వైకుంఠ ఏకాదశికి తిరుమలకు క్యూ కట్టిన టీ నేతలు
అయినా.. తెలంగాణ రాష్ట్ర సాధనకు.. తిరుమలకు ధీటుగా టెంపుల్ ను ఏర్పాటు చేయటానికి ఉన్న లింకేమిటో అర్థం కాని పరిస్థితి.
By: Garuda Media | 30 Dec 2025 10:00 AM ISTదేవుడికి ప్రాంతానికి సంబంధం ఏంటి? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. చరిత్ర లోతుల్లోకి వెళ్లినప్పుడు.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు తిరుమల అంశం కూడా ప్రధానంగా చర్చకు రావటం తెలిసిందే. అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే తిరుమలకు ధీటుగా యాదాద్రిని సిద్ధం చేస్తామని.. తెలంగాణ ప్రజలకు ఒక మహా పుణ్యక్షేత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఎంత తెలంగాణ అయినప్పటికీ.. దేవుడి విషయంలోనూ.. గుళ్ల విషయంలోనూ పోలిక తీసుకురావటం మంచిదేనా? అన్న చర్చ జరిగినప్పటికీ.. అప్పట్లో కేసీఆర్ మాటకు కౌంటర్ ఇచ్చే ధైర్యం.. సాహసం ఎవరూ చేయని పరిస్థితి.
అయినా.. తెలంగాణ రాష్ట్ర సాధనకు.. తిరుమలకు ధీటుగా టెంపుల్ ను ఏర్పాటు చేయటానికి ఉన్న లింకేమిటో అర్థం కాని పరిస్థితి. ప్రపంచంలో ప్రముఖమైనవి కొన్నే ఉంటాయి. అలా అని.. ఆ ప్రముఖమైన.. సందర్శనీయ స్థలాలకు ధీటుగా తాము ఏర్పాటు చేస్తామని ఎంత పాలకులైనా అనొచ్చా? అన్నది ప్రశ్న. అందులోనూ కోట్లాది మందికి దైవంగా ఉన్న ప్రాంతాల మీద వ్యాఖ్యలు చేయటం సబబేనా? అన్నది మరో క్వశ్చన్.
అందుకే.. కేసీఆర్ మాటల్ని తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకున్నది లేదు. అంతేనా.. ఈసారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో సహా తిరుమలకు చేరుకొని.. స్వామివారి దర్శనం చేసుకోవటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సీఎం మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం మొదలు పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఇలా పార్టీలకు అతీతంగా బోలెడంతమంది తిరుమలకు విచ్చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా అప్పట్లో కేసీఆర్ అన్న మాటలు ఇట్టే గుర్తుకు వచ్చే పరిస్థితి.
కేసీఆర్ లాంటి అధినేత.. తనకు అవసరమనుకుంటే.. తనకు రాజకీయంగా మైలేజీ వస్తుందన్న నమ్మకం ఉంటే.. ఏ అంశంలో అయినా భావోద్వేగాల్ని తట్టి లేపేందుకు అస్సలు వెనుకాడరు. ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు విచ్చేసిన తెలంగాణ ప్రముఖులను ఉద్దేశించి.. తెలంగాణలో ఆలయాలు లేవా? వాటికి వెళ్లలేరా? తిరుమలకే ఎందుకు వెళ్లాలని అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే పెద్దమనిషి తెలంగాణ వస్తే మొక్కు చెల్లిస్తానని తెలంగాణ ప్రాంతంలో లేని పుణ్యక్షేత్రంలో మొక్కులు మొక్కొచ్చు. రాజకీయం ఎంత సిత్రంగా ఉంటుంది.. కేసీఆర్ లాంటి అధినేత మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయనటానికి ఇదో నిదర్శనంగా చెప్పొచ్చు.
