తమిళనాడు రాజకీయాల్లో నవ శకం.. ముఖ్యమంత్రిగా 'దళపతి' విజయ్ పట్టాభిషేకం.. కేబినెట్ లోకి ఎవరంటే?
దశాబ్దాల సినీ ప్రస్థానం నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన 'దళపతి' విజయ్, తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త చరిత్రను లిఖించారు
By: A.N.Kumar | 10 May 2026 11:15 AM ISTదశాబ్దాల సినీ ప్రస్థానం నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన 'దళపతి' విజయ్, తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త చరిత్రను లిఖించారు. ఆదివారం ఉదయం చెన్నైలో జరిగిన అత్యంత వైభవమైన వేడుకలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేతగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సినిమా తెరపై అశేష జనవాహినిని ఉర్రూతలూగించిన ఆయన.. ఇప్పుడు రాజకీయ రంగస్థలంపై ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు చేపట్టి తన రాజకీయ ప్రస్థానంలో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపారు.
ఉత్కంఠకు తెర.. మద్దతు కూడగట్టిన 'విజయ్'
గత వారం రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి శనివారం రాత్రితో తెరపడింది. తొలుత ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ ఆలస్యం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, వీసీకే , ఐఎంయుఎల్ వంటి కీలక పక్షాలు విజయ్‌కు బేషరతు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. మద్దతు ఇస్తున్న పార్టీల ఎమ్మెల్యేల లేఖలతో విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి పొందారు. దీంతో తమిళ రాజకీయాల్లో ఒక బలమైన కూటమి సారథిగా ఆయన అవతరించారు.
జనసంద్రమైన చెన్నై.. 'బాహుబలి' రేంజ్ వేడుక
ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. “విజయ్ అనే నేను...” అంటూ ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం అభిమానుల జేజేధ్వానాలతో దద్దరిల్లిపోయింది. టీవీకే జెండాలతో చెన్నై నగరం మొత్తం పసుపు, ఎరుపు వర్ణ శోభితమైంది. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు "తలపతి సీఎం" అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా ఒక భారీ సినిమా వేడుకను తలపించింది.
ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేస్తున్న తీరు, అక్కడ నెలకొన్న జనసందోహం చూస్తుంటే రాజమౌళి చిత్రం "బాహుబలి"లోని పట్టాభిషేక సన్నివేశాలను తలపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కీలక శాఖలు విజయ్ వశం.. తొలి మంత్రివర్గ వివరాలు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తనదైన ముద్ర వేస్తూ మంత్రివర్గ శాఖల కేటాయింపులు చేశారు. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణపై పట్టు సాధించేందుకు హోం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ప్రజా పాలనతో పాటు ఇతర కీలక బాధ్యతలు కూడా ఆయన పర్యవేక్షణలోనే ఉండనున్నాయి.
విజయ్ సీఎం : హోం శాఖ, ప్రజా పాలన, ఇతర శాఖలు
సెంగొట్టయన్ : పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)
వెంకట రామన్ : పాఠశాల విద్యాశాఖ
ఎన్. ఆనంద్ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
సీటీఆర్ నిర్మల్ కుమార్ : విద్యుత్ శాఖ
రాజమోహన్ : ఆది ద్రావిడ సంక్షేమ శాఖ
అరుణ్ రాజ్ : కమర్షియల్ టాక్సెస్ , రిజిస్ట్రేషన్లు
సరికొత్త ఆశలతో ముందడుగు
ఇది కేవలం మొదటి విడత విస్తరణ మాత్రమేనని, త్వరలోనే రెండో విడతలో మరికొందరికి అవకాశం కల్పిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వెండితెరపై సామాజిక సమస్యల మీద గళమెత్తిన విజయ్, ఇప్పుడు నేరుగా అధికార పీఠం అధిష్టించి ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారోనని యావత్ తమిళనాడు ఆసక్తిగా గమనిస్తోంది. తనదైన మార్కు పాలనతో ద్రవిడ రాజకీయాల్లో విజయ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి
