Begin typing your search above and press return to search.

తంబ‌ళ్లప‌ల్లి త‌మ్ముళ్ల‌లో జోష్‌.. !

అన్నమయ్య జిల్లాలోని కీల‌క‌మైన‌ తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత‌ల రాజకీయాలు పుంజుకున్నాయి.

By:  Garuda Media   |   20 Sept 2026 6:00 AM IST
తంబ‌ళ్లప‌ల్లి త‌మ్ముళ్ల‌లో జోష్‌.. !
X

అన్నమయ్య జిల్లాలోని కీల‌క‌మైన‌ తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత‌ల రాజకీయాలు పుంజుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసుకుంటున్నారు. అంతేకాదు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయడంపై నాయ‌కులు దృష్టి పెట్టారు. వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీకి.. ముఖ్యంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కంచుకోట‌. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వరుస విజ‌యాలు ద‌క్కించుకుంది.

ద్వార‌కానాథ్‌రెడ్డి పెద్దిరెడ్డి ఇక్క‌డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఈ రెండు ఓటముల తర్వాత నియో జకవర్గంలో పట్టు సాధించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గ‌మ‌నిస్తే.. టీడీపీ నియోజ‌క‌వ‌ర్గం కొత్త ఇన్‌ఛార్జ్‌గా శంకర్ యాదవ్ నియ‌మితుల‌య్యారు. గ‌త ఏడాది న‌కిలీ లిక్క‌ర్ కేసు వెలుగు చూడ‌డం.. ఇంచార్జిని త‌ప్పించ‌డంతో కొన్నాళ్లుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి ఖాళీగా ఉంది. దీంతో ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ యాదవ్‌ను తంబళ్లపల్లె నియోజకవర్గ కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

ఈయన గతంలో 2014లో ఇక్కడి నుండి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియామకంతో స్థానిక శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే.. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. జయచంద్రారెడ్డి సస్పెన్షన్ త‌ర్వాత‌.. ఈ వివాదాలు మ‌రింత పెరిగాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన దాసరిపాళెం జయచంద్రారెడ్డి న‌కిలీ లిక్క‌ర్ కేసులో చిక్కుకోవడంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. జయచంద్రారెడ్డి సస్పెన్షన్ తర్వాత, ఆయన అనుచరులు.. జ‌య‌చంద్రారెడ్డి భార్య కల్పనకు పదవి ఇవ్వాలని కోరారు.

అదే స‌మ‌యంలో శంకర్ యాదవ్ నియామ‌కానికి కూడా వ్య‌తిరేకంగా కొంద‌రు గ‌ళం వినిపించారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు స‌ర్దుమ‌ణిగాయి. పార్టీలోని అన్ని వర్గాలను, అసంతృప్త నేతలను ఒకతాటిపైకి తీసుకురావడమే ల‌క్ష్యంగా ప్ర‌స్తుతం యాద‌వ్ ప‌నిచేస్త‌సున్నారు. వైసీపీ ఇక్కడ బలంగా ఉండటం, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, గ్రూపు తగాదాలను పక్కనబెట్టి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం తంబళ్లపల్లె టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. శంక‌ర్ యాద‌వ్ అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉన్నా.. వాటిని ప‌రిష్క‌రించుకునేందుకు తాన స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నారు. దీంతో స్థానికంగా టీడీపీ జోష్ క‌నిపిస్తోంది.