ప్రాణస్నేహాన్ని తుంచే 'నారద' మనస్తత్వం తో తస్మాత్ జాగ్రత్త!
ఎంతటి బలమైన స్నేహమైనా సరే? మూడో వ్యక్తి తెచ్చే పుకార్లు , విషపూరితమైన మాటలను విమర్శనాత్మకంగా ఆలోచించకుండా నమ్మినప్పుడు బంధాలు బలహీనపడతాయి.
By: Srikanth Kontham | 29 Sept 2026 3:31 PM ISTజీవితంలో నమ్మకమైన ప్రాణస్నేహితులు దొరకడం గొప్ప వరమైతే.. ఆ బంధాన్ని కాపాడుకోవడం అంతకంటే పెద్ద సవాలు. ఎంతటి గాఢమైన స్నేహంలోనైనా ? కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు, పొరపొచ్చాలతో దూరం పెరగడానికి ప్రధాన కారణం మూడో వ్యక్తి ప్రమేయమే అన్నది కాదనలేని నిజం. సమాజంలో స్నేహితుల మధ్య అసూయతో లేదా వారి ఆనందం చూసి ఓర్వలేక మాటలు మోస్తూ అగ్నికి ఆజ్యం పోసే నారద మనస్తత్వం కలిగిన వ్యక్తుల వల్ల ఎన్నో ప్రాణస్నేహాలు ముక్కలవుతున్నాయనడానికి చాలా ఉదాహరణలున్నాయి.
`నారద మనస్తత్వం` అనగానే ఇద్దరి మధ్య నిప్పు రాజేసి తమాషా చూసే ధోరణి. పైకి ఎంతో ఆత్మీయంగా, మేలు కోరేవారిలా నటిస్తూనే లోపల మాత్రం అసూయా ద్వేషాలను పెంచుకునే వ్యక్తులు వీరిలో ఉంటారు. ఒకరి దగ్గర ఇంకొకరి గురించి తప్పుడు కామెంట్లు చేయడం, లేనిపోని మాటలు కల్పించి చెప్పడం, చిన్నపాటి అసంతృప్తిని కొండంత చేసి చూపించడం వీరి ప్రధాన లక్షణం. ఇద్దరి మధ్య సఖ్యత సడలితే తప్ప తమ మనసుకు శాంతి లభించదనే కుటిల ఆలోచనతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు.
ఎంతటి బలమైన స్నేహమైనా సరే? మూడో వ్యక్తి తెచ్చే పుకార్లు , విషపూరితమైన మాటలను విమర్శనాత్మకంగా ఆలోచించకుండా నమ్మినప్పుడు బంధాలు బలహీనపడతాయి. `నీ స్నేహితుడు నీ గురించి వెనకాల ఇలా అన్నా డు? నీ ఎదుగుదల చూసి అతనికి అసూయగా ఉంది అంటూ మైండ్ గేమ్‌లు ఆడే వ్యక్తుల బుట్టలో పడితే ఎంతటి ఆప్తమిత్రులైనా ఒకరినొకరు అనుమానించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది క్రమంగా పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసి, చివరకు శాశ్వత విఘాతానికి దారితీస్తుంది.
ఇలాంటి నారద మనస్తత్వం కలిగిన వారి ఉచ్చులో పడకుండా ఉండాలంటే స్నేహితుల మధ్య ప్రత్యక్ష సంభాషణ అత్యంత ముఖ్యం. మూడో వ్యక్తి వచ్చి మన మిత్రుడి గురించి ఏదైనా చెప్పినప్పుడు దానిని గుడ్డిగా నమ్మకుండా నేరుగా స్నేహితుడితోనే కూర్చుని మాట్లాడి స్పష్టత తెచ్చుకోవాలి. `నా స్నేహితుడిపై నాకు ఉన్న నమ్మకం కంటే? మూడో వ్యక్తి మాటలకు విలువ ఇవ్వకూడదు` అనే విచక్షణ ప్రదర్శించినప్పుడే ఏ శక్తీ ఆ బంధాన్ని విడదీయ లేదన్నది అంతే నిజం .
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే? మన చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాన్ని గ్రహించి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం. ఎవరైతే ఇతరుల బలహీనతలను, రహస్యాలను మన దగ్గరకు మోసుకొస్తారో? వారు రేపు మన మాటలను కూడా వేరొకరి దగ్గర తప్పుగా ప్రచారం చేస్తారని గ్రహించాలి. అలాంటి విషపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండటం.. వారి మాటలకు మనస్సులో చోటు ఇవ్వకపోవడమే అత్యుత్తమ పరిష్కారం.
నిజమైన స్నేహం అనేది కష్ట సుఖాల్లో తోడుగా నిలబడేదే తప్ప మూడో వ్యక్తి ఊహాగానాలకు బలియ్యేంత బలహీనమైనది కాకూడదు. పొరపాట్లు, అభిప్రాయ భేదాలు వస్తే ఇద్దరి మధ్యే చర్చించుకుని పరిష్కరించుకోవాలి తప్ప నారద మనస్తత్వం కలిగిన వారి మాటలు విని ఆత్మీయులను దూరం చేసుకోకూడదు. `నమ్మకమే స్నేహానికి అసలైన పునాది` అని గ్రహించి అవాస్తవ ప్రచారాలకు తావివ్వకుండా ఉన్నప్పుడే ఆ స్నేహ బంధం కలకాలం పదిలంగా ఉంటుంది.
