Begin typing your search above and press return to search.

‘నిజం గెలవాలి’: టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ... మధ్యలో రూ.5 కోట్లు!

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది.

By:  Raja Ch   |   23 Oct 2025 6:10 PM IST
‘నిజం గెలవాలి’: టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్  ఎంపీ... మధ్యలో రూ.5 కోట్లు!
X

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. నిన్నమొన్నటివరకూ వీరి మధ్య నడిచిన మాటల యుద్ధం కాస్త ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు బయటపెట్టుకునే వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వాట్సప్‌ స్టేటస్‌, ఫేస్ బుక్ పోస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది.

అవును... ఇద్దరు టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇందులో భాగంగా... ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వ్యవహారం ముదిరి పాకానపడినట్లుంది! ఈ క్రమంలో చిన్నిపై కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం 5 కోట్ల రూపాయాలు తనను కేశినేని చిన్ని అడిగారని శ్రీనివాస్ ఆరోపించారు.

ఈ సందర్భంగా... చిన్నికి ఇచ్చిన డబ్బుల వివరాలను కొలికపూడి తన వాట్సప్‌ స్టేటస్‌ పెట్టారు! తాను ఇచ్చిన డబ్బుల వివరాల గురించి శుక్రవారం మాట్లాడుకుందామంటూ స్టేటస్‌ లో పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ లో తిరువూరు పంచాయితీ జరగనుండగా.. ఇరువురు నేతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచి మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఇదే విషయంపై ఫేస్ బుక్ లోనూ కొలికపూడి పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా బ్యాంక్ స్టేట్ మెంట్ ఇమేజ్ ను పోస్ట్ చేస్తూ.. "2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టిక్కెట్ కోసం కేశినేని శివనాథ్ (చిన్ని) నన్ను 5 కోట్లు అడిగినప్పుడు నా అకౌంట్ నుంచి 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసిన వివరాలు" అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... "పోరంకిలో శివనాథ్ పీఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన 50 లక్షల గురించి, గొల్లపూడిలో నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి" అని ఎమ్మెల్యే కొలికపూడి రాసుకొచ్చారు. దీంతో ఇది కాస్తా ఒక్కసారిగా సంచలనంగా మారింది. రేపు ఏమి జరగబోతుందనేది మరింత ఆసక్తిగా మారింది!

స్పందించిన ఎంపీ కేశినేని చిన్నీ!:

ఈ స్థాయిలో సాక్ష్యాలతో సహా అన్నట్లుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేయడంపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఇందులో భాగంగా.. 'మొన్నటి వరకు కొలికపూడి నన్ను దేవుడు అన్నారు. ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే సమాధానం చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ ను గౌరవించుకోవాలి. నేను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కాదు. తిరువూరులో నాలుగేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా' అని అన్నారు.