పూరి టు పుష్ప... కరూర్ తొక్కిసలాటపై సంచలన విశ్లేషణ!
అవును... కరూర్ లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనపై భూవులగిన్ నంబర్గళ్ అనే సంస్థ కీలక విశ్లేషణ తెరపైకి తెచ్చింది.
By: Raja Ch | 10 Nov 2025 1:59 PM ISTసెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తమిళగం వెట్రి కజగం (టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ రోడ్ షో లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు మరో 100 మంది వరకూ గాయపడ్డారు. ఇది తమిళనాడు రాజకీయాల్లోనే కాదు దేశ వ్యాప్తంగానూ హాట్ టాపిక్ గా మారింది.
ఈ సమయంలో నేరం పోలీసులది, ప్రభుత్వానిది అని ఒకరంటే.. తప్పంతా టీవీకే పార్టీ పెద్దలది అని మరొకరు అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయ సమీకరణాలు కూడా మారాయనే చర్చ జరిగిన పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే... ఈ దారుణ సంఘటనపై చెన్నైకి చెందిన పర్యావరణ స్వచ్ఛంద సంస్థ "భూవులగిన్ నంబర్గళ్" (భూ మిత్రులు) ఓ కీలక విశ్లేషణ తెరపైకి తెచ్చింది.
అవును... కరూర్ లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనపై భూవులగిన్ నంబర్గళ్ అనే సంస్థ కీలక విశ్లేషణ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా... ఇరుకు ప్రాంతాల్లో ఈ తరహా రోడ్ షోలు పెట్టడం, జనాలు భారీగా గుమిగూడటం వల్ల ఆ ప్రాంతాల్లో వేడి పెరిగి, భూతాపానికి కారణమవుతోందని తెలిపింది. కరూర్ లోనూ అదే జరిగిందని వెల్లడించింది.
భారీ ఎత్తున జనం చేరుకోవడంతో అక్కడ ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పులపై ఈ సంస్థ పరిశోధన చేపట్టినట్లు తెలిపింది. దీనికోసం... సొంతంగా రూపొందించిన పునల్ ఫ్రేమ్ వర్క్ తో స్థానిక సమాచారంతో పాటు గూగుల్ ఎర్త్, ఇండియన్ మెటలార్జికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ), పలు థర్మల్ ఎనాలసిస్ టూల్స్, 3డీ రేడియేషన్ మోడల్స్, థర్మోసైకలాజికల్ మోడల్స్ ను తీసుకుని డేటాను విశ్లేషించింది.
ఫలితంగా... కరూర్ సభకు ముందు నామక్కల్ లో విజయ్ రోడ్ షో చేశారని.. కరూర్ లో సభ కూడలి నుంచి బయటకు వెళ్లేందుకు అక్కడ సరైన దారుల్లేవని.. 20 వేలకుపైగా జనాలు రావడంతో తోపులాట జరిగిందని.. దానికి తోడు కొన్ని గంటలపాటు వేచి ఉన్న ప్రజలు నీరు, నీడ లేకపోవడంతో సొమ్మసిల్లారని చెబుతూ... ర్యాలీకి ఎంపిక చేసుకున్న ప్రాంతం ముప్పుతో కూడినదని తేలిందని వెల్లడించింది.
సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పటికంటే ఎక్కువ వేడి!:
కరూర్ లో రోడ్ షో కి ఎవరు ఎన్ని లెక్కలు చెప్పినా కనీసం 50 వేల మంది హాజరై ఉంటారని అంటున్నారు. అంటే... సగటున చదరపు మీటర్ కు నలుగురు మించి జనం ఉన్నారన్నమాట. దీనికి తోడు నెత్తుకోవడాలు, కేకలు వేయడాలు, ఈలలు ఊదడాలతో ఒక్కో వ్యక్తి నుంచి సుమారు 250 వాట్ల వేడి శక్తిని వదిలినట్లు అంచనా వేస్తున్నారు. అంటే.. చదరపు మీటరుకు 1,000 వాట్స్ పైనే అన్నమాట.
వాస్తవానికి సూర్యుడు మధ్యాహ్నం నడినెత్తిన ఉన్నప్పుడు చదరపు మీటరుకు 800 వాట్ల వేడి వస్తుంది. అంటే... ఆ సమయంలో కరూర్ లో టీవీకే సభ వద్ద వేడి అంతకు మించి ఉందన్నమాట. దీనికి తోడు కరూర్ లో ఆ రోజు గాలి సెకనుకు 5 మైళ్ల వేగంతో వీస్తుంటే.. సభా ప్రాంగణంలో మాత్రం ఒక మైలులోపే ఉందని చెబుతున్నారు.
విజయ్ రాకముందే ఓ తల్లీ, బిడ్డ మృతి!:
వాస్తవానికి విజయ్ ర్యాలీ జరిగిన ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే జనాల రద్దీతో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు మించిపోయిందని.. ఆ తర్వాత 40 నుంచి 42 డిగ్రీల దాకా వెళ్లిందని.. ఇలాంటి వాతావరణంలో 6 గంటలపాటు వేచి ఉండటంతో ఒక్కొక్కరుగా సొమ్మసిల్లడం మొదలైందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే... విజయ్ రాక మునుపే ఓ తల్లి, బిడ్డ మృతి చెందారని చెబుతున్నారు.
పూరీ టూ పుష్ప!:
ఈ ఏడాది పూరి జగన్నాథ యాత్ర నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ లో పుష్ప సినిమా హాలు వద్ద జరిగిన తొక్కిసలాట వరకూ ఎన్నో దారుణ ఘటనలు సంభవించాయి. ఇందులో భాగంగా... కుంభమేళా తొక్కిసలాట, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ విజయయాత్ర తదితర ఘటనల్లో వాతావరణ మార్పుల కారణంగా శరీరాలు అసౌకర్యానికి గురయ్యాయని చెబుతున్నారు.
