పక్కా ప్రొఫెషనల్ పొలిటీషియన్ : 'ఒకే ఒక్కడు' లుక్‌లో ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు!
దశాబ్దాల కాలంగా ద్రవిడ రాజకీయాల అంచున సాగుతున్న సంప్రదాయాలకు స్వస్తి పలుకుతూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు తమిళ వెట్రి కజగం (టీవీకే) అధినేత, దళపతి జోసెఫ్ విజయ్.
By: A.N.Kumar | 10 May 2026 11:44 AM ISTతమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా ద్రవిడ రాజకీయాల అంచున సాగుతున్న సంప్రదాయాలకు స్వస్తి పలుకుతూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు తమిళ వెట్రి కజగం (టీవీకే) అధినేత, దళపతి జోసెఫ్ విజయ్. కేవలం వెండితెరపైనే కాదు.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ రణక్షేత్రంలోనూ ఆయన 'ఒకే ఒక్కడు' అని నిరూపించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఆయన ఎంచుకున్న వేషధారణ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సంప్రదాయాలకు భిన్నంగా.. కార్పొరేట్ స్టైల్‌లో జననేత
సాధారణంగా తమిళ రాజకీయ నాయకులు అంటే తెల్లటి ఖద్దర్ చొక్కా, కంచి పట్టు అంచున్న తెల్ల పంచె ధరించడం ఒక ఆనవాయితీ. పెరియార్, అన్నాదురై నుంచి కరుణానిధి, జయలలిత, స్టాలిన్ వరకు అందరూ ద్రవిడ సంస్కృతికి ప్రతీకగా ఆ వేషధారణనే అనుసరించారు. అయితే వీరందరికీ భిన్నంగా విజయ్ తన ప్రొఫెషనల్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న వేళ ఆయన వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి ఎంతో హుందాగా కనిపించారు. ఒక కార్పొరేట్ సంస్థ సీఈఓను తలపించేలా ఉన్న ఆయన లుక్, రాజకీయాల్లోకి వస్తున్న మార్పుకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. "రాజకీయం అంటే కేవలం వేషధారణ మార్చడం కాదు, పని తీరులో ఆధునికతను తీసుకురావడం" అనే సందేశాన్ని విజయ్ తన స్టైల్ ద్వారానే చెప్పకనే చెబుతున్నారు.
సోషల్ మీడియాలో 'ఒకే ఒక్కడు' వైబ్స్
విజయ్ తాజా ఫొటోలు బయటకు రాగానే సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం మొదలైంది. నెటిజన్లు ఆయనను చూసి వెంటనే దర్శకుడు శంకర్ సృష్టించిన క్లాసిక్ చిత్రం ‘ఒకే ఒక్కడు’ లో అర్జున్ సర్జా పాత్రతో పోలుస్తున్నారు. ఆ సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రిగా అర్జున్ ఫార్మల్ డ్రెస్ ధరించి అవినీతిపై ఎలా విరుచుకుపడ్డారో ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి వస్తున్నారని అభిమానులు సంబరపడుతున్నారు. "రీల్ సీఎం నుంచి రియల్ సీఎం వరకు సాగిన ఈ ప్రయాణం అద్భుతం. తమిళనాడు ఇప్పుడు కొత్త తరం నాయకత్వంలోకి అడుగుపెడుతోంది." అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
కొత్త రాజకీయ సంస్కృతికి నాంది
విజయ్ తన రాజకీయ అరంగేట్రం నుంచే యువతను, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ప్రసంగాలు, మేనిఫెస్టో మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన అప్పీరెన్స్ కూడా ‘న్యూ ఏజ్ పాలిటిక్స్’ను ప్రతిబింబిస్తోంది. నేటి తరం యువత ప్రొఫెషనల్ , మోడ్రన్ నాయకత్వాన్ని కోరుకుంటోంది. విజయ్ లుక్ ఆ ఆకాంక్షలకు అద్దం పడుతోంది. సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పరిపాలనలో డిగ్నిటీ, డిసిప్లిన్ ఉంటాయని ఆయన బాధ్యతలు చేపట్టకముందే నిరూపిస్తున్నారు.
చెన్నైలో పండగ వాతావరణం
విజయ్ ప్రమాణస్వీకార మహోత్సవం కోసం తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు, టీవీకే కార్యకర్తలు భారీగా చెన్నైకి చేరుకుంటున్నారు. నగరం మొత్తం పండుగ వాతావరణం సంతరించుకుంది. వెండితెరపై కోట్లాది మందిని మెప్పించిన తమ ప్రియతమ నటుడు, ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును మార్చే నాయకుడిగా పగ్గాలు చేపడుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
తమిళనాడు రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవిడ సిద్ధాంతాల పునాదులపై ఆధునిక ఆలోచనలతో కార్పొరేట్ స్టైల్ మేనేజ్‌మెంట్‌తో విజయ్ సాగించబోయే ఈ ప్రయాణం ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఏది ఏమైనా ఆయన ఎంచుకున్న ఈ సరికొత్త బాట తమిళ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపు అని చెప్పడంలో సందేహం లేదు.
