సీఎంగా విజయ్ ప్రమాణం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు.. త్రిష హైలెట్..
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత.. ప్రముఖ సినీనటుడు తలపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.
By: A.N.Kumar | 10 May 2026 10:27 AM ISTతమిళనాడు రాజకీయ చరిత్రలో ఆదివారం ఒక కొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత.. ప్రముఖ సినీనటుడు తలపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
రాజకీయ, సినీ రంగ ప్రముఖులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈ వేడుకకు రానుండగా సంప్రదాయం ప్రకారం పదవీ విరమణ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కూడా ఆహ్వానం పంపారు. దీంతో అధికార మార్పిడి కార్యక్రమం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ప్రముఖ నటి త్రిష కృష్ణన్. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరిగిన వేడుకకు ఆమె హాజరుకావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే విజయ్ – త్రిషల మధ్య సన్నిహిత సంబంధాలపై కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్న వేళ ఈ వేడుకకు త్రిష రావడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తమిళ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో నటితో విజయ్ సన్నిహితంగా ఉంటున్నారని ఆమె ఆరోపించినట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో ఏప్రిల్ 20న విచారణకు హాజరుకావాలని కోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో విజయ్, త్రిష కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైన ఫోటోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీసింది. గతంలో త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగి పెళ్లి రద్దైన విషయం కూడా మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
ఇక కొత్త కేబినెట్‌లో శాఖల కేటాయింపులు కూడా ఆసక్తికరంగా మారాయి. సీఎం విజయ్ హోం, ప్రజాపాలన శాఖలను తన వద్దే ఉంచుకోనున్నారు. ఆధవ అర్జున్‌కు క్రీడలు, ఎక్సైజ్ శాఖలు, సెంగొట్టాయన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ , వెంకట్రామన్‌కు పాఠశాల విద్యాశాఖ, ఎన్. ఆనంద్‌కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సీటీఆర్ నిర్మల్ కుమార్‌కు విద్యుత్ శాఖ, రాజమోహన్‌కు ఆదిద్రవిడ సంక్షేమ శాఖ, అరుణ్ రాజ్‌కు కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్ శాఖలను కేటాయించారు. అయితే ఎస్. కీర్తన, టీకే ప్రభులకు ఇంకా శాఖలు ఖరారు కాలేదు. అసెంబ్లీలో బల నిరూపణ పూర్తయ్యాక కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు యువ హీరోలు, సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్‌కు సినీ ప్రపంచం నుంచి లభిస్తున్న మద్దతు ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. తమిళనాడులో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే శక్తిగా విజయ్ ఎదుగుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
