కలిసికట్టుగా కాపులు.. విజయవాడలో భారీ సభ..! ఏం జరుగుతోంది?
రాష్ట్రంలో కాపు నేతలు సంఘటితమయ్యేలా కొద్దికాలంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
By: Tupaki Political Desk | 21 July 2026 3:44 PM ISTఏపీలో రాజకీయాల పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కుల, మతాల కేంద్రంగా ఎప్పటి నుంచో రాజకీయాల జరుగుతుండగా, ప్రధానమైన కాపు నేతలు సంఘటితమవుతున్న ప్రస్తుత పరిస్థితులు ఉత్కంఠ రేపుతున్నాయి. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల మరణించగా, ఆయన సంస్మరణ సభ నిర్వహణకు రాష్ట్రంలో కాపు నేతలు ఒక్కటవుతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో ఇటువంటి సమావేశం ఒకటి జరుగగా, విజయవాడలోనూ సంస్మరణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా నేతృత్వంలోని నిర్వహించే సమావేశానికి వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరవుతానని ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది.
రాష్ట్రంలో కాపు నేతలు సంఘటితమయ్యేలా కొద్దికాలంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న కాపులలో చీలిక తెచ్చేవిధంగా విపక్షం వైసీపీ పావులు కదుపుతుండగా, తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితులు చోటుచేసుకుంటుండటం చర్చనీయాంశం అవుతోంది. కొద్దిరోజుల క్రితం వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఆయన అరెస్టు తర్వాత వైసీపీలోని కాపు నేతలు అంతా ఏకమయ్యారు. ఆ తర్వాత విజయవాడలో ఒకసారి ఇటువంటి సమావేశమే నిర్వహించారు. ఇక కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్వగ్రామమైన కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో కూడా వైసీపీ కాపు నేతల సమావేశం జరిగింది.
అయితే గతంలో నిర్వహించిన సభలు, సమావేశాలు అన్నీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించగా, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న సమావేశానికి వస్తానంటూ వైసీపీ కాపు నేత తోట త్రిమూర్తులు ప్రకటించడమే హాట్ టాపిక్ అవుతోంది. మాజీ మంత్రి ముద్రగడ సంస్మరణ సభ నిమిత్తం పార్టీలకు అతీతంగా కాపు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ కాపు నేతలు ఈ సభకు వస్తామంటూ ప్రకటించడమే కాకుండా, పార్టీ బట్టి కులం రాదని, టీడీపీ కాపులు, వైసీపీ కాపులు అంటూ ఉండరని ఆయన వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశం అవుతోంది. అదేసమయంలో ముద్రగడ నిష్ర్కమణ తర్వాత రిజర్వేషన్ల కోసం అందరం కలిసి పోరాడుతామనే సంకేతాలు ఇస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు ముద్రగడ సంస్మరణ కార్యక్రమాలతో కాపు నేతలు ఏకమయ్యేలా వ్యూహరచన జరుగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాజికవర్గ కార్యక్రమాల విషయంలో పార్టీలకు సంబంధం లేకపోయినా, ఈ వంకతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో పట్టుబిగించాలనే ఆలోచన కూడా తెరవెనుక ఉండొచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ మరణించిన తర్వాత రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ఎవరు తీసుకుంటారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి కులం కోసం నాయకత్వం తీసుకునేలా ఎమ్మెల్సీ త్రిమూర్తులు చొరవ చూపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం అన్నిపార్టీలతో కలిసి పోరాడతామని ఆయన చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ముద్రగడ స్థానంలో కాపు ఉద్యమాన్ని చేపట్టేందుకు త్రిమూర్తులు సిద్ధమవుతున్నారా? అనే సందేహాలకు తెరలేస్తోందని అంటున్నారు. మొత్తానికి ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే కాపు రిజర్వేషన్ల ఉద్యమం 2.0 మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
