Begin typing your search above and press return to search.

కల్తీ నెయ్యిలో వైవీ.. పరకామణిపై భూమన.. టీటీడీ మాజీ చైర్మన్లకు చిక్కులు తప్పవా?

తిరుమల లడ్డూ ప్రసాదం, పరకామాణి చోరీ కేసుల్లో ఒకేసారి జరుగుతున్న దర్యాప్తుతో వైసీపీ ముఖ్యనేతలకు తలనొప్పి తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   12 Nov 2025 4:17 PM IST
కల్తీ నెయ్యిలో వైవీ.. పరకామణిపై భూమన.. టీటీడీ మాజీ చైర్మన్లకు చిక్కులు తప్పవా?
X

తిరుమల లడ్డూ ప్రసాదం, పరకామాణి చోరీ కేసుల్లో ఒకేసారి జరుగుతున్న దర్యాప్తుతో వైసీపీ ముఖ్యనేతలకు తలనొప్పి తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు కేసుల్లో టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిని ఇరికించేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ రెండు అంశాల్లో వేర్వేరుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ ఇద్దరి చుట్టూ పనిచేసిన వారిని ఇప్పటికే విచారించడం, కొందరిని అరెస్టు చేయడం వల్ల ఈ వైసీపీ సీనియర్ల భవితవ్యంపైనా ఉత్కంఠ నెలకొందని అంటున్నారు.

గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణకారరెడ్డి వైసీపీలో ముఖ్య నాయకులే. అంతేకాకుండా ఈ ఇద్దరికీ అధినేత జగన్మోహనరెడ్డితో దగ్గర బంధుత్వం కూడా ఉంది. వైవీ స్వయాన జగన్ చిన్నమ్మ భర్త కాగా, భూమనకు వైఎస్ కుటుంబంతో వియ్యం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరిని టచ్ చేస్తే పరోక్షంగా మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని టచ్ చేసినట్లేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. టీటీడీ లడ్డూ ప్రసాదం కేసులో వైవీని విచారించేందుకు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆయన పీఏ అప్పన్నను గతంలోనే అరెస్టు చేసింది.

సిట్ నోటీసుల ప్రకారం వైవీ సుబ్బారెడ్డి గురువారం లేదా శనివారం హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కల్తీ నెయ్యి కేసులో వైవీపై సిట్ ఎలాంటి అభియోగాలు మోపుతుందనేది తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఆయన తీరు అనుమానాస్పదంగా ఉందని కోర్టుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. వైవీ బ్యాంకు ఖాతాలను పరిశీలించేందుకు కోర్టు అనుమతి కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ పరిణామాలు వైసీపీ క్యాంపులో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కల్తీ నెయ్యి కేసులో మే నెలలోనే సిట్ ఒక చార్జిషీటు దాఖలు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు దర్యాప్తు నిలిచిపోవడంతో కేసు ముగిసిందని భావించారు. కానీ, వైవీ పీఏ అరెస్టుతో సిట్ పెద్ద హడావుడి చేస్తోందని అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం నెయ్యి కేసును మళ్లీ తెరపైకి తెచ్చిన సిట్ గత రెండు రోజులుగా పలువురిని విచారిస్తోంది. ఇందులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించడం, ఆ తర్వాత వైవీ విచారణకు వెళ్లనుండటంతో ఏం జరుగుతుందనేది టెన్షన్ పుట్టిస్తోంది. మరోవైపు కల్తీ నెయ్యి కేసుకు సమాంతరంగా తిరుపతిలో సీఐడీ సిట్ పరకామణి చోరీ కేసులో దర్యాప్తు చేస్తోంది. పరకామణిలో డాలర్లను దొంగిలించిన కేసులో నిందితుడితో రాజీ చేసుకోవడాన్ని హైకోర్టు ఇప్పటికే తప్పుపట్టింది. అయితే టీటీడీ పెద్దల అండదండలు లేకుండా రాజీ జరగదన్న కోణంలో ప్రభుత్వం దర్యాప్తును జరిపిస్తోందని అంటున్నారు. చోరీ కేసును రాజీ చేసిన పెద్దల గుట్టు రట్టు చేసేలా సిట్ ఎలా అడుగులు వేస్తుంది? ఈ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన పాత్ర ఉన్నట్లు సీఐడీ భావిస్తుందా? లేదా? అనేది అంతుబట్టడం లేదు. దీంతో భూమన శిబిరంలోనూ ఉత్కంఠ నెలకొన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి తిరుపతి-తిరుమల కేంద్రంగా జరుగుతున్న రెండు దర్యాప్తులతో విపక్షం వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని అంటున్నారు.