చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?
కొద్ది రోజులుగా రాజకీయ చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీలు అధికార టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారానికి తగ్గట్లే శుక్రవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
By: Garuda Media | 20 Sept 2025 1:00 PM ISTకొద్ది రోజులుగా రాజకీయ చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీలు అధికార టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారానికి తగ్గట్లే శుక్రవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ పెద్ద దెబ్బ తగిలినట్లుగా చెప్పాలి. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్.. కర్రి పద్మశ్రీ.. బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు. ఇప్పటికే వీరు పార్టీ పదవికి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే.. వీరి రాజీనామాను వైసీపీ నేపథ్యం ఉన్న మండలి ఛైర్మన్ కొయ్యే మోషే రాజు ఆమోదించ లేదు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ.. మండలి సభ్యులు ముగ్గురు టీడీపీలోకి చేరటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి సేవల్ని తగిన రీతిలో ఉపయోగించుకుంటామన్న సీఎం చంద్రబాబు హామీతో ఈ ముగ్గురు సైకిల్ ఎక్కినట్లుగా చెబుతుననారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు.. వీరికి స్వయంగా పార్టీ కండువాలు కప్పారు. తాము ఆర్నెల్లుగా తమ పదవులకు రాజీనామా చేసి.. మండలి ఛైర్మన్ నిర్ణయం కోసం ఎదురుచూశామని.. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం రాని నేపథ్యంలో తాము పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు.
పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్సీల్లో ఒకరైన మర్రి రాజశేఖర్ స్పందిస్తూ.. సోమవారం నుంచి తాము మండలి సమావేశాలకు హాజరవుతామని స్పష్టం చేశారు. ఏం చేస్తారో అది చేసుకోవాలన్న వారు.. మండలి ఛైర్మన్ కు తామిచ్చిన రాజీనామాలపై తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పినా.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇదే కాదు.. గతంలోనూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను సైతం మండలి ఛైర్మన్ ఇప్పటివరకు స్పందించలేదు.
పలు వినతుల్ని మండలి ఛైర్మన్ కు అందించినా.. ఎలాంటి స్పందన లేకపోవటంతో ఆయన హైకోర్టును ఆశ్రయించటం.. ప్రస్తుతం ఈ వివాదం అక్కడ విచారణలో ఉండటం తెలిసిందే. దీంతో.. హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంట వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ చేసే తప్పే.. టీడీపీ అధినేత చంద్రబాబు చేసినట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలోనూ అధికారంలో ఉన్నప్పుడు.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకోవటం.. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొందరు వైసీపీకి వెనక్కి వెళ్లటం తెలిసిందే.
ఈ సందర్భంగా చంద్రబాబు తన తీరు మార్చుకోవాలన్న మాట వినిపించింది. దీనికి తగ్గట్లే తర్వాతి సందర్భాల్లో పార్టీమారిన వారిని.. తాము ఆహ్వానించటమని పేర్కొన్నప్పటికి తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించిన చంద్రబాబు తీరుపై స్పందిస్తూ.. ఆయనకు రాజకీయప్రయోజనాలే తప్పించి. ఇంకేమీ అక్కర్లేదంటూ కొందరు పేర్కొనటం కనిపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినంతనే అనూహ్య మార్పులు జరిగిపోవటం.. పార్టీ బలం ఒక్కసారిగా మారిపోయి.. పరిస్థితులు అధికార పక్షం కంట్రోల్ లోకి వెళ్లిపోతాయా? అంటే.. లేదనే చెప్పాలి. అలాంటప్పుడు ఈ తరహా నిర్ణయాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకోవాలి? అన్నది ప్రశ్నగా మారింది. ఏపీ శాసన మండలిలో ఉన్న పార్టీ సభ్యుల బలాల్ని చూస్తే.. మొత్తం మండలిల 56 మంది సభ్యులు ఉండాల్సి ఉంటుంది. ఇందులో వైసీపీకి 34 మంది ఉండగా.. తెలుగుదేశం పార్టీకి 10 మంది ఉన్నారు. జనసేనకు ఇద్దరు.. బీజేపీకి ఒకరు..స్వతంత్రులు ఐదుగురితో పాటు.. ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారి టీడీపీ కండువాను కప్పుకున్న పరిస్థితుల్లో ఎన్నిక అనివార్యం అవుతుందని చెప్పాలి. అదే జరిగినప్పుడు ఎమ్మెల్యేల బలం తిరుగులేనిదిగా ఉన్న కూటమికి చెందిన అభ్యర్థులే పదవుల్ని సొంతం చేసుకుంటారు. అంటే.. టీడీపీలో చేర్చినా.. చేర్చకున్నా.. వైసీపీ ఎమ్మెల్సీలకు కలిగే ప్రయోజనం తక్కువే ఉంటుంది.
అలాంటప్పుడు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వారిని చేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ.. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధుల్ని చేర్చుకోవటం ద్వారా చంద్రబాబు తప్పు చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు ఆయన అనుసరించిన రాజకీయ వ్యూహాలపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీలకు టీడీపీ గూట్లో చోటు కల్పించకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
