కొత్త రికార్డుల దిశగా శ్రీవారి ఆదాయం
ఈ నేపథ్యంలో రానున్న బ్రహ్మోత్సవాలు.. సెలవు రోజులు.. పండుగ దినాల్ని పరిగణలోకి తీసుకుంటే భక్తుల రద్దీ మరింత పెరగటమే కాదు.. అదే స్థాయిలో హుండీ ఆదాయం పెరుగుతుందని చెప్పక తప్పదు.
By: Garuda Media | 4 Aug 2026 11:00 AM ISTతిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది. పాతి రికార్డుల్ని బద్ధలు కొడుతూ.. కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. భక్తులు సమర్పించే కానుకలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఒక రోజులో హుండీ ఆదాయం రూ.కోటి వస్తే.. ఇంత భారీగానా? అనుకునే పరిస్థితి. ఇప్పుడు అదే రోజులో ఏకంగా రూ.3 కోట్లు దాటేస్తున్న పరిస్థితి. తాజాగా ముగిసిన జులై హుండీ ఆదాయం లెక్కల్ని చూస్తే.. కొత్త రికార్డుల్ని నమోదు చేసిన వైనం అర్థమవుతోంది. రోజువారీగా రూ.3 కోట్లు చొప్పున వేసుకున్నా.. రూ.120 కోట్లు అవుతుంది. కానీ.. గడిచిన నెలలో హుండీ ద్వారా స్వామి వారికి లభించిన ఆదాయం అక్షరాల రూ.140.28 కోట్లుగా టీటీడీ వెల్లడిస్తోంది.
మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు అంటే ఏడు నెలల వ్యవధిలో రూ.861 కోట్లుగా నమోదైంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.3 కోట్లు.. రద్దీ రోజుల్లో రూ.4 కోట్ల ఆదాయం భక్తులు హుండీలో వేసే కానుకల రూపంలో వస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతి రోజు నెలకు రూ.100 కోట్లకు పైనే హుండీ ఆదాయం స్వామి వారికి వస్తోంది.
గడిచిన ఏడు నెలల్లో జులైలో అత్యధికంగా రూ.140 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది. గడిచిన ఏడు నెలల్లో ఐదు నెలలు రూ.120 కోట్ల మార్కును దాటటం ఒక విశేషంగా చెబుతున్నారు. గడిచిన ఏడు నెలల్లో తిరుమలకు సుమారు 1.62 కోట్ల మంది భక్తులు వచ్చినట్లుగా టీటీడీ చెబుతోంది. రోజువారీ హుండీ ఆదాయం విషయానికి వస్తే.. జులైలోని రెండు రోజులు ఏకంగా రూ.5 కోట్ల మార్కును దాటగా.. చాలా రోజులు రూ.4 కోట్ల మార్క్ ను అధిగమించిన వైనం టీటీడీ లెక్కల్ని చూస్తే అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో రానున్న బ్రహ్మోత్సవాలు.. సెలవు రోజులు.. పండుగ దినాల్ని పరిగణలోకి తీసుకుంటే భక్తుల రద్దీ మరింత పెరగటమే కాదు.. అదే స్థాయిలో హుండీ ఆదాయం పెరుగుతుందని చెప్పక తప్పదు. ఇదంతా చూస్తే.. 2026 ముగిసే నాటికి ఇప్పటివరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేనంత భారీగా హుండీ ఆదాయం లభించిన ఏడాదిగా నిలుస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతోంది. ఒకప్పుడు రోజుకు హుండీ ఆదాయం రూ.కోటి వస్తే గొప్పగా అనుకునే పరిస్థితి నుంచి రానున్న రోజుల్లో రోజుకు రూ.5 కోట్ల హుండీ ఆదాయం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం టీటీడీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
