Begin typing your search above and press return to search.

వామ్మో.. శ్రీవారి హుండీ వెనుక ఇంత కథ ఉందా?

శ్రీ వేంకటేశ్వరస్వామివారి హృదయంపై శ్రీమహాలక్ష్మీ అమ్మవారు నివాసం ఉండటంతో ఆ ఆలయానికి అంతులేని సంపద సమకూరుతుందని నమ్ముతారు.

By:  Madhu Reddy   |   10 Oct 2026 11:33 AM IST
వామ్మో.. శ్రీవారి హుండీ వెనుక ఇంత కథ ఉందా?
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో కానుకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అసలు శ్రీవారి హుండీకి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు? అందులోకి రోజూ కోట్లాది రూపాయలు ఎలా చేరుతున్నాయి? ఆ హుండీ వెనుక ఉన్న విశేషాలేంటో చూద్దాం.

హుండీ కింద దాగున్న శ్రీచక్రం మహిమ:

తిరుమల ఆలయంలో ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా హుండీ స్థానం మాత్రం అస్సలు మారలేదు. ఒకసారి గుడి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా హుండీ దగ్గర ఫ్లోరింగ్ మారుస్తుండగా అక్కడ ఒక శ్రీచక్రం బయటపడింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఈ శ్రీచక్రాన్ని అక్కడ ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. 1992లో టీటీడీ వేదపండితుడు శ్రీరామనాథ ఘనాపాటి గారు కూడా ఈ విషయమై రాశారు. ఆ శ్రీచక్ర మహిమ వల్లే హుండీలోకి అపరిమితమైన సంపద వచ్చి చేరుతుందని భక్తుల నమ్మకం.

17వ శతాబ్దం నుంచే సాగుతున్న శ్రీవారి హుండీ పరంపర

శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు తమ కానుకలను సమర్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్ద గంగాళాన్ని ‘హుండీ’ అంటారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిత్య నిర్వహణ కోసం ఈ ఏర్పాటు ప్రారంభమైంది. టీటీడీ రికార్డుల ప్రకారం 17వ శతాబ్దానికి ముందు నుంచే ఈ హుండీ సంప్రదాయం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీటీడీకి ఆదాయం కోసం ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ, ఈ ప్రాచీన సంప్రదాయాన్ని ఇప్పటికీ గౌరవిస్తూ కొనసాగిస్తున్నారు. భక్తులు తమ స్థోమతను బట్టి నగదు, బంగారం, వెండి మాత్రమే కాకుండా బియ్యం, వస్త్రాలు, విలువైన పత్రాలను కూడా ఆత్మార్పణగా ఇందులో సమర్పిస్తుంటారు.

అమ్మవారి అనుగ్రహం.. కుబేరుని రుణం:

శ్రీ వేంకటేశ్వరస్వామివారి హృదయంపై శ్రీమహాలక్ష్మీ అమ్మవారు నివాసం ఉండటంతో ఆ ఆలయానికి అంతులేని సంపద సమకూరుతుందని నమ్ముతారు. అంతేకాకుండా, పూర్వం స్వామివారు తన కళ్యాణం కోసం కుబేరుని దగ్గర తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకే భక్తులు తమ స్థోమత కొద్దీ కానుకలు సమర్పిస్తుంటారు. భక్తులు ఎంతో నమ్మకంతో నాణేల నుంచి బంగారు ఆభరణాల వరకు శ్రీవారి హుండీలో సమర్పించి సంతోషిస్తుంటారు.

అణాల కాలం నుండి నేటి కోట్ల రాబడి దాకా:

పూర్వ కాలంలో ఆకాశరాజు సమర్పించిన కానుకల నుంచి నేటి సాధారణ భక్తుడి దాకా అందరూ శ్రీవారికి కానుకలు ఇస్తూనే ఉన్నారు. ఒకప్పుడు అణాలతో ప్రారంభమైన హుండీ ఆదాయం, నేడు రోజుకు రూ. 6 కోట్లకు పైగానే వస్తోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ బంగారం, వెండి, నగదు రూపంలో కానుకలు కొండంతగా వచ్చి శ్రీవారి ఖజానాలో చేరుతున్నాయి.

తిరుమల హుండీ అనేది కేవలం డబ్బులు వేసే పాత్ర మాత్రమే కాదు. అది భక్తుల నమ్మకానికి, అహంకారాన్ని వదిలేసే ఆత్మసర్పణకు ప్రత్యక్ష నిదర్శనం. మనలోని ‘నేను’ అనే అహంభావాన్ని తీసివేసి, స్వామివారికి భక్తితో నమస్కరించి కానుకలు సమర్పించడంలోనే ఎంతో ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది.