టీటీడీ నెయ్యి కేసు.. ఫైనల్ చార్జిషీటులో ఏముందంటే..?
టీటీడీ అధికారులు, గత ప్రభుత్వ పెద్దలు, నెయ్యి సరఫరాదారులు కుమ్మక్కై ప్రణాళిక ప్రకారం కోట్లదా మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని సిట్ తన చార్జిషీటులో ఆరోపించింది.
By: Tupaki Political Desk | 24 Jan 2026 1:40 PM ISTతిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో తుది చార్జిషీటును సీబీఐ సిట్ నెల్లూరు కోర్టులో కోర్టుకు సమర్పించింది. ఇందులో పలు సంచలన విషయాలు వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేయగా, సర్వోన్నత న్యాయస్థానం సూచనలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి అసలు నెయ్యినే వాడలేదన్న విషయం సీబీఐ తేల్చినట్లు కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో పామాయిల్, రసాయినాలు కలిపి తయారు చేసిన నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చింది. ఈ మేరకు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో సంచలన విషయాలు తెలియజేసింది.
కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సంచలన విషయాలను గుర్తించింది. పామాయిల్, కెమికల్ మిశ్రమాలతో కలిపి నెయ్యిని తయారు చేశారని గుర్తించినట్లు కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో వెల్లడించింది. అంతేకాకుండా నెయ్యి కాంట్రాక్టు దక్కించుకున్న భోలే బాబా డెయిరీకి అసలు పాలు సేకరించిన చరిత్రే లేదని, టెండరు దక్కించుకున్న సరఫరా సంస్థలకు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదన్న చేదు నిజాన్ని సిట్ బయటపెట్టింది. కెమికల్స్, ముడి పదార్థాలు కలిపి భోలే బాబా డెయిరీ తయారు చేసిన నకిలీ నెయ్యి, ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా అయినట్లు తమ విచారణలో తేలినట్లు తెలిపింది. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది చార్జిషీటును సమర్పించింది.
టీటీడీ అధికారులు, గత ప్రభుత్వ పెద్దలు, నెయ్యి సరఫరాదారులు కుమ్మక్కై ప్రణాళిక ప్రకారం కోట్లదా మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని సిట్ తన చార్జిషీటులో ఆరోపించింది. భోలే బాబా డెయిరీ, టీటీడీ బోర్డు పెద్దలు, అధికారులు నడిపించిన ఈ తతంగాన్ని కూలంకుషంగా వివరించింది. నెయ్యి సరఫరాలో కుట్రలకు ఆధారాలు సమర్పించడంతో పాటు టెండర్లలో నిబంధనల మార్పు ద్వారా అంతిమంగా ఎవరెవరు లబ్ధి పొందారు. ఢిల్లీలోని మలేషియా పామాయిల్ దిగుమతిదారు నుంచి హర్ష ప్రెష్ డెయిరీ పేరుతో పామాయిల్ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యాపారి నుంచి కెమికల్ కనుగోలు చేసి ఫేక్ నెయ్యి ఎలా తయారు చేశారు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ పీఏ చిన్నప్పన్న, టీటీడీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎలా కుమ్మక్క్యారో చార్జిషీట్లో వివరించింది.
కల్తీ నెయ్యి సరఫరా దందా మొత్తం భోలేబాబా డెయిరీ కేంద్రంగా నడిచిందని, దాని యజమానులు పామిల్ జైన్, విపిన్ జైన్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర వహించారని సిట్ తెలిపింది. 2019-24 నడుమ టీటీడీకి 60.10 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయిందని, ఆ కాలంలో టీటీడీ ప్రొక్యూర్మెంట్, ల్యాచ్ తదితర విభాగాల్లో పనిచేసిన పలువురు అధికారులకు ఉద్యోగులు, కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి ఆ నెయ్యినే అనుమతించారని పేర్కొన్నట్లు చెబుతున్నారు. తద్వారా టీటీడీకి ఏకంగా రూ.250 కోట్ల వరకు దేవస్థానం నష్టపోయిందని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేందుకు వారు కారకులయ్యారని సిట్ చార్జిషీటులో తెలిపింది.
గత ఏడాది ఆగస్టులో వేసిన తొలి చార్జిషీటులో 15 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్, ఇప్పుడు దర్యాప్తు ముగించి తుది చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో అదనంగా 21 మందిపై నేరారోపణ చేసింది. వారిలో 12 మంది టీటీడీ అధికారులు, ఉద్యోగులు, డెయిరీ నిపుణులు ఉన్నారు. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 36 కాగా, అందులో ఐదు డెయిరీ సంస్థలు ఉన్నాయి. తుది చార్జిషీటులో 21 మంది నిందితులపై చేసిన నేరారోపణలకు సంబంధించి ప్రతి అంశంపైనా కోర్టుకు ఆధారాలు సమర్పించింది.
