Begin typing your search above and press return to search.

శ్రీవారి సన్నిధిలో ఉచిత పెళ్లి.. పూర్తి వివరాలివే!

నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో వివాహం చేసుకోవాలన్న కుతూహలంతో ఎంతోమంది వధూవరులు ఇక్కడ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు.

By:  Madhu Reddy   |   21 Jan 2026 11:25 PM IST
శ్రీవారి సన్నిధిలో ఉచిత పెళ్లి.. పూర్తి వివరాలివే!
X

కాలం మారుతున్న కొద్దీ పెళ్లి వేడుకలలో కూడా మార్పులు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది కోట్లు ఖర్చు చేసి వివాహాలు చేసుకుంటుంటే .. మరి కొంతమంది దేవాలయాల్లో ఆ దేవుడు సమక్షంలో ఆయన ఆశీర్వాదంలో వివాహం చేసుకొని.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

అందులో భాగంగానే శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో జంటలు వైవాహిక బంధంలోకి శ్రీవారి సన్నిధిలో ఒక్కటయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా వివాహం చేసుకోబోతున్న జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. ఎవరైతే శ్రీవారి సన్నిధిలో ఉచితంగా వివాహం చేసుకోవాలనుకుంటున్నారో.. ఆ వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. మరి ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో వివాహం చేసుకోవాలన్న కుతూహలంతో ఎంతోమంది వధూవరులు ఇక్కడ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. అందులో భాగంగానే పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద టీటీడీ తిరుమల దేవస్థానం గత 10 ఏళ్లుగా సామాన్యుల పెళ్లిలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సీజన్ ని బట్టి ఇక్కడ డిమాండ్ కూడా ఉంటుంది

కావలసిన అర్హతలు..

1.వివాహం చేసుకోవాలనుకున్న వారిలో వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

2.ముఖ్యంగా తిరుమలలో వివాహం చేసుకోవడానికి ఇద్దరూ హిందువులై ఉండాలి.

3.పైగా రెండో పెళ్లి, పెద్దల అనుమతి లేని వివాహాలకు ఇక్కడ అనుమతి లభించదు.

4.వివాహానికి ఇరువురి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఒకవేళ వారు హాజరు కాలేకపోతే తగిన కారణాలతో లేఖ సమర్పించాలి. అంతేకాదు ఒకవేళ తల్లిదండ్రులు లేని వధూవరులు వివాహం చేసుకుంటున్నట్లయితే వారి మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

1.ఇకపోతే ఇక్కడ వివాహం చేసుకోవాలనుకున్న వారు ముందుగా ఆన్లైన్ లో స్లాట్ లు బుక్ చేసుకోవాలి. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో కల్యాణ వేదిక కాలంలో వధూవరులు, వారి తల్లిదండ్రుల పేర్లతో పాటు వధూవరులు , వారి తల్లిదండ్రుల ఆధార్ వివరాలు, వివాహ తేదీ, సమయం అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

2.అక్నాలెడ్జ్మెంట్ పత్రంతోపాటు వధూవరులు సంబంధిత తహసీల్దారుల నుంచి ఇదే మొదటి వివాహం అని అన్ మారీడ్ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి అలాగే ఆన్లైన్ బుకింగ్ ద్వారా వచ్చే అక్నాలెడ్జ్మెంట్ పై ఎమ్మార్వో సంతకం చేయించాలి.

3.ఇక్కడ వధూవరుల ఆధార్ కార్డులు, వారి వయసు ధ్రువపత్రం (టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో లేదా బర్త్ సర్టిఫికెట్) సమర్పించాలి.

4.ముఖ్యంగా ఒరిజినల్, జిరాక్స్ పత్రాలను తీసుకొని ముహూర్తానికి 6 గంటల ముందే కళ్యాణ వేదిక వద్దనున్న కార్యాలయాన్ని సంప్రదించాలి.

5.అక్కడి సిబ్బందికి ఇచ్చి ధ్రువీకరణ పొందాలి. ఇక అవకాశాన్ని బట్టి రూ.50 చెల్లించి గదిని సిఆర్ఓ, ఏఆర్పి కార్యాలయం వద్ద పొందవచ్చు.

వధూవరులకు తిరుమల దేవస్థానం కల్పించే ఉచిత సేవలు..

1.వివాహం చేసుకోవాలనుకున్న వధూవరులకు ఇక్కడ పురోహితుడు పసుపు కుంకుమ కంకణం మంగళ వాయిద్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా అందిస్తుంది.

2.అయితే మంగళసూత్రం నూతన వస్త్రాలు అలాగే ఇతర పెళ్లి సామాగ్రిని వధూవరులే తెచ్చుకోవాలి.

దర్శనంతో పాటు కల్పించే ఇతర సౌకర్యాలు..

1.వివాహం చేసుకున్న వధూవరులకు స్వామి వారి దర్శన భాగ్యాన్ని కూడా సులభంగా కల్పిస్తోంది.

2.నూతన దంపతులతో పాటు వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఆరుగురికి ఏటీసీ వద్దనున్న క్యూ లైన్ మీదుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం మార్గంలో ఉచితంగా అనుమతి కల్పిస్తారు.

3.దర్శన అనంతరం వివాహ రిసిప్ట్ లో పేర్కొన్న వారి సంఖ్యను బట్టి ఉచితంగా లడ్డూలు కూడా ఇస్తారు.

మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే..

1.ఇకపోతే వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఇక్కడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది.

2.ఇందుకోసం వధూవరులు ఇద్దరు కూడా తమ వయసు ధ్రువపత్రాలు, నివాస వివరాలు, పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటో, కళ్యాణమండపం రసీదుతోపాటు అన్ మ్యారీడ్ సర్టిఫికెట్ ని కూడా వారిద్దరూ సమర్పించాలి. అనంతరం పెళ్లయిన వెంటనే ఇక్కడే మ్యారేజ్ సర్టిఫికెట్ ను పొందవచ్చు.

ఇక పూర్తి వివరాల కోసం.. 0877 -2263433 కాల్ చేసి తెలుసుకోవచ్చు.