పార్లమెంట్ సమావేశాల వేళ.. సరికొత్త సీన్
ఇంతకూ పెద్ద హడావుడి లేకుండా.. మీడియా ఫోకస్ కూడా పడని ఆ బిల్లు ఏమన్నది చూస్తే.. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కు పెంచే బిల్లును ప్రవేశ పెట్టారు.
By: Garuda Media | 21 July 2026 6:31 PM ISTజాతీయ మీడియా సంస్థలు మొదలుకొని ప్రాంతీయ మీడియా సంస్థల వరకు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఒకే అంశాన్ని బ్యానర్ కథనంగా ప్రచురించటం జరిగింది. అదే.. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. అదే సమయంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షురూ కావటం. ఈ రెండు అంశాలకు భారీ ప్రాధాన్యత ఇస్తూ మీడియా సంస్థలు తమ కథనాల్ని ప్రచురించాయి.. టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. అయితే.. కొన్ని కీలక అంశాల్ని మాత్రం హైలెట్ చేయటంలో వెనుకబడిన పరిస్థితి.
అందులో ముఖ్యంగా పార్లమెంట్ లో జరిగిన సమావేశాల సందర్భంగా ఒక కొత్త సీన్ ఒకటి ఆవిష్క్రతమైంది. గతంలో పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా.. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పుతూ.. పార్లమెంట్ వెల్ లోకి దూసుకెళ్లి.. వ్యతిరేక నినాదాలు చేయటం.. విమర్శలు సంధించటం..ఆందోళనలు చేపట్టటం లాంటి పనులు చేసే టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు ఈసారి కామ్ గా ఉండిపోయారు.
దీనికి కారణం ఇటీవల ఈ ఇరవై మంది ఎంపీలు సొంత పార్టీ (మమత టీఎంసీ) మీద తిరుగుబాటు చేసి.. తమను తాము ఒక జట్టుగా పేర్కొనటం తెలిసిందే. మోడీ సర్కారు ఆరంభం నుంచి ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో టీఎంసీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నుంచి.. ఈసారి 20 మంది తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు మౌనంగా ఉండిపోవటంతో.. సభలో మారిన బలాబలాలు కళ్లకు కట్టినట్లుగా కనిపించిన పరిస్థితి. నిజానికి ఇదో ఆసక్తికర పరిణామం అయినప్పటికి మీడియాలో మాత్రం హైలెట్ కాలేదు.
నీట్ పరీక్ష.. ఆయోధ్య అంశాలపై విపక్షాలు గళం విప్పుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ.. ఉభయ సభల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నాటి సభ దాదాపు ఆరుసార్లు వాయిదా పడింది. ఇన్నిసార్లు వాయిదా పడినప్పటికి మోడీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక కీలక బిల్లును కామ్ గా ప్రవేశ పెట్టేసి.. ఈ సమావేశాల్లో తాను అనుకున్న పలు బిల్లుల లెక్క తేల్చేయాలన్న పట్టుదలతో కనిపించింది.
ఇంతకూ పెద్ద హడావుడి లేకుండా.. మీడియా ఫోకస్ కూడా పడని ఆ బిల్లు ఏమన్నది చూస్తే.. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కు పెంచే బిల్లును ప్రవేశ పెట్టారు. నిజానికి ఇదే అంశంపై గతంలో ఆర్డినెన్స్ జారీ చేశారు. తాజాగా దాని స్థానంలో కీలక సవరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. సోమవారం పార్లమెంట్ సమావేశాల్ని నిర్వహించిన కారణంగా రూ.9 కోట్ల ఖర్చు అయ్యిందని.. మోడీ సర్కారు విలువైన ప్రజాధనాన్ని వృధా చేసినట్లుగా విమర్శలు వెల్లువెత్తినప్పటికి.. అందుకు భిన్నంగా కూటమి సర్కారు మాత్రం తన ఎజెండాలో భాగంగా అడుగులు వేసినట్లుగా చెప్పక తప్పదు.
అంతేకాదు.. సోమవారం రాజ్యసభలో ఎలాంటి చర్చలు జరగనప్పటికి.. రాజ్యసభ ప్రారంభం అయిన వెంటనే రాజ్యసభ ఛైర్మన్ తొమ్మిది మంది కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజీలపై చర్చ జరగాలని బలంగా కోరటంతో సభ పూర్తిగా నిలిచిపోయింది.
