Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన రచయితగా 3 ఏళ్ల భార‌తీయ చిన్నారి రికార్డ్!

పసి వయసులోనే తన సృజనాత్మకతతో పుస్తకం రాసి.. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడం ద్వారా ఈ చిచ్చరపిడుగు అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాడు.

By:  Sivaji Kontham   |   10 Oct 2026 9:19 AM IST
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన రచయితగా 3 ఏళ్ల భార‌తీయ చిన్నారి రికార్డ్!
X

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భారతీయ సంతతికి చెందిన మూడేళ్ల బాలుడు అద్వయ్ జైన్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 3 సంవత్సరాల 345 రోజుల వయసులోనే పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మగ రచయితగా (యంగ్ మేల్ ఆద‌ర్) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ లో తన పేరును నమోదు చేసుకున్నాడు. పసి వయసులోనే తన సృజనాత్మకతతో పుస్తకం రాసి.. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడం ద్వారా ఈ చిచ్చరపిడుగు అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాడు.

అద్వయ్ జైన్ ప్రచురించిన ఆ పుస్తకం పేరు Dino Learns Not To Waste Food (ఆహారాన్ని వృథా చేయకూడదని డినో నేర్చుకున్న పాఠం). తను కొత్తగా చేరిన ప్రీ-స్కూల్‌లో అనేకమంది పిల్లలు తమ టిఫిన్ బాక్సుల్లోని ఆహారాన్ని తినకుండా వృథాగా పారేస్తుండటం చూసి అద్వయ్ తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. చిన్నప్పటి నుంచే ఆహారం విలువను గ్రహించిన ఈ బాలుడు ఆ ఆలోచనతోనే `డినో` అనే డైనోసార్ క్యారెక్టర్ ద్వారా ఆహారాన్ని వృథా చేయకూడదనే మంచి సందేశాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో కథగా మలిచాడు.

చిన్నతనం నుంచే గోడలపై బొమ్మలు వేస్తూ.. చిన్న చిన్న కథలు చెప్పడం అలవాటుగా ఉన్న అద్వయ్ ఆసక్తులను అతని తల్లిదండ్రులు నీరజ్ కుమార్, సోనాల్ భ‌న్సాల్‌ ఎంతగానో ప్రోత్సహించారు. కొడుకు ఆలోచనలను అణచివేయకుండా.. అతడు గీసిన డ్రాయింగ్‌లు... కథనాలను ఒక సంపూర్ణ పుస్తక రూపంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. పాండా పబ్లిషింగ్ ఏజెన్సీ ద్వారా రూపుదిద్దుకున్న ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1300 కంటే ఎక్కువ కాపీలు అమ్ముడై విశేష ఆదరణ పొందుతోంది. విశేషమేమిటంటే..అద్వయ్ అక్క ఆవ్య (12 సంవత్సరాలు) కూడా ఇదివరకే ఒక పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రి కావడం గమనార్హం.

ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన అద్వయ్ జైన్‌ను న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ్ శ్రీకాంత్ ప్రధాన్ తన కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులోనే పుస్తకం ద్వారా సమాజానికి.. ముఖ్యంగా చిన్నారులకు ఆహార వ్యర్థాలను అరికట్టడంపై అవగాహన కల్పించేలా మంచి సందేశాన్ని అందించినందుకు కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నందుకు అద్వయ్‌కు.. అతనికి మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం 4 సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టిన అద్వయ్ జైన్ ఈ విజయంతో ఆగిపోకుండా తన మొదటి పుస్తకానికి సీక్వెల్ (రెండో భాగం) రాయడంపై దృష్టి సారించాడు. తన కథలోని `డినో` క్యారెక్టర్ ద్వారా చిన్నారులు నేర్చుకోవాల్సిన మరిన్ని ముఖ్యమైన జీవిత పాఠాలను తదుపరి పుస్తకంలో వివరించడానికి సిద్ధమవుతున్నాడు. పసి ప్రాయంలోనే గిన్నిస్ రికార్డు సాధించి.. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన అద్వయ్ జైన్ సాధించిన ఈ ఘనతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.