Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై మ‌రో విచార‌ణ

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   25 July 2026 3:22 PM IST
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై మ‌రో విచార‌ణ
X

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా కూడా వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల‌కు మ‌ధ్య మాట‌ల మంటలు రేపింది. సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ నేతృత్వంలో విచార‌ణ‌కు కూడా ఆదేశించారు. సుమారు 9 నెల‌ల పాటు సీబీఐ విచార‌ణ పూర్తి చేసింది. దీనికి సంబంధించి ప్ర‌స్తుతం అప్ప‌టి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్ప‌న్న జైలులో ఉన్నాడు.

ఇదిలావుంటే.. ఈ కేసు విచార‌ణ కోర్టులో పెండింగులో ఉంది. అయితే.. సీబీఐ ఆధ్వ‌ర్యంలో నియ‌మించిన సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్ప‌టికే ఒక సారి తిరుమ‌ల‌లో చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై మాజీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్ర‌భుత్వం విచార‌ణ చేయించింది. ప‌ర‌కామ‌ణి నుంచి తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాల త‌యారీ వ‌ర‌కు చేప‌ట్టాల్సిన సంస్క‌ర‌ణ‌ల‌పై ఈ క‌మిటీ త‌న నివేదిక‌ను అందించింది. దీనిపై చ‌ర్య‌లు పెండింగులో ఉన్నాయి.

ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వం మ‌రో విచార‌ణ‌కు ఆదేశించింది. తిరుమ‌ల‌కు వ‌చ్చే ప‌దార్ఘాల నాణ్య‌త‌, వాటి దిగుబ‌డి ఇత‌ర విష‌యాల‌ను ప‌రిశీలించేందుకు వీలుగా ఈ విచార‌ణ‌ను చేప‌డుతున్న‌ట్టు స‌ర్కారు తెలిపింది. ఈ క్ర‌మంలోనే ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ.. ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశాలు జారీ చేశారు. విచారణాధికారిగా బి.ఉమామహేశ్వరరావు నియ‌మించారు. ఆయ‌న‌కు స‌హాయ‌కారిగా అంటే.. ప్రెజెంటింగ్ అధికారిగా జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు వ్య‌వ‌హరించ‌నున్నారు.

ఈ క‌మిటీ బాయిల‌ర్ల‌ను, తిరుమ‌ల ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఫ్యాక్ట‌రీలు, కాంట్రాక్టు సంస్థ‌ల ఫ్యాక్ట‌రీల‌ను కూడా త‌నిఖీ చేయ‌నుంది. అనంత‌రం.. మూడు మాసాల్లో ప్ర‌భుత్వానికి నివేదిక అందించ‌నుంది. త‌ద్వారా.. నాణ్య‌మైన ప్ర‌సాదాల త‌యారీకి వినియోగించే పదార్థాల‌తోపాటు త‌యారీ విధానంలో అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తుల‌పై కూడా ఈ క‌మిటీ విచార‌ణ చేయ‌నుంది. విచారణను 3 నెలల్లో పూర్తిచేయాలని ఆదేశాల‌లో పేర్కొన్నారు. సీబీఐ సిట్ సిఫార్సుల మేరకు ఏపీ ప్రభుత్వం చర్యల‌కు దిగింద‌ని సీఎస్ తెలిపారు.