Begin typing your search above and press return to search.

మాజీ సీఎం ఇంటి వద్ద చెలరేగుతున్న దొంగలు..పోలీసులు ఏం చేస్తున్నట్లు?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.

By:  Garuda Media   |   20 Jan 2026 10:35 AM IST
మాజీ సీఎం ఇంటి వద్ద చెలరేగుతున్న దొంగలు..పోలీసులు ఏం చేస్తున్నట్లు?
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అది కూడా చిన్నాచితకా వస్తువులు కావు. కంటి ముందు కనిపిస్తున్న ఐరన్ గ్రిల్స్ మొదలు.. పుట్ పాత్ లైట్లను దోచేస్తున్నా పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్న వైనం చూస్తే.. దొంగల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటమా? అన్నది ప్రశ్నగా మారింది. మాజీ సీఎం జగన్ నివాసం వద్ద భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అమరావతి పరిధిలోని తాడేపల్లిలోని భరతమాత సెంటర్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదుగా ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న రోడ్డును గతంలో మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో నిర్మించారు. ఈ రోడ్డు ఫుట్ పాత్ వెంట లైట్లను ఏర్పాటు చేశారు. ఈ లైట్ల భద్రత కోసం ఐరన్ గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు. గడిచిన కొద్దిరోజులుగా దొంగలు చెలరేగిపోతున్నారు.

గ్రిల్స్ తో సహా లైట్లను వచ్చినంతగా కట్ చేసి తీసుకెళ్లిపోతున్న వైనం షాక్ కు గురి చేస్తోంది. దొంగల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ తీగలు పుట్ పాత్ మీద వదిలేయటంతో ప్రమాదకరంగా వేలాడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొరపాటున విద్యుత్ సరఫరా అయితే ఫుట్ పాత్ మీద నడిచే వారితో పాటు.. సాయంత్రం వేళలో వాకింగ్ చేసే వారికి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ఓవైపు అమరావతిని అలా చేస్తున్నా.. ఇలా చేస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు అదే అమరావతిలోని ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను దొంగలిస్తున్నా పట్టనట్లుగా వ్యవహరించటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఇప్పటికైనా స్పందించాలన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.