Begin typing your search above and press return to search.

తిరుమ‌ల సేఫ్‌: రోబో డాగ్‌లు ఎంట్రీ!

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పిస్తూ.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది

By:  Garuda Media   |   28 Aug 2026 10:00 PM IST
తిరుమ‌ల సేఫ్‌: రోబో డాగ్‌లు ఎంట్రీ!
X

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పిస్తూ.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యంగా తిరుమ‌ల‌కు మెట్ల మార్గంలో వ‌చ్చే భ‌క్తుల‌కు ప్రాణాపాయంగా మారిన పులులు అట‌వీ జంతువుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేలా రోబో డాగ్‌ల‌ను ఏర్పాటు చేసింది. తిరుమ‌ల‌కు మెట్ల మార్గంలో వ‌చ్చేందుకు రెండు దారులు ఉన్నాయి. 1) అలిపిరి. 2) శ్రీవారి మెట్టు(దేవుని గ‌డ‌ప‌). ఈ రెండు మార్గాల్లో.. అలిపిరి నుంచి అత్య‌ధిక సంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల చేరుకుంటారు.

అయితే.. రెండేళ్ల కింద‌ట ఓ చిన్నారిని చిరుత‌పులి ఎత్తుకుపోయి.. తినేసిన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఆ స‌మ‌యంలో భ‌క్తులు అలిపిరి మార్గంలో వెళ్లేందుకు భ‌య‌ప‌డిపోయారు. ఆ త‌ర్వాత‌.. కూడా ఎలుగు బంట్లు, న‌క్క‌లు, పులులు ఈ మార్గంలో క‌నిపించాయి. దీంతో సాధార‌ణ భ‌ద్ర‌త స‌రిపోద‌ని భావించిన టీటీడీ.. అధునాత‌న సాంకేతిక‌తను వినియోగించేలా తొలుత కెమెరాలు ఏర్పాటు చేసింది. పులుల సంచారాన్ని.. వ‌న్య‌మృగాల జాడ‌ను క‌నిపెట్టింది. అయిన‌ప్ప‌టికీ.. ఆశించిన ఫ‌లితం క‌నిపించ‌లేదు.

దీంతో తాజాగా రోబో డాగ్‌ల‌ను ప్ర‌వేశ పెట్టింది. మెట్ల మార్గం కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే రోబో డాగ్‌లతో పహరా ఏర్పాటు చేసింది. ఈ డాగ్‌లు.. వ‌న్య ప్రాణుల‌ను అల్లంత దూరం నుంచే గుర్తిస్తాయి. అంతేకాదు.. ఈ డాగ్స్‌.. ప్ర‌త్యేక శ‌బ్దాలు చేసి.. వాటిని త‌రిమి కొడ‌తాయి. ఈ రోబో డాగ్ చిమ్మ‌ చీకటి, దట్టమైన పొగవమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం వన్య ప్రాణుల సంచారాన్ని పసిగట్టి.. సైరెన్ ఇవ్వ‌డం ద్వారా వాటిని చెద‌ర గొడుతుంది. కాగా.. ఈ డాగ్ ఒక్కొక్క‌టి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం రెండు డాగ్‌ల‌ను తీసుకున్న‌ట్టు చెప్పారు. ఇవి స‌క్సెస్ అయితే.. మ‌రో రెండు డాగ్స్‌ను తీసుకుని ప‌హారాను ప‌టిష్టం చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.