Begin typing your search above and press return to search.

వదలా ‘కుక్’.. వదలా.. అంటూ రిటైరైన టిమ్ ను పట్టుకొని వేలాడుతున్న యాపిల్ సంస్థ

సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఛైర్మన్ పదవి అంటే కేవలం బోర్డు సమావేశాలకే పరిమితమై మార్గనిర్దేశం చేసే ఒక గౌరవప్రదమైన పాత్ర.

By:  A.N.Kumar   |   2 Sept 2026 5:00 PM IST
వదలా ‘కుక్’.. వదలా.. అంటూ రిటైరైన టిమ్ ను పట్టుకొని వేలాడుతున్న యాపిల్ సంస్థ
X

యాపిల్ సామ్రాజ్యంలో ఒక శకం ముగిసి మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు 15 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ఒకటైన యాపిల్‌ను విజయవంతంగా నడిపించిన టిమ్ కుక్.. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టెర్నస్ నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అయితే టిమ్ కుక్ సీఈవో పదవికి రాజీనామా చేసినంత మాత్రాన యాపిల్ నుంచి పూర్తిగా తప్పుకోలేదు. కంపెనీ ఆయనను ‘ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్’గా కొనసాగిస్తుండటమే ఇప్పుడు టెక్ ప్రపంచంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.

కొత్త పాత్ర.. భారీ ప్యాకేజీ

సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఛైర్మన్ పదవి అంటే కేవలం బోర్డు సమావేశాలకే పరిమితమై మార్గనిర్దేశం చేసే ఒక గౌరవప్రదమైన పాత్ర. రోజువారీ నిర్ణయాల్లో వారికి నేరుగా జోక్యం ఉండదు. కానీ టిమ్ కుక్ విషయంలో యాపిల్ భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకుంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదా ఇస్తూ సంస్థ వ్యాపార వ్యూహాలు, విధానపరమైన నిర్ణయాలు.. వివిధ దేశాల ప్రభుత్వాలతో కీలక సంబంధాలను పర్యవేక్షించడంలో కుక్ చురుగ్గా పాల్గొంటారు. సీఈవో పదవితో పోలిస్తే కొత్త బాధ్యతల్లో ఆయన ప్యాకేజీ 40 శాతం తగ్గింది. అయినప్పటికీ ఏడాదికి సుమారు 47 మిలియన్ డాలర్లు.. రూ. 2 మిలియన్ల జీతం + రూ. 45 మిలియన్ల షేర్లు అందుకోనున్నారు. ఇక కొత్త సీఈవో జాన్ టెర్నస్‌కు సుమారు 55 మిలియన్ డాలర్ల ప్యాకేజీ దక్కనుంది.

యాపిల్ ఎందుకు వదులుకోవడం లేదు?

టిమ్ కుక్ కేవలం ఒక మేనేజర్ మాత్రమే కాదు. యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌ను నిర్మించిన ప్రధాన వ్యూహకర్త. ముఖ్యంగా చైనాలో ఉత్పత్తుల తయారీ.. సరఫరా వ్యవస్థలను నిలబెట్టడంలోనూ.. అమెరికా ప్రభుత్వ వాణిజ్య నియంత్రణలు.. డిజిటల్ చట్టాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ కుక్‌కు దశాబ్దాల అనుభవం ఉంది. ప్రస్తుత సంక్లిష్టమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో కుక్ లాంటి దిగ్గజాన్ని పూర్తిగా పక్కన పెట్టడం యాపిల్‌కు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆయనను ఒక 'మెంటర్ ప్లస్ స్ట్రాటజిస్ట్'గా కొనసాగిస్తూ అంతర్జాతీయ సవాళ్లను అధిగమించాలని యాపిల్ భావిస్తోంది.

కొత్త సీఈవో జాన్ టెర్నస్ ముందున్న సవాళ్లు

స్టీరింగ్ వీల్ టెర్నస్ చేతికి వచ్చినప్పటికీ ఆయన ముందు భారీ సవాళ్లు వేచి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో శామ్‌సంగ్ వంటి ప్రత్యర్థులతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయి. యాపిల్ ఎకోసిస్టమ్‌లోకి ఏఐని విస్తృతంగా తీసుకురావడంతో పాటు, ఎంతో కాలంగా మార్కెట్ నిరీక్షిస్తున్న 'ఫోల్డబుల్ ఐఫోన్'ను విజయవంతంగా ప్రారంభించడం టెర్నస్‌కు మొదటి పరీక్ష కానుంది. మొత్తానికి టిమ్ కుక్ రిటైర్ అయ్యారని చెప్పడం కంటే యాపిల్‌లో తన పాత్రను మార్చుకొని సంస్థకు దిక్సూచిగా మారారని చెప్పడం సమంజసం.