Begin typing your search above and press return to search.

తుపానులో ‘ప్రశాంతత’.. అంతకుముందు.. ఆ తర్వాతే...

తుపాను ముందు ప్రశాంతత అంటుంటారు. కానీ, తుపానులోనే ప్రశాంతత ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   28 Oct 2025 11:49 AM IST
తుపానులో ‘ప్రశాంతత’.. అంతకుముందు.. ఆ తర్వాతే...
X

తుపాను ముందు ప్రశాంతత అంటుంటారు. కానీ, తుపానులోనే ప్రశాంతత ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శక్తివంతమైన తుపాను కేంద్రంలో ఉండే ప్రాంతాన్ని కన్ను (ఐ) అంటారు. ఈ ప్రాంతంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి నెమ్మదిగా వీస్తుంది. అసలు ఉండకపోవచ్చు. వర్షం కూడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, తుపాను కన్ను చుట్టూ ఉండే వలయంతోనే పెద్ద విలయం సంభవిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నాటి నుంచి అది తుపాను, తీవ్ర తుపానుగా మారి తీరం దాటే వరకు ఎన్నో దశలు ఉంటాయి. కొన్ని అల్పపీడనం దశలోనే, మరికొన్ని వాయుగుండాలకు పరిమితమవుతాయి. కొన్ని బలపడి తుపాను, తీవ్ర తుపానుగా తీరం దాటి నేలపైకి వస్తాయి. తుపాను గమనంలో కీలకం కేంద్ర స్థానమే. తుపాను తీవ్రతకు అనుగుణంగా దీని విస్తృతి పెరుగుతుంది. శక్తివంతమైన తుపాను కేంద్రంలో ఉండే ప్రాంతం ‘ఐ’, దీని చుట్టూ ఉండే వలయాకారాన్ని ఐ వాల్స్ గా చెబుతారు. అయితే ఐ కన్నా ఐ వాల్స్ ఉండే ప్రాంతంలో అధిక వేగతంతో గాలులు వీస్తాయట. భారీ, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, మేఘాలు అననీ కన్ను చుట్టూ ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు.

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సుడిగుండాలతో అల్పపీడనం ఏర్పడుతోంది. తర్వాత వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తుపాను బలపడిన తర్వాత కేంద్ర స్థానం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కన్ను అంటారు. తీవ్ర తుపాను అయితే ఈ కన్ను ప్రాంతం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర స్థానం విస్తృతి 10 నుంచి 20 కి.మీ వరకు ఉండొచ్చు. తర్వాత కంటి గోడల విస్తృతి అంటే తుపాను కేంద్ర స్థానం నుంచి 225 కి.మీ వరకు ఉండే అవకాశం ఉంది.

ఇక తుపాను ఫలానా చోట తీరం దాటిందని వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. కానీ, అక్కడ ఎలాంటి గాి, వాన ఉండదు. దీనికి కారణం తీరం దాటే సమయంలో ఐ ప్రాంతమే అంటున్నారు. అందుకే సముద్రం ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో తీరం దాటిందా? అని అక్కడున్న వారు కూడా ఆశ్చర్యపోతారట. తుపాను కేంద్ర స్థానంలో ఎలాంటి అలజడి ఉండకపోవడమే ఈ ప్రశాంతతకు కారణంగా చెబుతున్నారు. అయితే కేంద్ర స్థానం తర్వాత నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అలజడి అధికంగా ఉంటుంది. అందుకే తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ భారీ వర్షాలు, గాలులు వీస్తాయని అంటున్నారు.

శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం తీరం తాకినప్పుడు ప్రభావం ఏమీ ఉండదు. తర్వాత కొద్దిసేపటికి మళ్లీ విలయం మొదలు అవుతుంది. తీరం దాటినప్పుడు ఏ ప్రభావం లేదని అలసత్వం వహిస్తే తర్వాత భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. 1979 మే నెలలో ఏపీలో తీరం తాకిన తుపాన కంటి విస్తృతి 425 కి.మీ. అంటే కేంద్ర స్థానం నుంచి 425 కి.మీ. పరిధిలో పెద్ద ప్రభావం చూపింది. భారత తీరంలో ఇదే రికార్డు. ఇక 2014లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను విస్తృతి కేవలం 44-66 కి.మీ. మాత్రమే.