Begin typing your search above and press return to search.

తిరుపతి ఇప్పుడు ఈ-వీసా సెంటర్.. కేంద్రం కీలక నిర్ణయం

దేశం 2014లో 43 దేశాల పౌరుల కోసం ఈ-వీసా సౌకర్యాన్ని ప్రవేశపెట్టగా, ప్రస్తుతం ఇది 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది.

By:  Tupaki Political Desk   |   11 Aug 2026 3:13 PM IST
తిరుపతి ఇప్పుడు ఈ-వీసా సెంటర్.. కేంద్రం కీలక నిర్ణయం
X

తిరుపతి విమానాశ్రయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్ల క్రితమే తిరుపతిని కేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క విదేశీ విమాన సర్వీసును ఇక్కడి నుంచి నడపలేదు. అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో త్వరలో తిరుపతి నుంచి విదేశీ ప్రయాణికుల రాకపోకలకు వీలు కల్పించనట్లుగా చెబుతున్నారు. తిరుపతి విమానాశ్రయానికి అధికారికంగా ఈ-వీసా ప్రవేశ కేంద్రం హోదాను కల్పిస్తూ తాజాగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ-వీసాలతో విదేశీయులు ప్రవేశించేందుకు వీలుగా అదనంగా 11 కొత్త కేంద్రాలను ప్రకటించగా, అందులో తిరుపతి ఎయిర్‌పోర్టును కూడా చేర్చారు.

తిరుపతిని ఇ-వీసా హోల్డర్లకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రవేశ కేంద్రాల జాబితాలో చేర్చడంతో, తిరుమలను సందర్శించే విదేశీ పర్యాటకులకు ఇప్పుడు మరింత సులభమైన ప్రయాణ మార్గం లభించినట్లైందని అంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే విదేశీ భక్తులు ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు ఎయిర్ పోర్టుల్లో దిగాల్సివస్తోంది. అయితే ఇప్పుడు కేంద్రం ఇ-వీసాలు కలిగిన విదేశీయులు దేశంలోకి ప్రవేశించగల మరో 11 అంతర్జాతీయ పోర్టులను తాజాగా నోటిఫై చేయడంతో ఇకపై విదేశీ ప్రయాణికులు నేరుగా తిరుపతి ఎయిర్ పోర్టు ద్వారా దేశంలోకి ప్రవేశించే సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లైందని అంటున్నారు. కేంద్రం కొత్తగా నోటిఫై చేసిన జాబితాలో తిరుపతి, భోపాల్ విమానాశ్రయాలు ఉన్నాయి. అంతేకాకుండా తాజా నోటిఫికేషన్ తో ఇ-వీసా హోల్డర్లను దేశంలోకి అనుమతించే అంతర్జాతీయ పోర్టుల మొత్తం సంఖ్య 88కి పెరిగింది. ప్రస్తుత జాబితాలో ఇప్పుడు 37 విమానాశ్రయాలు, 38 ఓడరేవులు, 13 భూమార్గ పోర్టులు ఉన్నాయి.

దేశం 2014లో 43 దేశాల పౌరుల కోసం ఈ-వీసా సౌకర్యాన్ని ప్రవేశపెట్టగా, ప్రస్తుతం ఇది 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. దాదాపు 95 శాతం ఇ-వీసా దరఖాస్తులు 72 గంటల్లోపే విజయవంతంగా ప్రాసెస్ చేయబడుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆమోదించబడిన ప్రవేశ మార్గాల జాబితాలో ఇప్పుడు తిరుపతి కూడా చేరడంతో, సమీప భవిష్యత్తులో విదేశాల నుంచి నేరుగా తిరుపతికి విమానాలు నడిచే అవకాశాలు బలపడుతున్నాయి. రాష్ట్రంలో విమానయాన కనెక్టివిటీని మరింత పెంచేందుకు, పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలలో ఈ నిర్ణయం ఒక కీలకమైన ముందుడుగుగా నిపుణులు భావిస్తున్నారు. చెల్లుబాటు అయ్యే ఈ-వీసాలు కలిగిన విదేశీ సందర్శకులకు భారతదేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక గమ్యస్థానాలలో ఒకటైన తిరుపతిని చేరుకోవడానికి ఈ పరిణామం అద్భుతమైన మార్గాన్ని సుగమం చేసిందని అంటున్నారు.

ఇంతవరకు విదేశాల నుంచి వచ్చే యాత్రికులు నేరుగా తిరుపతికి రావడానికి అవకాశం ఉండేది కాదు. విదేశీ ప్రయాణికులు ముందుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాలలో దిగి, అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా తిరుపతికి చేరుకోవాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో విదేశీ భక్తులు నేరుగా చెల్లుబాటయ్యే ఈ-వీసాతో తిరుపతి విమానాశ్రయం ద్వారా దేశంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమమైంది. త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుందని చెబుతున్నారు. తిరుపతి విమానాశ్రయానికి 2008లోనే అంతర్జాతీయ హోదా లభించినప్పటికీ, 2017లో దీనిని అధికారికంగా నోటిఫై చేశారు. విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి సుమారు 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క రెగ్యులర్ అంతర్జాతీయ విమానం కూడా ఇక్కడ ల్యాండ్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజా ఈ-వీసా ఆమోదం రావడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.