వివాదాల వలయంలో తమ్మినేని.. కుటుంబంపై కేసులు రాజకీయాలను కుదిపేస్తున్నాయా?
వాస్తానికి తమ్మినేని ఫ్యామిలీ.. 30 ఏళ్లకుపైగానే రాజకీయాల్లో ఉంది. అనేక పదువులు కూడా ఆయన అలం కరించారు.
By: Garuda Media | 28 July 2026 6:00 PM ISTఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తీవ్ర కష్టాల్లో కూరుకుపోయారు. భూముల కబ్జా ఆరోపణలు కుటుంబాన్ని వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. ఒక కేసు అయితే ఏదో అనుకోవచ్చు. కానీ, వరుస పెట్టి తమ్మినేని ఫ్యామిలీపై ముఖ్యంగా ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌పై వచ్చిన ఆరోపణలు సీరియస్‌గా ఉండడంతో కేసులు ఎదుర్కొనకతప్పని పరిస్థితి ఏర్పడింది.
వాస్తానికి తమ్మినేని ఫ్యామిలీ.. 30 ఏళ్లకుపైగానే రాజకీయాల్లో ఉంది. అనేక పదువులు కూడా ఆయన అలం కరించారు. అయితే.. అప్పట్లో లేని విమర్శలు.. ఇప్పుడు రావడం.. ఏకంగా కేసులకు భయపడి కుటుం బం అజ్ఞాతంలోకి జారుకోవడం వంటివి రాజకీయంగా తమ్మినేని ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నిజానికి ఉత్తరాంధ్రలో ఉన్న సీనియర్ నాయకులలో తమ్మినేని ఒకరు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం నుంచి పలు మార్లు ఆయన విజయం దక్కించుకున్నారు.
అంతేకాదు.. ఉత్తరాంధ్ర సమస్యలపై ఆయన అనేక సందర్భాల్లో సభలు, సమావేశాలు కూడా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నసమయంలో ఉత్తరాంధ్ర సమస్యలపై.. ఆయన దీక్షకు దిగి సంచలనం సృష్టించారు. ఇలా.. ఒక్కొక్క మెట్టు ఎదిగిన తమ్మినేని.. వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. కానీ, ఈ రేంజ్‌లో ఎప్పుడూ ఆయన ఆరోపణలు ఎదుర్కొనలేదు. ఆయనపై విమర్శలు లేవా? వివాదాలు లేవా? అంటే ఉన్నాయి. కానీ, భూముల కబ్జా ఆరోపణలు రావడం ఇదే తొలిసారి.
కీలక వివాదాలు ఇవీ..
తమ్మినేనిపై ఉన్న కీలక వివాదాల విషయానికి వస్తే.. ఆయన నకిలీ సర్టిఫికెట్‌తో పీహెచ్‌డీ చేశారన్న ఆరోపణ ఉంది. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. అయితే.. దానిని కూటమి సర్కారు వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. ఇక, నోరు అదుపులో పెట్టుకోని నాయకుడిగా కూడా ఆయన బ్యాడయ్యారు. అధికారులను బెదిరించడం.. నేరుగా వారిపై దూషణలకు దిగడం వంటివి అనేక సందర్భాల్లో ఆయనకు మచ్చగా మారాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు కుమారుడిపైనా, ఆయన సతీమణిపైనా భూకబ్జా ఆరోపణలు రావడంతో ఇది రాజకీయంగా తమ్మినేని ఫ్యామిలీకి పెద్ద ఎఫక్టేనని అంటున్నారు.
