ప్రపంచ పర్యాటక గుండెకాయలో తూటాల కలకలం.. అమెరికా భద్రతపై పెరిగిన ఆందోళనలు
ప్రపంచ పర్యాటక రంగానికి మకుటాయమానంగా నిలిచే న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ మరోసారి తూటాల శబ్దంతో దద్దరిల్లింది.
By: A.N.Kumar | 19 Jun 2026 10:16 AM ISTప్రపంచ పర్యాటక రంగానికి మకుటాయమానంగా నిలిచే న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ మరోసారి తూటాల శబ్దంతో దద్దరిల్లింది. నిరంతరం విద్యుత్ కాంతులు, పర్యాటకుల కోలాహలంతో రాత్రింబవళ్లు తేడా లేకుండా కిటకిటలాడే ఈ అంతర్జాతీయ కూడలిలో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ శబ్దాలు ప్రజలను ప్రాణభయంతో పరుగులు తీయించాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన కేవలం ఒక సాధారణ నేరంగా మిగిలిపోలేదు. అమెరికా భద్రతా వ్యవస్థపై, అక్కడ నానాటికీ పెరుగుతున్న తుపాకీ సంస్కృతిపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.
పర్యాటక స్వర్గధామంలో భయాందోళనలు
రోజుకు లక్షలాది మంది దేశ విదేశీ పర్యాటకులు సందర్శించే టైమ్స్ స్క్వేర్ వంటి రద్దీ ప్రాంతంలో కాల్పులు జరగడం సామాన్యమైన విషయం కాదు. కాల్పుల శబ్దం వినబడగానే పర్యాటకులు ప్రాణాలు కాపాడుకోవడానికి స్థానిక దుకాణాలు, హోటళ్లలోకి పరుగులు తీశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు అక్కడ నెలకొన్న భయానక వాతావరణాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ పర్యాటక కేంద్రాల్లో భద్రతా లోపాలు తలెత్తితే అది ప్రపంచవ్యాప్తంగా ఆ నగరం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తుంది. పర్యాటకులు అమెరికా పర్యటనలకు రావడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుంది.
వ్యక్తిగత విభేదాలా? వ్యవస్థాగత లోపమా?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది వ్యక్తిగత విభేదాల వల్ల జరిగిన కాల్పులుగా భావిస్తున్నప్పటికీ అసలు సమస్య తుపాకుల లభ్యత లోనే ఉంది. అమెరికాలో 'గన్ వయలెన్స్' అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధిలా మారింది. "టైమ్స్ స్క్వేర్ వంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతాల్లోకి కూడా ఆయుధాలు ఎలా వస్తున్నాయి? పర్యాటకుల రక్షణకు గ్యారెంటీ ఎక్కడ?" అనే ప్రశ్నలు ఇప్పుడు మేధావుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
పెరుగుతున్న ఈ హింసకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే
అమెరికాలో తుపాకులు కొనడం, కలిగి ఉండటం చాలా సులభం కావడం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా ప్రాణాంతక కాల్పులకు దారితీస్తున్నాయి. మానసిక ఒత్తిడి సామాజిక వైషమ్యాలు అమెరికాలో పెరిగిపోతున్నాయి. కోవిడ్ తదనంతర కాలంలో ప్రజల్లో పెరుగుతున్న అసహనం, వ్యక్తిగత కక్షలు వీధుల్లోకి వస్తున్నాయి.
భద్రతా వ్యవస్థకు సవాల్
ఈ ఘటన జరిగిన వెంటనే న్యూయార్క్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ భవిష్యత్తుపై ఆందోళనలు మాత్రం తొలగలేదు. టైమ్స్ స్క్వేర్ చుట్టుపక్కల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కేవలం నిఘా కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు పెంచడం మాత్రమే కాకుండా తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
అమెరికా కలల నగరమైన న్యూయార్క్‌కు టైమ్స్ స్క్వేర్ ఒక ఐకాన్. అలాంటి ప్రాంతంలో శాంతిభద్రతలు క్షీణిస్తే అది అమెరికా అంతర్గత భద్రతా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇకనైనా పాలకులలో చట్టసభలలో తుపాకీ సంస్కృతిని అరికట్టేలా గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా చెప్పుకునే అమెరికా.. పర్యాటకులకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మారే ప్రమాదం ఉంది.
