Begin typing your search above and press return to search.

కిర్రాకు పుట్టించేస్తున్న దళపతి విజయ్

దళపతి తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రత్యర్థుల గుండెళ్ళో రైళ్ళు పరిగెట్టిస్తున్నారు.

By:  Satya P   |   22 Sept 2025 4:00 PM IST
కిర్రాకు పుట్టించేస్తున్న దళపతి విజయ్
X

దళపతి తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రత్యర్థుల గుండెళ్ళో రైళ్ళు పరిగెట్టిస్తున్నారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. సుమారు మూడు దశాబ్దాల పాటు తమిళ తెర మీద సూపర్ స్టార్ గా ఏలారు. యాభై ఏళ్ళ పడిలో ఉన్న విజయ్ ప్రజా సేవ చేయాలని రాజకీయాలను ఎంచుకున్నారు. ఆయన తాజాగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ సభలకు వస్తున్న జనాలు లక్షల్లో ఉంటున్నారు. జన సునామీ అంటే ఇదే అన్నట్లుగా విజయ్ మీటింగ్స్ హోరెత్తిస్తున్నారు. విజయ్ ఏమి చెప్పినా జనాలు మెస్మరైజ్ అయిపోతున్నారు. తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా విజయ్ సభలు హౌస్ ఫుల్ గా సాగుతూ ప్రత్యర్ధులకు యమ టెన్షన్ పెట్టేస్తున్నాయి.

ఒకే ఒక్కడుగా :

విజయ్ సభలకు వస్తున్న జనాలను చూసిన ప్రత్యర్ధి పార్టీలకు ఏమీ పాలు పోవడం లేదు. ఏమిటి ఇంత జనం వస్తున్నారు. నిజంగా విజయ్ అంటే జనాలకు ఇంతలా పిచ్చి ఉందా అని చర్చించుకుంటున్నారు. ఏమిటి విజయ్ జనంలో కిర్రాకు పుట్టించేస్తున్నారే అని కూడా అంటున్నారు. వచ్చిన జనాలు అలా ఆయన స్పీచ్ వింటూ తమను తాము మరచిపోతున్నారు. దీనిని చూసిన రాజకీయ విశ్లేషకులు సైతం ఇది సినిమా గ్లామర్ మాత్రమే కాదు అంతకు మించి ఏదో ఉంది అని అంటున్నారు. విజయ్ క్రౌడ్ పుల్లర్ గా మారారు. ఒకే ఒక్కడిగా బరిలోకి దిగి ప్రత్యర్ధులను అల్లల్లాడిస్తున్నరు

మార్పు కోసమా :

తమిళనాడులో అయిదేళ్ళు మాత్రమే ఒక పార్టీకి అధికారం ఇస్తారు. ఆ తరువాత రెండవ పార్టీని తెచ్చి పెడతారు. దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న రాజకీయమే అలా ఉంటుంది. ఈసారి చూస్తే డీఎంకే అధికారంలో ఉంది. అయిదేళ్ళు పూర్తి చేసుకున్న స్టాలిన్ ప్రభుత్వానికి సహజంగానే యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అంటున్నారు. అయితే దానిని సొమ్ము చేసుకోవడానికి అన్నా డీఎంకేకు అంత సత్తా లేదని అంటున్నారు. ఆ పార్టీకి ప్రజాకర్షణ కలిగిన నాయకత్వం లేమి పీడిస్తోంది. బీజేపీతో పొత్తు ప్లస్ నా లేక మైనస్ నా అన్నది తరువాత తేలే విషయమని అంటున్నారు. దాంతో ఇపుడు మార్పు కోరుతున్న జనాలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

కన్ను గీటుతున్న పార్టీలు :

విజయ్ కి వస్తున్న ఆదరణను చూసిన రాజకీయ పార్టీలు కన్ను గీటుతున్నాయి. విజయ్ పార్టీతో పొత్తుకు అన్నా డీఎంకే పూర్తిగా ఆసక్తిని ప్రదర్శిస్తోంది. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం పళని స్వామి అయితే విజయ్ పార్టీతో పొత్తు ఉండాల్సిందే అంటున్నారు. అయితే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విజయ్ అన్నా డీఎంకేతో కలవడం కష్టమే అంటున్నారు. ఇంకో వైపు కాంగ్రెస్ తమిళనాడు శాఖ కూడా తమకు ఈసారి డీఎంకే ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. అలా కనుక కుదరకపోతే తాము వేరే మార్గాలు చూసుకుంటామని అంటున్నట్లుగా చెబుతున్నారు. అంటే విజయ్ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది అన్న చర్చ సాగుతోంది. మొత్తం మీద చూస్తే విజయ్ పొలిటికల్ అట్రాక్షన్ గా మారిపోయారు. అయితే తనకు వస్తున్న జనాలను చూసి విజయ్ ఒంటరి పోరుకే సిద్ధపడతారు అని అంటున్నారు.