Begin typing your search above and press return to search.

తిరువూరు మున్సిపల్ పోరులో 'పైచేయి' పాకులాట‌.. !

తిరువూరు మున్సిపల్ ఎన్నిక‌ల్లో పైచేయి కోసం అధికార టీడీపీలో మ‌రోసారి వివాదాలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోంది.

By:  Garuda Media   |   19 Sept 2026 10:00 PM IST
తిరువూరు మున్సిపల్ పోరులో పైచేయి పాకులాట‌.. !
X

తిరువూరు మున్సిపల్ ఎన్నిక‌ల్లో పైచేయి కోసం అధికార టీడీపీ లో మ‌రోసారి వివాదాలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోంది. ఒకప్పుడు వైసీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ మున్సిపాలిటీలో కౌన్సిలర్ల బలాబలాల సమీకరణాలను మార్చడంలో, వైసీపీ కౌన్సిలర్లను చేర్చుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాస‌రావు కీలక పాత్ర పోషించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ మద్దతుతో కొలికపోగు నిర్మల ఎన్నికయ్యారు. అయితే, ఈ ఎన్నిక ప్రక్రియలో, అభ్యర్థి ఎంపిక వెనుక తనకంటూ పూర్తి పట్టు నిలుపుకోవాలని ఎమ్మెల్యే కొలికపూడి ప్రయత్నించారు.

ప్ర‌స్తుతం మారుతున్న సీన్‌..

తిరువూరు మున్సిపాలిటీ రాజకీయాలు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మారాయి. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ భారీ మెజారిటీ సాధించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రస్తుతం మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. 2021 ఎన్నికల్లో తిరువూరులోని మొత్తం 20 వార్డులకు గాను వైసీపీ ఏకంగా 17 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీపై ప‌ట్టు పెంచుకుంది. కానీ, ఇప్పుడు పార్టీని లీడ్ చేసేందుకు సీనియ‌ర్ నేత ముందుకు రావ‌డం లేద‌ని చ‌ర్చ ఉంది. దీంతో పార్టీ ప‌రిస్థితి మారుతుంద‌ని అంటు న్నారు.

ఇక‌, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి విజయం సాధించడంతో సమీకరణాలు మారాయి. నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో వైసీపీ తన మెజారిటీని కోల్పోయింది. ఆత‌ర్వాత‌.. తిరిగి పార్టీని నిల‌బెట్టే ప్ర‌య‌త్నాలు కూడా ముందుకు సాగ‌డం లేదు. మ‌రోవైపు.. మున్సిపాలిటీని చేజిక్కించుకున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో నిధుల మంజూరు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని కూట‌మి నాయకులు అంచ‌నా వేస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. తిరువూరు మున్సిపల్, స్థానిక ఎన్నికల రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానిక క్యాడర్‌పై తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. దీంతో గ‌త 15 రోజులుగా విస్తృతంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. ఇక‌, విజ‌య‌వాడ‌ ఎంపీ కేశినేని చిన్ని కూడా నియోజకవర్గ అభివృద్ధి వ్యవహారాలు... కీలక నిర్ణయాల్లో తన మార్కు చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు కీలక నేతల విభేదాలు ప్ర‌స్తుతం త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ.. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌రం నేప‌థ్యంలో ఏ విధంగా మ‌లుపుతిరుగుతాయ‌న్న‌ది చూడాలి.