Begin typing your search above and press return to search.

విజయ్ విక్టరీ ఊపు... జూనియర్ ఫ్యాన్స్ కి కొత్త హుషార్

వెండి తెర బంధం రాజకీయ తెరపైన పెద్దగా పండదని గత కొన్ని దశాబ్దాలుగా ఒక రకమైన ప్రతికూల విశ్లేషణ అయితే ఉంది.

By:  Satya P   |   5 May 2026 4:00 AM IST
విజయ్ విక్టరీ ఊపు... జూనియర్ ఫ్యాన్స్ కి కొత్త హుషార్
X

వెండి తెర బంధం రాజకీయ తెరపైన పెద్దగా పండదని గత కొన్ని దశాబ్దాలుగా ఒక రకమైన ప్రతికూల విశ్లేషణ అయితే ఉంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. సినీ రంగం నుంచి చాలా మంది తామర తంపరగా వచ్చి తమ లక్ ని అక్కడ పరీక్షించుకున్నా కూడా చివరికి ఏమీ పెద్దగా సాధించలేకపోయారు. సినీ రంగంలో సూపర్ హీరోలుగా ఉన్న వారు రాజకీయాల్లో మాత్రం పక్క వాయిద్యాలుగానే మిగిలిపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో పాటు ప్రజలలో చైతన్యం పెరిగింది అని సినీ హీరోలను రాజకీయాల్లో లీడర్లుగా యాక్సెప్ట్ చేయడం లేదన్న ప్రచారం కూడా సాగింది. వారు రీల్ హీరోలుగా మాత్రమే ఉంటారు తప్పించి రియల్ హీరోలు కాలేరని కూడా రాజకీయ పక్షం వైపు నుంచి కూడా హాట్ కామెంట్స్ వచ్చి పడ్డాయి. కానీ విజయ్ మాత్రం మొత్తానికి మొత్తం తీసి అవతల పెట్టేశారు.

సత్తా ఉంటే కొట్టొచ్చు :

ఏ రంగం అయినా వీరంగం ఆడాలీ అంటే సత్తా ఉంటే చాలు అని దళపతి విజయ్ రుజువు చేశారు. మనలో పట్టుదల నిబద్ధత ఉండాలని అపుడు రాజకీయాల్లోనూ రీల్ హీరోలను ఆదరించి అక్కున చేర్చుకుంటారు అని విజయ్ స్పష్టం చేశారు. దీంతో చాన్నాళ్ళ తరువాత సినీ రంగం నుంచి రాజకీయాల్లో అత్యున్నత పీఠం సీఎం సీటుని అందుకుంటున్న జన నాయకుడిగా విజయ్ రికార్డు సృష్టించారు. ఇది సినీ రంగంలో అంబరాలను చుంబిస్తూ అశేషమైన అభిమాన గణాన్ని తమ వెంట ఉంచుకున్న హీరోలకు రాజకీయంగా తమకూ బ్రహ్మాండమైన చాన్స్ ఉందని తెలియజెప్పే విధంగా మారిందని అంటున్నారు.

గురి ఉంటే రాజకీయ సిరి :

ఏ రంగంలో అయినా విజయాలు అంత సులువుగా దరికి చేరవు. సినిమాల్లో అయినా ఎవరూ ఓవర్ నైట్ హీరో అయిపోలేదు. అలాగే రాజకీయాల్లో కూడా ఇలా పార్టీ పెట్టి అలా అధికారం అంటే కుదరదు. దాంతో పాటుగా కఠోర శ్రమ చేయాలి. జనాలు విశ్వసించేలా వ్యవహార శైలి ఉండాలి. సీరియస్ పొలిటీషియన్ అనిపించుకోవాలి. అపుడు కచ్చితంగా జనాలు చూస్తారు అన్నది విజయ్ మార్క్ పాలిటిక్స్ స్పష్టం చేసింది. ప్రజలకు నాయకుడు అన్న వారు తమ వెంట తమ కోసం ఉన్నారు అన్న భావన రీల్ హీరోలు కలిగించాలి. అప్పుడు విక్టరీ కచ్చితంగా దక్కుతుందని అంటున్నారు.

జూనియర్ కి రాచబాట :

ఇక ఏపీలో చూస్తే సినీ రాజకీయ బంధాలు ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. నందమూరి వంశంలో చూసుకుంటే మూడవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేసి పెట్టారు. ఇక ప్రస్తుతం జూనియర్ వయసు 43 ఏళ్ళు మాత్రమే. ఆయన సినీ రంగంలో కీలక దశలో ఉన్నారు. కానీ జూనియర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ రోజు కాకపోయినా 2029 ఎన్నికలు కాకపోయినా 2034 ఎన్నికలకు అయినా జూనియర్ దిగాల్సిందే అన్నది వారి డిమాండ్ గా ఉంది. అప్పటికి జూనియర్ కి 51 ఏళ్ళు వస్తాయి. అంటే ప్రస్తుతం విజయ్ వయసు అన్న మాట.

రేపటి రోజున సీఎం :

ఆ ఏజ్ లో ఆయన రాజకీయాల్లోకి వస్తే యూత్ లీడర్ గా ఉన్నట్లే లెక్క అని అంటున్నారు. దాంతో జూనియర్ వస్తే అక్కున చేర్చుకునేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు అని అంటున్నారు. దానికి విజయ్ కి దక్కిన సూపర్ సక్సెస్ ని జూనియర్ ఫ్యాన్స్ ఉదహరిస్తున్నారు. అయితే విజయ్ కి ఉన్నట్లే జూనియర్ కి కూడా రాజకీయ ఆకాంక్ష ఉందని అంటున్నారు. కానీ ఆయన ఇపుడు బిజీ గా సినీ ఫీల్డ్ లో ఉన్నారు. సరైన సమయం వచ్చినపుడు జూనియర్ వచ్చి తీరుతారు అని అంటున్నారు. సో జూనియర్ ఫ్యాన్స్ అయితే మా హీరో కూడా రేపటి రోజున సీఎం అవుతారు అని చెప్పుకునేందుకు విజయ్ సూపర్ సక్సెస్ అన్నది కళ్ళ ముందు నిలుస్తోంది అని విశ్లేషిస్తున్నారు.