చూస్తున్నారు అన్న బెంగ ఉండేది. దాంతో సాహసించేవారు. అలా ఎన్నికల అక్రమాల పట్ల సింహస్వప్నంగా ఆయన నిలిచి ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా జనం మనసులు గెలిచారు. టీఎన్ శేషన్ 1990 ప్రాంతంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ గా నియమితులయ్యారు. టీఎన్ శేషన్ పూర్తి పేరు తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్. ఆయన 1990 డిసెంబర్ 12 నుండి 1996 డిసెంబర్ 11 వరకు భారతదేశ 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సేవలు అందించారు.

ఎన్నికల సంస్కరణలు :

ఇక టీఎన్ శేషన్ ఎన్నికల సంఘం నియావళిని కూడా కఠినంగా అమలు చేస్తూ ఎన్నో సంస్కరణలు కూడా తీసుకుని వచ్చారు. అంతకుముందు నామమాత్రంగా ఉన్న ఎన్నికల నియమావళినిఆయన అత్యంత కఠినంగా అమలు చేశారు. ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయడంతో పాటు ఎన్నికల ప్రచార ఖర్చులపై పరిమితులు విధించడం వంటి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి భారత ఎన్నికల వ్యవస్థ ముఖచిత్రాన్ని సమూలంగా శేషన్ మార్చేశారు. ఆయన ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఉండగా దేశంలో 1991లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అలాగే యూపీ సహా అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మళ్లీ 1996 మేలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ ఎలాంటి వివాదాలు లేకుండా స్వచ్చంగా నిర్వహించిన ఘనత టీఎన్ శేషన్ కి దక్కుతుంది. అందుకే ఆయన చేసిన విశేష ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా 1996లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు లభించింది.

ఇపుడు ఎందుకు అంటే :

ఈ మధ్య కాలంలో టీఎన్ శేషన్ పదే పదే గుర్తుకు వస్తున్నారు. ఆయన గురించి ఈనాటి తరానికి తెలియకపోవచ్చు కానీ గత తరంలో చూసిన వారు ప్రస్తుతం జరుగుతున్న రచ్చను కూడా చూస్తున్న వారు శేషన్ లాంటి వారు ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే భారత్ లాంటి విభిన్నమైన అభిప్రాయాలు మత కుల ప్రాంతీయ వ్యవస్థ బలంగా ఉన్న చోట ప్రజాస్వామ్యం ప్రాణవాయువుని ఇస్తుంది. అలాంటి ప్రజాస్వామ్యానికి ఎన్నికలు కీలక అయితే వాటిని నిర్వహించే రిఫరీ లాంటి బాధ్యత ఈసీ చేపడుతుంది. ఈ బృహత్తర బాధ్యతలలో ఉన్న వారి మీద అవ గిజంత అనుమానం కూడా రాకూడదు, అలా ఏ మాత్రం సందేహం వచ్చినా అది మొత్తం వ్యవస్థ మీదనే అతి పెద్ద చర్చకు తావిస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. నిజమో నిందో అవసరం లేదు కానీ అసలు చర్చ ఈ విధంగా రావడమే బాధాకరం అని అంటున్నారు. అందుకే శేషన్ లాంటి కఠినమైన సీఈసీని అంతా కోరుకుంటున్నారు.