Begin typing your search above and press return to search.

మళ్లీ తెరపైకి తిరుమల లడ్డూ కేసు.. ఈ సారి ఈడీ అరెస్టులు

ఇందులో భాగంగా సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాస్ చంద్ మంగ్లాను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈడీ అరెస్టు చేసిన వారిలో మంగ్లా రెండో వారు.

By:  Tupaki Political Desk   |   19 Sept 2026 1:28 PM IST
మళ్లీ తెరపైకి తిరుమల లడ్డూ కేసు.. ఈ సారి ఈడీ అరెస్టులు
X

తిరుమల లడ్డూ అపవిత్రం చేసిన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2024లో వెలుగులోకి వచ్చి ఈ దారుణ వ్యవహారంపై సీబీఐ సిట్-ఏసీబీ సంయుక్తంగా దర్యాప్తు జరిపి 34 మందిని నిందితులుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితులు అందరినీ సిట్ అరెస్టు చేయడంతోపాటు వారికి వ్యతిరేకంగా సంపాదించిన ఆధారాలతో కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. అయితే ఇప్పుడు ఈ కల్తీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ ఫోకస్ చేసింది. లడ్డూ అపవిత్రం కేసులో సుమారు రూ.230 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం చేయడంతోపాటు మనీలాండరింగ్, నకిలీ బిల్లుల సృష్టి వంటి ఆరోపణలపై 2019-24 మధ్య టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాస్ చంద్ మంగ్లాను తాజాగా ఈడీ అరెస్టు చేసింది.

పవిత్రమైన తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా చేస్తామని చెప్పి, పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ తోపాటు ఎంజీ - 9, మోనోగ్లిజరైడ్స్, మైవాసెట్ పాఫ్ట్ 400, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ తదితర రసాయనాలు కలిపారని సిట్ అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అసలు ఆవు నెయ్యికి బదులుగా రసాయనాలతో కూడిన నెయ్యిని సరఫరా చేయడమే కాకుండా, దానిని 'అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ ఘీ'గా నమ్మించి టీటీడీకి సరఫరా చేశారని, తక్కువ ఖర్చుతో కల్తీ నెయ్యిని తయారు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా ఆర్జించారని సిట్ ఆరోపణలు చేసింది. ఈ అక్రమ వ్యాపారాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు ముఖ్జా సంస్థల (front entities) ద్వారా నకిలీ కొనుగోలు, అమ్మకాల రికార్డులను సృష్టించి కోట్లాది రూపాయల నిధులను చలామణి చేసినట్లు సిట్ తేల్చిందని చెబుతున్నారు. దీనిపై ఈడీ రంగంలోకి దిగి నిందితులకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఇందులో భాగంగా సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాస్ చంద్ మంగ్లాను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈడీ అరెస్టు చేసిన వారిలో మంగ్లా రెండో వారు. ఇంతకు ముందు నెయ్యి సరఫరా కాంట్రాక్టు పొందిన యూపీకి చెందిన భోలేబాబా డెయిరీ డైరెక్టర్ విపిన్ జైనును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో సిట్ అరెస్టు చేసింది. ఆయన జైలులో రిమాండు ఖైదీగా ఉన్నప్పుడే ఈడీ కూడా అరెస్టు చూపింది. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నరగా సైలెంటుగా ఉన్న ఈడీ అధికారులు ఇప్పుడు మళ్లీ లడ్డూ కేసును తెరపైకి తీసుకువచ్చి సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ మంగ్లాను అరెస్టు చేయడంతో కలకలం రేగింది. గత ఏడాది ఫిబ్రవరిలో విపిన్ జైన్ అరెస్టు తర్వాత స్తబ్దుగా ఉండిపోయిన ఈడీ దర్యాప్తులో మళ్లీ కదలిక రావడంతో నిందితులు టెన్షన్ పడుతున్నారు.

లడ్డూ కేసులో నిందితులుగా గుర్తించిన వారిని సిట్ అధికారులు అరెస్టు చేయగా, నిందితులలో చాలా మంది బెయిలుపై బయటకు వచ్చారని చెబుతున్నారు. అంతేకాకుండా సిట్ చార్జిషీటు దాఖలు చేయడం వల్ల దర్యాప్తు పూర్తయిందని, కోర్టు విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈడీ అరెస్టులు మొదలు అవడంతో మళ్లీ జైలు భయంతో నిందితులు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. అయితే ఈడీ కేసులో ఎక్కువగా మనీ ట్రైల్ కు సంబంధించిన అంశాలపైనే విచారణ జరగనున్నందున నెయ్యి సరఫరా చేసిన సంస్థలపైనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈడీ అరెస్టులు చేస్తున్న నిందితులతో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అనుచరుడు చిన్నప్పన్నకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. చిన్నప్పన్న కూడా లడ్డూ కేసులో నిందితుడిగా ఉండటంతో ఈడీ కేసులో ఆయన భవితవ్యం ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఇక సిట్ దర్యాప్తులో రాజకీయ ప్రముఖుల పాత్ర బయటకు రాలేదు. ఈడీ ఈ విషయంపై ఫోకస్ పెడుతుందా లేక నకిలీ బిల్లులు, ఇతర ఆర్థిక అంశాలకే పరిమితం అవుతుందా అనేది చూడాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.