Begin typing your search above and press return to search.

తిరుమల దర్శన టికెట్లు...ఏపీకి భారీ వాటా !

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. స్వామి వారు కలియుగ ఇల వేలుపు. శ్రీవారిని నిత్యం తలచుకునే వారు నూటికి నూరు శాతం ఆస్థిక జనులు ఉంటారు.

By:  Satya P   |   28 Sept 2026 11:30 PM IST
తిరుమల దర్శన టికెట్లు...ఏపీకి భారీ వాటా !
X

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. స్వామి వారు కలియుగ ఇల వేలుపు. శ్రీవారిని నిత్యం తలచుకునే వారు నూటికి నూరు శాతం ఆస్థిక జనులు ఉంటారు. వీలైతే తిరుమల వెళ్ళి రావాలని ఏడాది పొద్దూ ఆలోచించని హిందువు ఉండడు అంటే అతి శయోక్తి కాదు. ఇక స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దానికి జనంలో పెరిగిన భక్తి భావం ఒకటి అయితే అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు మరో కారణం. ఇక ప్రజలకు కూడా ఆధ్యాత్మిక క్షేత్రాలు తిరిగి రావాలన్న బలమైన ఆకాంక్ష అధికం అవడం ఇంకో కారణం. దీంతో ఈ మధ్య కాలంలోనే ఒక్క రోజులో దాదాపుగా లక్ష మంది దాకా భక్తులు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు అని వార్తలు వచ్చాయి. అది అతి పెద్ద రికార్డు కూడా అయింది.

మే నెలలోనే :

తిరుమలలో భక్తుల రద్దీ చూస్తే ఈ ఏడాది మే నెలలో ఈ విధంగా రికార్డు క్రియేట్ అయింది. మే నెలలో ఒకే రోజు దాదాపు లక్ష మంది లెక్క ఖచ్చితంగా చెప్పాలంటే 98 వేల 58 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ భారీ రద్దీని తట్టుకుని మరీ సరి కొత్త మైలురాయిని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దాటారు. ఈ రద్దీని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఖచ్చితంగా లెక్కించారు. అలాగే ఈ మధ్య కాలంలో నమోదైన మరి కొన్ని ప్రధాన రికార్డుల వివరాలు చూస్తే కనుక అత్యధిక నెలవారీ రద్దీ జూన్ నెలలో నమోదు అయింది. తిరుమల చరిత్రలోనే అత్యధికంగా ఒకే నెలలో ఏకంగా పాతిక లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామి కోసమే :

ఇక ఈ ఏడాది వేసవి కాలంలో రోజు వారీ సగటు భక్తుల సంఖ్య 82 వేల నుండి 84 వేల దాకా కొనసాగింది. కొన్ని వారాంతాలలో ముఖ్యంగా జూన్ చివరి వారంలో కొండపై వేచి ఉన్న భక్తుల సంఖ్య 1.5 లక్షలు దాటిపోయింది అని లెక్కలు చెప్పాయి. శ్రీవారి హుండీ ఆదాయం చూసినా ఆల్‌ టైమ్ రికార్డుగా నమోదు అయింది. ఈ నెలలో ఒకే రోజు శ్రీవారి హుండీ కానుకల ద్వారా రికార్డు స్థాయిలో ఏకంగా 6.93 కోట్ల ఆదాయం లభించింది. ఇవన్నీ చూసినపుడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతగా తపిస్తున్నారో అర్ధం అవుతుంది. అదే సమయంలో శ్రీవారి దర్శనం కోసం టికెట్లు అయితే ఆన్ లైన్ లో లభించడం దుర్లభంగా మారుతోఅంది అన్న కొత్త చర్చ మొదలైంది.

స్పెషల్ ఎంట్రీ టికెట్లు :

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్లు అయితే ఆన్ లైన్ లో ప్రతీ నెలా విడుదల చేస్తారు. అయితే ఈ టికెట్లు అక్కడ దొరకడం అతి పెద్ద టాస్క్ గా మారుతోంది అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ క్యూ లైన్లు చూపిస్తూనే ఉండగానే టికెట్లు కొద్ది నిముషాలలోనే అయిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఇలా అయితే ఎలా స్వామీ అని వారు తెగ మధన పడుతున్నారు. దాంతో శ్రీవారి దర్శన భాగ్యం తమకు కలగదా అని వాపోతున్నారు. దీని మీద ఇటీవల కాలంలో నెట్ లో పెద్ద చర్చ సాగుతోంది.

ప్రత్యేక కోటాగా :

దీంతో ఈ అంశం మీద నెటిజన్లు తలో విధంగా స్పందిస్తున్నారు. అలాగే టీటీడీకి సూచనలు ఇస్తున్నారు. ఒక్క ఏపీకే స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ల విషయంలో ముప్పయి శాతం కోటా కేటాయించాలని వినతి చేస్తున్నారు. అలా అయితేనే తాము స్వామిని దర్శించుకోగలమని కూడా అంటున్నారు. ఆంధ్రాలో ఉన్న స్వామి వారిని దర్శించుకునేందుకు సొంత రాష్ట్ర ప్రజలకు ప్రతీ నెలా విడుదల చేసే 300 దర్శన టికెట్లన్లో 30 శాతం టికెట్లు కోటాగా రిజర్వ్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. అలాగే తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో కూడా ఆంధ్రాకు చెందిన భక్తుల కోసం ప్రత్యేక కోటాని పెట్టాలని అంటున్నారు. ఈ విషయాల మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీర్మానం చేయాలని కూడా సూచిస్తున్నారు. అలా అయితేనే ఏపీ ప్రజలు స్వామిని దర్శించుకునేందుకు ఇంత రద్దీలోనూ వీలు అవుతుందని లేకపోతే రానున్న కాలంలో మరింత రద్దీ పెరిగితే శ్రీవారి దర్శన భాగ్యం గగన కుసుమం అవుతుందని అంటున్నారు. మరి ఈ విధంగా ప్రత్యేక కోటా ప్రవేశ పెట్టడం సాధ్యమేనా అన్నది అయితే చర్చగా ఉంది.