ఓటమి తర్వాత మమతకు భారీ షాక్‌లు.. బెంగాల్‌లో టీఎంసీ భవితవ్యంపై సందేహాలు
తాజాగా మమతా బెనర్జీ నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశం టీఎంసీలో ముదురుతున్న సంక్షోభాన్ని కళ్ళకు కట్టింది.
By: A.N.Kumar | 7 May 2026 1:23 PM ISTపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రస్తుతం మనుగడ కోసమే పోరాడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవడమే కాకుండా ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం మమతా బెనర్జీకి కఠినమైన సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఎన్నికల అనంతర పరిణామాలు గమనిస్తుంటే బెంగాల్ రాజకీయాల్లో మమత శకం ముగిసిపోతుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఎమ్మెల్యేల గైర్హాజరు.. అంతర్గత కుమ్ములాటలకు సంకేతమా?
తాజాగా మమతా బెనర్జీ నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశం టీఎంసీలో ముదురుతున్న సంక్షోభాన్ని కళ్ళకు కట్టింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆమె పిలిచిన ఈ కీలక భేటీకి 9 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 70 మంది మాత్రమే హాజరు కావడం చూస్తుంటే మిగిలిన 9 మంది భవిష్యత్తు అడుగులు ఎటువైపు ఉన్నాయనే ఉత్కంఠ నెలకొంది.
అసమ్మతి నేతలు ఇప్పటికే ఇతర పార్టీల నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ గైర్హాజరు కేవలం గైర్హాజరు మాత్రమే కాదని.. అది తిరుగుబాటుకు నాంది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సొంత గడ్డపైనే పరాభవం.. సువేందు దెబ్బ!
మమతా బెనర్జీకి అత్యంత అవమానకరమైన విషయం ఏమిటంటే ఆమె తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఘోరంగా ఓడిపోవడం. గతంలో తన ప్రధాన అనుచరుడిగా ఉండి ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఎదిగిన సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలవ్వడం టీఎంసీ కేడర్‌ను తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఒకప్పుడు తను వేలు పట్టి నడిపించిన నేతే నేడు ఆమె రాజకీయ ప్రస్థానానికి అడ్డుగోడగా నిలవడం గమనార్హం. ఈ ఓటమితో పార్టీపై ఆమెకున్న పట్టు సడలిపోతోందని స్పష్టమవుతోంది.
విశ్వసనీయుల దూరం.. పరిపాలనలో పట్టు కోల్పోయిన దీదీ
కేవలం రాజకీయ నాయకులే కాకుండా మమతకు అత్యంత సన్నిహితులుగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు, కీలక సలహాదారులు కూడా ఆమెకు షాక్ ఇస్తున్నారు. వరుస రాజీనామాలు చేస్తుండటంతో అటు పార్టీలోనూ, ఇటు అధికార యంత్రాంగంలోనూ ఆమె ఒంటరి అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదు.. ఒక వ్యవస్థ కుప్పకూలుతున్న సంకేతం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ముందున్నవి గడ్డు కాలమేనా?
ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు మార్పును కోరుకున్నారని ఫలితాలు చెబుతున్నాయి. 207 సీట్లతో బీజేపీ అప్రతిహత విజయం సాధించడంతో టీఎంసీ అస్తిత్వానికి ముప్పు ఏర్పడింది. 9 మంది గైర్హాజరైన ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇదే జరిగితే పార్టీ విభజన అయ్యి.. తృణమూల్ కాంగ్రెస్ ముక్కలయ్యే ప్రమాదం ఉందా? మమత తర్వాత పార్టీని నడిపించే వారసులు లేకపోవడం మైనస్ గా మారింది.
ఈ ప్రశ్నలు ఇప్పుడు బెంగాల్ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఒకప్పుడు బెంగాల్ గడ్డపై కమ్యూనిస్టులను కూకటివేళ్లతో పెకిలించిన మమతా బెనర్జీ ఇప్పుడు తన సొంత పార్టీని కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు చూస్తుంటే రాజకీయాల్లో కాలం ఎంత బలమైనదో అర్థమవుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ 9 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటో తేలిపోనుంది, అదే టీఎంసీ భవిష్యత్తును కూడా నిర్ణయించనుంది.
