పరకామణి చోరీ కేసులో బిగ్ ట్విస్టు.. నిందితుడు రవికుమార్ సంచలన వీడియో!
వెక్కివెక్కి ఏడుస్తూ వీడియోలో మాట్లాడిన రవికుమార్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. ‘‘ పరకామణిలో 2023 ఏప్రిల్ 29న మహాపాపం చేశాను.
By: Tupaki Political Desk | 7 Dec 2025 2:31 PM ISTతిరుమల పరకామణి చోరీ కేసులో పెద్ద ట్విస్టు చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో సీఐడీ సిట్ దర్యాప్తు చేసింది. ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇక దర్యప్తు పూర్తిచేసిన సీఐడీ సిట్ సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో త్వరలో చర్యలకు హైకోర్టు ఆదేశాలిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చోరీ కేసు నిందితుడు సీవీ రవికుమార్ సంచలన వీడియో విడుదల చేశారు. శ్రీవారి పరకామణిలో చోరీ చేసి మహాపాపం చేసిన తాను 90 శాతం ఆస్తులను తిరిగి రాసిచ్చేశానని తెలిపాడు. ఇక తనను కొందరు బ్లాక్ మెయిల్ చేశారంటూ రవికుమార్ బయటపెట్టాడు.
పరకామణిలో చిన్న చోరీ జరిగిందని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన రెండు రోజులుకు నిందితుడు రవికుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. వెక్కివెక్కి ఏడుస్తూ వీడియోలో మాట్లాడిన రవికుమార్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. ‘‘ పరకామణిలో 2023 ఏప్రిల్ 29న మహాపాపం చేశాను. పెద్ద తప్పు చేశాను. ఎంత మహాపాపం చేశానో అని నేను, నా భార్యపిల్లలు తలుచుకుని బాధపడని రోజు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మా కుటుంబం ఆ తప్పును మహాపాపంగా భావిస్తున్నాం. నేను కేబుల్, స్థిరాస్తి వ్యాపారాలు చేశాను. మా ఆస్తిలో 90శాతం ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి రాసిచ్చాను’’ అంటూ రవికుమార్ తెలిపారు.
లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్న రవికుమార్.. ఈ విషయం వెలుగు చూసిన తర్వాత ఏడాదిగా కనిపించకుండా పోయాడు. ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారుల విచారణకు హాజరైన తర్వాత మళ్లీ బయటకు రాలేదు. అయితే తన వివరణను బహిరంగంగా తెలియజేసేందుకు 2.31 నిమిషాల నిడివి ఉన్న వీడియోను రవికుమార్ స్వయంగా బయటకు విడుదల చేశారు. కొందరు నన్ను బెదిరించి ఆస్తులు రాయించుకున్నట్లు ప్రచారాలు చేస్తున్నారు. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన వారిపై కేసులు పెట్టాను. నా శరీరంలో ప్రైవేటు భాగాల్లో శస్త్రచికిత్సలు చేయించుకుని అక్కడ నగదు దాచుకున్నట్లు మూడేళ్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపాడు.
తనపై జరుగుతున్న ప్రచారంతో నా కుటుంబం మనోవేదనకు గురవుతోంది. అలా చేయలేదని నిరూపించేందుకు న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలకు ఆదేశించినా సహకరిస్తా.. అని చెబుతూ రవికుమార్ ఏడుస్తూ వేడుకున్నాడు. ప్రస్తుతం రవికుమార్ వీడియో వైరల్ అవుతోంది. తిరుమల పెద్ద జీయర్ స్వామి మఠంలో గుమస్తాగా పనిచేశాను. నాపై కొందరు ఒత్తిడి తెచ్చి ఆస్తులు కాజేశారనే ప్రచారంలో వాస్తవం లేదు. నా ఆస్తులు ఇతరులకు ఎందుకు ఇస్తాను? కొందరు బ్లాక్ మెయిల్ చేసిన మాట వాస్తవం అంటూ చెప్పాడు.
