త్రిశంకు స్వర్గంలో త్రిమూర్తులు: ఎవరు వారు ..!
ఈ మాట టిడిపిలో ఇప్పుడు తరచుగా వినిపిస్తోంది. ఆ పార్టీ తరఫున గతంలో మంచి పేరు సంపాదించుకున్న ముగ్గురు కీలక నాయకులు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారనేది నాయకులు చెబుతున్న మాట
By: Garuda Media | 16 Oct 2025 2:00 PM ISTఈ మాట టిడిపిలో ఇప్పుడు తరచుగా వినిపిస్తోంది. ఆ పార్టీ తరఫున గతంలో మంచి పేరు సంపాదించుకున్న ముగ్గురు కీలక నాయకులు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారనేది నాయకులు చెబుతున్న మాట. గత ఎన్నికల సమయంలో పార్టీ టికెట్టు త్యాగం చేసిన ఈ ముగ్గురు ఉన్నత సామాజిక వర్గానికి చెందిన నాయకులు. పైగా నియోజకవర్గంలో బలమైన కేడర్ కూడా ఉంది. దాదాపు వివాద రహితులు గానే పేరు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికలలో టికెట్టు త్యాగం చేసిన తర్వాత పార్టీ నుంచి వారికి సరైన మద్దతు లభించడం లేదనేది వాస్తవం.
పదవులు ఇస్తామని అప్పట్లో సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరడం లేదు. దీనికి కారణాలు ఏవైనప్పటికీ ప్రస్తుతం మాత్రం వారి పరిస్థితి అగమ్య గోచరంగానే మారింది. వీరిలో పిఠాపురం నుంచి టికెట్ త్యాగం చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించిన వర్మ పరిస్థితి అందరికి తెలిసిందే. ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నప్పటికీ ప్రాధాన్యం లేకుండా పోయిందన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేవని కూడా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు చంద్రబాబు కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో త్రిశంకు స్వర్గంలో వర్మ రాజకీయాలు వేలాడుతున్నాయని అంటున్నారు. ఇక, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయన కూడా గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశారు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ ఇచ్చి.. ఆయన ను గెలిపించే ప్రయత్నం కూడా చేశారు. అయితే వసంత గెలిచిన తర్వాత పార్టీలో దేవినేని ఉమా మూడో స్థానానికి పడిపోయారు.
గత ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి రాగానే కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు దేవినేని ఉమా గురించి అటు చంద్రబాబు గాని ఇటు ఇతర నాయకులు గాని ఎక్కడ ప్రస్తావించడం లేదు. దీంతో ఈయన రాజకీయాలు కూడా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయనే మాట వినిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన కొమ్మలపాటి శ్రీధర్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. 2009, 2014 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున వరుస విజయాలు దక్కించుకున్నారు.
గత ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ కోసం టికెట్ త్యాగం చేశారు. అయితే పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయిపోయిన ఇప్పటివరకు కొమ్మాలపాటి శ్రీధర్ విషయం అలానే పెండింగ్లో ఉంది. దీంతో ఈయన పరిస్థితి కూడా ఇలానే ఉంది అని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇలాంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నప్పటికీ వివాద రహితులుగా ఉన్న ఇలాంటి వారిని పార్టీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నది సీనియర్లు చెబుతున్న మాట. ఎన్ని వత్తిడిలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని పార్టీ కోసం పని చేశారని అంటున్నారు. పార్టీ తరఫున గెలిచారని.. ఇలాంటి వారిని వదులుకోకూడదనేది సీనియర్ల హితవు. మరి చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి.
