టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో ముగ్గురు అరెస్ట్!
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల కలకలం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
By: Madhu Reddy | 19 Oct 2026 4:05 PM ISTబాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల కలకలం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు రాజస్థాన్ కోటా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించారు. కేవలం 15 గంటల వ్యవధిలోనే ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను రైలులో ప్రయాణిస్తుండగా కోటా రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. దీని వెనుక ఓ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కాల్పుల ఘటన.. తృటిలో తప్పిన ప్రాణాపాయం:
అక్టోబర్ 18, 2026 సాయంత్రం ముంబైలోని జుహులో ఫుట్‌బాల్ ఆడి కారులో తిరుగు ప్రయాణమైన టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఇక ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తుండగా దాడి జరిగింది. ఈ సమయంలో దుండగుల తుపాకీ జామ్ కావడంతో టైగర్ ష్రాఫ్ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే ఇక పగిలిన అద్దాల ముక్కలు, గన్‌పౌడర్ కారణంగా ఆయనకు స్వల్ప గాయాలవగా, కారు డ్రైవర్ ఫిర్దౌస్, మరోఆటో డ్రైవర్ గాయపడ్డారు.వెంటనే స్పందించిన టైగర్ స్వయంగా కారు నడుపుతూ గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పట్టుబడిన నిందితులు వీరే:
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో ట్రైన్లో పరారవుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హర్యానా సోనిపట్‌కు చెందిన 17 ఏళ్ల ఫూల్ సింగ్, ముంబై అంధేరిలో రాపిడో రైడర్‌గా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన హృతిక్ కుమార్ అలియాస్ రోషన్ (22), మరియు హర్యానాకు చెందిన మరో యువకుడు రెహాన్ (18) ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక దాడికి ముందు వీరు సుమారు 10 రోజుల పాటు టైగర్ నివాసాన్ని, అయన జిమ్‌ను రెక్కీ చేసినట్లు తేలింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లింక్:
ఈ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలీవుడ్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ముంబైలో భయాందోళనలు సృష్టించేందుకు ఈ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నిందితుల వ్యక్తిగత పాత్రలు, ఈ దాడి వెనుక ఉన్న అసలు కుట్ర కోణాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా త్వరలోనే నిందితులను కస్టడీకి తీసుకునేందుకు ముంబై పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇక మొత్తానికి చూస్తే, టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగిన అతి తక్కువ సమయంలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడం అభినందనీయం. సెలబ్రిటీల భద్రతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసిన ఈ ఘటనలో, త్వరలోనే పూర్తి నిజాలు వెలుగులోకి రానున్నాయి..
