తిరుపరంకుండ్రం వివాదం : ఒకే కొండ.. రెండు విశ్వాసాలు.. ఓ కార్తీక దీపం వెనుక దాగిన అసలు కథ
తమిళనాడులోని మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం వివాదంగా మారింది. దర్గాకు సమీపంలోని రాతి స్తంభం తమ సంప్రదాయ దీపస్తంభమని హిందూ సంఘాలు వాదిస్తుండగా, అది బ్రిటిష్ కాలం నాటి సర్వే గుర్తు అని ప్రభుత్వం చెబుతోంది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ అప్పీళ్ల నేపథ్యంలో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. భక్తి విశ్వాసాలు, శాంతిభద్రతల మధ్య వివాదం కొనసాగుతోంది.
By: A.N.Kumar | 24 Nov 2026 4:30 PM ISTతమిళనాడులోని మదురై గడ్డపై నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆ కొండకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఒకవైపు భక్తుల 'హరోంహర' నామస్మరణతో మార్మోగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం.. మరోవైపు శాంతి సందేశాన్ని వినిపించే సికిందర్ బాదుషా దర్గా.. తరతరాలుగా భిన్న మతాల విశ్వాసాలకు నిలయంగా.. సామరస్యానికి ప్రతీకగా నిలిచిన తిరుపరంకుండ్రం కొండ నేడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు.. ఉద్వేగభరితమైన వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అసలు ప్రశాంతంగా ఉండే ఆ కొండపై ఇంతటి రచ్చ ఎందుకు మొదలైంది? ఒక చిన్న కార్తీక దీపం చుట్టూ ఇంతటి న్యాయపోరాటం ఎందుకు జరుగుతోంది?
ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి వచ్చిందంటే చాలు.. ఆ కొండపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. సాధారణంగా అక్కడి ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద మహాదీపం వెలిగించడం ఆనవాయితీ. కానీ అసలు చిక్కంతా కొండ శిఖరాన దర్గాకు సమీపంలో ఉన్న ఒక పురాతన రాతి స్తంభం దగ్గరే మొదలైంది. ఆ రాతి స్తంభం తమ పూర్వీకులు ఏర్పాటు చేసిన పవిత్ర 'దీపస్తంభం' అని.. అక్కడ కార్తీక దీపం వెలిగించడం తమ తరతరాల హక్కు, సంప్రదాయమని హిందూ సంఘాలు, భక్తులు బలంగా వాదిస్తున్నారు. తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలని వారు తపిస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తోంది. అది దీపస్తంభం కాదని.. బ్రిటిష్ పాలన కాలంలో భౌగోళిక కొలతల కోసం ఏర్పాటు చేసిన 'గ్రేట్ ట్రిగోనోమెట్రికల్ సర్వే' గుర్తు అని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా దర్గాకు అతి సమీపంలో దీపం వెలిగించడం వల్ల అనవసరమైన మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది కొండపై మాంసాహారం తిన్నారనే ఆరోపణలు రావడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. కొండపైకి భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో తమ సంప్రదాయ హక్కుల కోసం భక్తులు న్యాయపోరాటానికి దిగారు.
దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు మద్రాస్ హైకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో భక్తుల్లో ఆశలు చిగురించాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు.. ప్రభుత్వ అప్పీళ్లతో ఈ వ్యవహారం ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. పరిస్థితి తీవ్రతను గమనించిన సుప్రీంకోర్టు.. కార్తీక పౌర్ణమి నాడు కేవలం ఒక్కసారి మాత్రమే.. కఠినమైన షరతుల మధ్య దీపం వెలిగించేందుకు మధ్యంతర అనుమతి ఇచ్చింది. సాధారణ భక్తులు.. రాజకీయ నాయకులు లేకుండా కేవలం ఆలయ, ప్రభుత్వ అధికారులు మాత్రమే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపైనా తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం మరింత ఉత్కంఠను రేపుతోంది.
నేడు తిరుపరంకుండ్రం కొండపై జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఒక దీపం వెలిగించడమా లేదా అనే చిన్న అంశం కాదు. ఇదొక భావోద్వేగపూరితమైన సంక్లిష్ట సమస్య. ఒకవైపు తరతరాల మత విశ్వాసాలు.. ఆచారాలను కాపాడుకోవాలనే భక్తుల ఆరాటం.. మరోవైపు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ప్రభుత్వ బాధ్యత..
ఆ రాతి స్తంభం అసలు చరిత్ర ఏమిటి? భక్తికి, చట్టానికి మధ్య న్యాయస్థానాలు ఎలాంటి సమతుల్యతను చూపిస్తాయి? కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ కొండపై వెలిగే దీపం మనుషుల మధ్య చిచ్చు పెట్టకుండా.. శాంతి కాంతులను విరజిమ్మాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
