కేసుల మీద కేసులతో డైరెక్టర్ ఉక్కిరి బిక్కిరి
ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రధారి అయిన గోపాల్ ముఖర్జీ మనవడు శంతను ముఖర్జీ అగ్నిహోత్రిపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసాడు.
By: Sivaji Kontham | 19 Aug 2025 2:00 AM ISTఒరిజినల్ కథలు ఎప్పుడూ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి పుట్టుకొస్తాయి. అలాంటి కథల్ని ఎంచుకుని సినిమాలు తెరకెక్కిస్తే సినిమా హిస్టరీలో నిలిచిపోయేందుకు ఆస్కారం ఉంది. అలాంటి తెలివైన పనికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు వివేక్ అగ్నిహోత్రి. ఆర్టిఫిషియల్ కమర్షియల్ కథల్ని రాయడానికి ఎప్పుడూ ఆసక్తి కనబరచని అగ్నిహోత్రి కశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ సహా తన చిత్రాలన్నిటికీ ఇదే పంథాను అనుసరించాడు.
ఇప్పుడు అగ్నిహోత్రి తెరకెక్కించిన `ది బెంగాల్ ఫైల్స్` కూడా చాలా వివాదాలను మోసుకొచ్చింది. రకరకాల వివాదాల కారణంగా ఈ సినిమా రిలీజ్ అంతకంతకు వాయిదా పడుతూనే ఉంది. సెన్నార్ గడప వద్ద క్లియరెన్స్ కి ఆస్కారం లేని పరిస్థితి ఉందిప్పుడు. తనపైనా, తన సినిమా రిలీజ్ పైనా బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇంతకుముందు అగ్నిహోత్రి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో అతడిపై ఇప్పటికే డజను పైగానే కేసులు ఫైల్ అయ్యాయి. చాలావరకూ ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు కావడంతో అతడు ఇటీవల అమెరికాలో ప్రచారం పేరుతో బిజీ అయ్యాడు.
ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రధారి అయిన గోపాల్ ముఖర్జీ మనవడు శంతను ముఖర్జీ అగ్నిహోత్రిపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసాడు. తన తాతగారిని కించపరుస్తూ అతడి పాత్రను కసాయిగా, పాఠా(మేక)గా అభివర్ణించాడనేది ప్రధాన ఆరోపణ. మా తాత కసాయి అని వీళ్లు ఎలా నిర్ణయిస్తారు. ఆయనపై అగ్నిహోత్రి మరింత లోతుగా పరిశోధించాల్సింది. కనీసం మమ్మల్ని సంప్రదించనయినా సంప్రదించలేదు. తాతయ్య మల్లయోధుడు.. అనుశీలన్ సమితి సభ్యుడు కూడా... అని అతడు వెల్లడించాడు.
1946 ఆగస్టులో ముస్లింలీగ్ ప్రారంభించిన ఒక ఉద్యమం కారణంగా వేలాది మంది హిందువులు బలయ్యారు. నాటి సంఘటనలపై అగ్నిహోత్రి `ది బెంగాల్ ఫైల్స్` సినిమాని రూపొందిస్తున్నారు. అప్పట్లో హిందువులపై దురాగతాల్ని నిలువరించడానికి ఎదురు తిరిగిన యోధుడిగా గోపాల్ ముఖర్జీకి గొప్ప పేరు వచ్చింది. అందుకే తన తాత గారి పాత్రను కసాయిగా చూపిస్తూ, ట్రైలర్ లో, సినిమాలో తప్పుడు సమాచారం అందిస్తున్నారని శంతను ముఖర్జీ ఆరోపిస్తున్నారు. ఇది తన కుటుంబానికి సమాజానికి బాధ కలిగించిందని అగ్నిహోత్రి బహిరంగంగా తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని శంతను డిమాండ్ చేస్తున్నారు.
