Begin typing your search above and press return to search.

తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ సాహసం.. రోడ్డు పై సైకిల్ తో ఏం చేశారంటే..?

ఒక అగ్ర నటుడిగా కోట్లాది మంది అభిమానులు ఉన్న విజయ్, రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టిన వేళ ఆయన చేస్తున్న సాహసాలపై చర్చ మొదలైంది.

By:  Tupaki Political Desk   |   13 April 2026 10:20 AM IST
తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ సాహసం.. రోడ్డు పై సైకిల్ తో ఏం చేశారంటే..?
X

ఒక అగ్ర నటుడిగా కోట్లాది మంది అభిమానులు ఉన్న విజయ్, రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టిన వేళ ఆయన చేస్తున్న సాహసాలపై చర్చ మొదలైంది. ప్రచారంలో జోష్ నింపడం ఒక ఎత్తు అయితే, భద్రతను పణంగా పెట్టడం మరొకటి. పెరంబూర్, తిరుచ్చి వంటి కీలక నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఆయన తప్పన పడుతున్నారు.

విజయ్ విన్యాసాలు..

తమిళ రాజకీయాల్లో సినిమా గ్లామర్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘తమిళ వెట్రి కజగం’ (TVK) పార్టీ స్థాపించి, ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల బరిలో నిలిచిన తలపతి విజయ్.. తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, హైవేపై అకస్మాత్తుగా సైకిల్ రైడ్ చేయడం ద్వారా ఆయన చేసిన సాహసం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. భద్రతా వలయాన్ని దాటి ఆయన అలా రోడ్డుపైకి రావడం ట్రాఫిక్ ఇబ్బందులకే కాకుండా, భారీ తొక్కిసలాటకు కూడా దారితీసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘటన..

ఒక స్టార్ హీరో ప్రజల్లోకి వచ్చినప్పుడు అతన్ని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివస్తారు. గతంలో కరూర్ తొక్కిసలాట వంటి చేదు అనుభవాలు ఉన్నప్పటికీ, విజయ్ మళ్లీ ఇలాంటి సాహసం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా అధికారులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా, బిజీగా ఉన్న హైవేపై సైకిల్ తొక్కడం బాధ్యతారాహిత్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది అభిమానులను ఉత్సాహపరిచినా, ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నెటిజన్లు ఎత్తి చూపారు.

రెండు నియోజకవర్గాల్లో పోటీ..

విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పెరంబూర్, తిరుచిరాపల్లి (తిరుచ్చి) తూర్పు నియోజకవర్గాలను ఎంచుకున్నారు. అయితే ఈ రెండు స్థానాల్లో ఆయన గెలుపుపై భిన్నమైన అంచనాలు ఉన్నాయి..

పెరంబూర్ ను పరిశీలిస్తే.. ఇక్కడ రాజకీయ సమీకరణాలు విజయ్‌కు అంత అనుకూలంగా లేవని ప్రీ-పోల్ సర్వేలు చెబుతున్నాయి. బలమైన స్థానిక అభ్యర్థులు, పటిష్టమైన పార్టీ నెట్‌వర్క్ ఉన్న ప్రత్యర్థులను ఢీకొనడం విజయ్‌కు సవాలుగా మారబోతోంది. ఇక్కడ ఆయన ఓటమి చెందవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తిరుచ్చి తూర్పు నుంచి.. పెరంబూర్ తో పోలిస్తే తిరుచ్చిలో విజయ్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. సినీ గ్లామర్‌తో పాటు యువతలో ఉన్న క్రేజ్ ఇక్కడ ఆయనకు కలిసి వచ్చేలా ఉంది. ఒకవేళ ఎన్నికల ఫలితాలు వస్తే, తిరుచ్చి విజయ్‌కు మొదటి అసెంబ్లీ విజయాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాజకీయ ప్రవేశం..

విజయ్ రాజకీయాల్లోకి రావడం కేవలం సినిమా క్రేజ్ మీద మాత్రమే ఆధారపడి లేదు. మారుతున్న తమిళ రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. కానీ, ఎన్నికల ప్రచారంలో చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు లేదంటే భద్రతా లోపాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. ప్రజల్లో గుర్తింపు పొందడం ముఖ్యం, కానీ అది ప్రజా భద్రతకు విఘాతం కలిగించకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికలు విజయ్ రాజకీయ జీవితానికి ఒక ‘లిట్మస్ టెస్ట్’ లాంటివి. హైవేపై సైకిల్ తొక్కడం ద్వారా ఆయన సాధించాలనుకున్న పబ్లిసిటీ లభించినా, అది ఓట్లుగా మారుతుందా..? అన్నది చూడాలి. పెరంబూర్‌లో గడ్డు కాలం, తిరుచ్చిలో అనుకూల పవనాల మధ్య తలపతి ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.