ముంబై అండర్‌వరల్డ్ ఎటాక్స్: ఎవడ్రా ఈ అనిల్ పండిట్? వీడి వార్నింగ్ వింటే ఎవరికైనా దడ పుట్టాల్సిందే!
సల్మాన్ ఖాన్ పై బిగ్ ఎటాక్స్ తర్వాత ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ పై తుపాకులతో విరుచుకుపడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.
By: Sivaji Kontham | 19 Oct 2026 10:35 AM ISTసల్మాన్ ఖాన్ పై బిగ్ ఎటాక్స్ తర్వాత ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ పై తుపాకులతో విరుచుకుపడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. టైగర్ కార్ పై ఏడు రౌండ్లు కాల్పులు జరిపి దుండగులు బైక్ పై పారిపోతున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఉన్నారు. ఇందులో ఇద్దరి ఫోటోలతో సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు సీసీ కెమెరాలకు చిక్కారు..! అంటూ ప్రస్తుతం ఓ ఫోటో నెట్ లో షికార్ చేస్తోంది. ఆ ముగ్గురు దుండగులు 7 రౌండ్లు కాల్పులు జరిపి బైక్ పై పారిపోయారని ఇప్పటికే కథనాలొచ్చాయి. నిజానికి వీళ్లు భయపెట్టాలని వచ్చినా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. టైగర్ ష్రాఫ్ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడని తాజాగా విడుదలైన ఫుటేజ్ స్పష్ఠంగా చెబుతోంది. ప్రతిదీ సీసీల్లో రికార్డ్ అయింది.
ఈ ఘటన అనంతరం తాము బాధ్యత వహిస్తున్నామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లో కీలక సభ్యుడైన అనీల్ పండిట్ నుంచి ఒక వాయిస్ నోట్ కలకలం రేపింది. ఈ వాయిస్ లో ఏం ఉందో వింటే ఎవరికైనా దడ పుట్టాల్సిందే! అసలింతకీ పండిట్ వాయిస్ లో ఏం ఉందో యథాతథంగా విన్నవారికి నిజంగానే గూస్ బంప్స్ పుట్టుకొచ్చాయి.
``రామ్ రామ్ జీ.. అందరు అన్నలకూ, నేను అనిల్ పండిట్, లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిని. ఈరోజు ముంబైలో టైగర్ షాప్ పై జరిగిన దానికి బాధ్యత నేను, అనిల్ పండిట్.. మా పెద్ద అన్న అర్మాన్ సంధు తీసుకుంటున్నాము.
మేము వీడికి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాము.. కానీ వీడికి అర్థం కాలేదు. ఇండస్ట్రీలో ఎవరైతే మాకు వ్యతిరేకంగా పని చేస్తారో లేదా సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేస్తారో, వాళ్ళని మేము చంపేస్తాము. ఇది మొదటి.. చివరి హెచ్చరిక.
ఈ సల్మాన్ ఖాన్ దావూద్‌కు కుక్కలా తయారయ్యాడు.. దావూద్ అనే కుక్కని మేము మా ఇంట్లో పెంచుకుంటున్నాము. సల్మాన్ ఖాన్ జాగ్రత్తగా విను.. ఒకవేళ నువ్వు మా పెద్దన్న లారెన్స్ బిష్ణోయ్ నుండి లేదా బిష్ణోయ్ సమాజం నుండి క్షమాపణ కోరకపోతే.. నీ ఇంట్లో కుక్కను కూడా వదలం.. మీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తాము. ఈ మాట మీ మైండ్‌లో పెట్టుకోండి.
నువ్వు సెక్యూరిటీలో ఉన్నానని.. నీకేం కాదని అనుకుంటున్నావు కదా.. నీ ఆ భ్రమని నీ సెక్యూరిటీ మధ్యలోనే బద్దలు కొడతాము. ఈ ప్రపంచం మొత్తం దీన్ని గుర్తుంచుకుంటుంది. అలాగే మా అన్నకు వ్యతిరేకంగా ఫేమ్ కోసం మొరుగుతున్న కొందరు కుక్కలు కూడా సిద్ధంగా ఉండండి.. కొంచెం సమయం పట్టవచ్చు కానీ అందరి నంబర్ వస్తుంది!! అంటూ అనీల్ పండిట్ వాయిస్ నోట్ లో తీవ్రంగా బెదిరిస్తూ దడ పుట్టించాడు!
