పొత్తులపై సంచలన ప్రకటన చేసిన విజయ్
తమిళనాడులో మోజు క్రేజూ ఉన్న పార్టీగా దళపతి తమిళ సూపర్ స్టార్ విజయ్ నాయకత్వంలోని పార్టీ తమిళగ వెట్రి కజగం టీవీకేని అంతా చూస్తున్నారు.
By: Satya P | 26 Jan 2026 9:34 AM ISTతమిళనాడులో మోజు క్రేజూ ఉన్న పార్టీగా దళపతి తమిళ సూపర్ స్టార్ విజయ్ నాయకత్వంలోని పార్టీ తమిళగ వెట్రి కజగం టీవీకేని అంతా చూస్తున్నారు. విజయ్ సినిమాలకు సూపర్ రియాక్షన్ జనంలో ఉంటుంది. అయిదు పదులు దాటిన ఈ హీరోకు ఇంకా ఎంతో సినీ కెరీర్ ఉండగానే రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా 2021లో పుట్టిన ఆలోచన అయిదేళ్ళ పాటు ప్రణాళికబద్ధంగా అమలు చేసుకుంటూ పార్టీని జనంలో ఉంచారు. ఇక మరి కొద్ది నెలలలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ రేసు గుర్రంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.
సోలోగానే ఫైట్ :
ఈ నేపధ్యంలో తాజాగా మహాబలిపురంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే పోటీ మీద కూడా పొత్తుల మీద స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేవని తేల్చేశారు. మొత్తం 234 సీట్లకు గానూ టీవీకే పార్టీ పోటీ చేస్తుందని కుండ బద్ధలు కొట్టారు. టీవీకేకి ఎవరితోనూ పొత్తు ఉండదని, సొంతంగానే ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని విజయ్ ధీమాను వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని పాలించేది :
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేని ఓడించేది రాష్ట్రాన్ని పాలించేది టీవీకే మాత్రమే అని ఆయన స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో ఒక దుష్ట శక్తిగా డీఎంకే ఉందని అలాగే అవినీతి శక్తిగా అన్నా డీఎంకే ఉందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఈ రెండు పార్టీలను బలంగా ఎదుర్కొంటామని ఒంటరిగా నిలబడి గెలుపు గుర్రం ఎక్కుదామని ఆయన చెప్పుకొచ్చారు. రెండు ప్రధానమైన ద్రవిడ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని అందులో ఒకటి బీజేపీతో నేరుగా పొత్తులో ఉందని మరొకటి ఇండైరెక్ట్ గా సరెండర్ అయింది అని విజయ్ విమర్శలు గుప్పించారు.
ప్రజలలో నమ్మకం :
కొత్త పార్టీ అయినా టీవీకే మీద ప్రజలలో నమ్మకం ఉందని విజయ్ ధీమాగా చెప్పారు. తమిళ ప్రజలను రక్షించడానికి తమిళ మట్టిని కాపాడడానికే తమ పార్టీ ఉందని ఆయన చెప్పారు. మొత్తానికి ఎవరితో పొత్తు లేదని విజయ్ క్లారిటీ ఇవ్వడమే కాకుండా గెలిచేది తమ పార్టీయే అని అటు పార్టీ వారికి మరో వైపు తమిళనాడు రాజకీయ ప్రత్యర్ధులకు సంకేతాలు ఇచ్చారు. విజయ్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని ఒక వైపు ప్రచారం సాగింది, మరో వైపు చూస్తే బీజేపీ కూడా పొత్తునకు ప్రయత్నం చేస్తోంది అని కూడా చెప్పుకున్నారు. కానీ సోలోగా బరిలోకి దిగి విక్టరీ కొడతామని విజయ్ చెప్పడం బట్టి చూస్తూంటే తమిళనాడులో పొలిటికల్ హీట్ ఈసారి పీక్స్ లో ఉండే చాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి తమిళనాడు ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారో.
