Begin typing your search above and press return to search.

రూ.5 ఎరవేసి ల‌క్ష‌లు కొట్టేసారు: ఈ సైబ‌ర్ మోసం గురించి తెలుసుకుంటే ఎవ‌రైనా అవాక్క‌వుతారు!

మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌కు చెందిన 51 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ. 8.18 లక్షలు పోగొట్టుకున్నారు.

By:  Sivaji Kontham   |   6 Aug 2026 1:00 AM IST
రూ.5 ఎరవేసి ల‌క్ష‌లు కొట్టేసారు: ఈ సైబ‌ర్ మోసం గురించి తెలుసుకుంటే ఎవ‌రైనా అవాక్క‌వుతారు!
X

మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌కు చెందిన 51 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ. 8.18 లక్షలు పోగొట్టుకున్నారు. వైద్యుడి అపాయింట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్న క్రమంలో ఎదురైన ఒక చిన్న సైబర్ ఉచ్చు ఆమె జీవితాంతం దాచుకున్న సొమ్మును ఖాళీ చేసింది. కేవలం ఐదు రూపాయల టోకెన్ అమౌంట్ చెల్లించబోయి ఇంతటి భారీ మొత్తాన్ని నష్టపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఒక వైద్యుడి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో శోధించారు. ఈ క్రమంలో సైబర్ క్రిమినల్స్ రూపొందించిన నకిలీ వెబ్‌సైట్ లేదా నంబర్‌ను నిజమైనదిగా భావించి సంప్రదించారు. అవతలి వ్యక్తులు డాక్టర్ అపాయింట్‌మెంట్ కన్ఫర్మ్ కావాలంటే యూపీఐ ద్వారా రూ. 5 మాత్రమే టోకెన్ రుసుముగా చెల్లించాలని నమ్మబలికారు. సదరు మహిళ కూడా దాన్ని నిజమేనని నమ్మి వారు పంపిన లింక్ లేదా సూచనల ఆధారంగా రూ. 5 లావాదేవీని పూర్తి చేశారు.

అయితే ఆ ఐదు రూపాయల చెల్లింపు ప్రక్రియలోనే సైబర్ నేరగాళ్లు స్కామింగ్ పద్ధతులను ఉపయోగించారు. మహిళ యూపీఐ లేదా బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ సమాచారాన్ని చాకచక్యంగా హ్యాక్ చేశారు. చెల్లింపు పూర్తయిన కొద్దిసేపటికే ఆమె బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా మొత్తంగా రూ. 8.18 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బాధితురాలు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆ మోసాన్ని గ్రహించిన బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. స‌ద‌రు మ‌హిళ‌ ఇచ్చిన వివరాల ఆధారంగా థానే సైబర్ క్రైమ్ పోలీసులు అపరిచిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసగాళ్లు ఉపయోగించిన ఫోన్ నంబర్లు, బ్యాంకింగ్ ఐడీలు , యూపీఐ లావాదేవీల ఆధారంగా నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనతో ఆన్‌లైన్ సేవలు వినియోగించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ సెర్చ్ ఇంజన్లలో కనిపించే డాక్టర్ల లేదా ఆసుపత్రుల కాంటాక్ట్ నంబర్లను గుడ్డిగా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం, గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం లేదా వ్యక్తిగత ఆన్‌లైన్ చెల్లింపుల వివరాలను అపరిచితులతో పంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.