రాజకీయాల్లో స్టార్ పవర్- విజయ్ చూపించిన రూట్
గతం వేరు వర్తమానం వేరు. దానికి కారణం ఎప్పటికప్పుడు మారుతున్న సమాజం గతి పరిస్థితి.
By: Satya P | 4 May 2026 10:52 PM ISTగతం వేరు వర్తమానం వేరు. దానికి కారణం ఎప్పటికప్పుడు మారుతున్న సమాజం గతి పరిస్థితి. దానికి తోడు ఆధునిక పోకడలు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ. ఇపుడు కూడా పాత రొడ్డ కొట్టుడు స్టైల్ ని వాడితే పొలిటికల్ స్టార్ గా మారడం బహు కష్టం అన్నది తెలిసిందే. గతంలో సినీ స్టార్స్ కి ఉన్న క్రేజ్ ఇమేజ్ మోజు అన్నీ కలిసి వారు కనిపిస్తే చాలు ఓట్లు కుమ్మరించేసేవారు. అలాగే పాత తరంలో కొందరు వెండి తెర నుంచి నేరుగా రాజకీయ తరె మీదకు వచ్చి సీఎంలు అయ్యారు. పొలిటికల్ సూపర్ స్టార్లు అయ్యారు. మరి తరువాత కాలంలో వారు ఎందుకు అవలేదు అంటే వారు పాత తరం వారి అడుగులలోనే నడుస్తూ పోవడం వల్ల అన్న విశ్లేషణ ఉంది.
గ్లామర్ ఒక్కటే కాదు :
సినీ హీరోలకు సహజంగా గ్లామర్ ఉంటుంది. దాంతో వారి చుట్టూ జనాలు పోగు అవుతారు. అంత మాత్రం చేత అది సరిపోతుందా ఓట్లు రాలుస్తుందా అసలు సభకు వచ్చిన వారు అంతా ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఉందా ఇవన్నీ ప్రశ్నలు. జవాబులు కూడా రెడీగా ఉన్నాయి. అనేక మంది ఫెయిల్యూర్స్ రూపంలో. అందువల్ల ఇది కాదు ఇంతకు ఇంతా ఏదో చేయాలి. మారిన జనాల ఆలోచనలు పట్టుకోవాలి. రీల్ తెరకు రియల్ తెరకు తేడా తెలుసుకోవాలి. జనాల మనసు గెలుచుకునే మార్గాలు అన్వేషించాలి. బహుశా ఇలాంటి విషయాల్లో దళపతి విజయ్ అయితే ఒక పెద్ద పరిశోధన చేసేశారు అని చెప్పాల్సి ఉంటుంది.
పట్టుదలతో పాటు చాలా :
సినీ గ్లామర్ అన్నది అదనపు ఆకర్షణగా భావించాలి. దానికి పట్టుదల జోడించాలి, గట్టి సంకల్పంతో బరిలోకి దిగాలి. అది జన విశ్వాసం చూరగొనేలా ఉండాలి. ఇకా కరెక్ట్ టైం టైమింగ్ కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే 2021లో డీఎంకే మీద జనాలకు పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. ఆ సమయంలో విజయ్ పార్టీ దిగితే ఫలితాలు వేరేగా వచ్చేవి. కానీ అయిదేళ్ల పాలన తరువాత ఇపుడు విజయ్ దిగారు. విపక్షం అన్నా డీఎంకే కి సరైన ఇమేజ్ ఉన్న లీడర్ లేరు, ఆ అవకాశాన్ని ఆయన వాడుకున్నారు. ఇక వీటితో పాటు తన పార్టీని జనంలోకి పంపించడం ఎలా అన్న దాని మీద వ్యూహాలు బాగా వేశారు. పొత్తులకు ఆస్కారం ఇవ్వకుండా క్లీన్ గా జనం ముందుకు వచ్చారు. దాంతో ఆయా పార్టీల మీద ఉన్న మచ్చలు విమర్శలు తనకు అంటుకోకుండా ఫ్రెష్ లుక్ ఇచ్చారు. వీటితో పాటు తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఆధునిక సాంకేతిక సంపత్తికి తగిన విధంగా వాడుకున్నారు. ఆదర్శాలు వల్లించలేదు, కులం మతం ప్రాంతం ఇవన్నీ రాజకీయాల్లో కీలకం. వాటి ఫార్ములాను కూడా తెలుసుకుని ఆ విధంగా ఎక్కడ లెక్క అక్కడ సరి చేసుకుంటూ పోయారు. ఫలితంగా విజయ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు.
సరికొత్త అధ్యాయంగా :
ఇది విజయ్ తోనే ఆగిపోదు, చాలా మంది సినీ సెలెబ్రిటీలు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటారు. వారికి విజయ్ రాజకీయ ప్రయాణం ఒక కొత్త అధ్యాయంగా ఉండబోతోంది. అంతే కాదు సరికొత్త పాఠంగా నిలుస్తుంది. ఎపుడు పడితే అపుడు రాజకీయాల్లోకి వచ్చినా గ్లామర్ ఉంది కదా అని బీరాలు పోయినా తాము తప్ప ఆల్టర్నేషన్ లేదని అతి ధీమాకు పోయినా కూడా బూమరాంగ్ అవుతుందని కూడా తెలుసుకోవాలి. అందుకే విజయ్ సాధించిన విజయం సినీ సెలబ్రిటీలకు అనేక రకాలుగా దిశా నిర్దేశం చేస్తోంది అని చెప్పాల్సి ఉంది. ఒక విధంగా ఆయన రాజకీయాలను పునర్ నిర్వచించారు అని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