ఎవరు ఈ అనిల్ పండిట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఒకే ఒక్కడు:
ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించడంతో పాటు, అమెరికా నుండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్న అనిల్ పండిట్ అనే `ప్రతినిధి` ద్వారా ఒక హెచ్చరిక సందేశాన్ని విడుదల చేసింది. ఈ గ్యాంగ్ కి లక్ష్యంగా ఉన్న నటుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయవద్దని తాము టైగర్ ష్రాఫ్‌ను హెచ్చరించినా.. అతడు వినలేదని పండిట్ పేర్కొన్నాడు. హర్యానాలోని పానిపట్‌కు చెందిన 32 ఏళ్ల అనిల్ పండిట్ 2023లో కెనడాకు వెళ్లే ముందు స్థానికంగా నేరాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత కెనడా, థాయ్‌లాండ్, దుబాయ్ మీదుగా అమెరికా చేరుకుని, లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడైన రణ్‌దీప్ మాలిక్ ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్‌లో చేరాడు. గత ఆరు నెలలుగా విదేశాల నుండి నెట్‌వర్క్‌ను నడుపుతూ హర్యానా, ఢిల్లీ, పుణేలలో విదేశీ ఆయుధాలతో కాల్పులు, రాకెట్ వసూళ్ల వంటి అనేక నేరాలకు ఒడిగట్టాడు.
ఢిల్లీలో గాయకుడు గురు రాంధవా వెళ్లే జిమ్‌పై కాల్పులు.. హర్యానాలో గాయకుడు దిలేర్ ఖార్కియా కారుపై దాడి.. పానిపట్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పుల సంఘటనలకు అనిల్ పండిట్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఢిల్లీ జిమ్ కాల్పుల కేసులో పోలీసులు నలుగురు షూటర్లను అరెస్టు చేయగా.. వారు పండిట్‌తో సంప్రదింపులు జరపడానికి `సిగ్నల్` యాప్‌ను ఉపయోగించినట్లు తేలింది. అలాగే పుణేలోని ఒక జ్యువెలరీ షాప్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కూడా ఇతడి పేరు బయటపడగా... మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన షూటర్లకు పండిట్ - బిష్ణోయ్ మరో అనుచరుడు శుభం లోంకర్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. హర్యానా పోలీస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్.టి.ఎఫ్) - ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్త ఆపరేషన్ల ద్వారా ఈ షూటర్లలో చాలా మందిని అరెస్టు చేశారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ముడిపడి ఉన్న ఇతర ముఖ్యమైన పేర్లలో రణ్‌దీప్ మాలిక్, హారీ బాక్సర్, హర్మాన్ సంధు, టైసన్ బిష్ణోయ్, శుభం లోంకర్ ఉన్నారు. వీరిలో హర్మాన్వీర్ సింగ్ అలియాస్ హర్మాన్ సంధు (హరి గౌతమ్) అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడు. 1994లో పంజాబ్‌లో జన్మించిన సంధుపై ల్యాస్ ఎంజెల్స్‌కు చెందిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో.. కాలిఫోర్నియా హైవే పెట్రోల్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా పోలీసులు `ఆపరేషన్ హార్డ్ బాల్` పేరుతో లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్‌పురియా, రవీందర్ ధండా గ్యాంగ్‌లపై భారీ స్థాయిలో విరుచుకుపడి వారి అంతర్జాతీయ డ్రగ్స్ - నేర నెట్‌వర్క్‌ను దెబ్బతీశారు. అయినా బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో తమ అరాచకాలను మాత్రం వదిలి పెట్టడం లేదు.. సెలబ్రిటీలకు నేరుగా కాల్పులతో వార్నింగులు ఇస్తూ దడ పుట్టించడంపై చర్చ సాగుతోంది.
